- ఏడాది నుంచి దేశంలోనే ఎక్కువ
- కష్టార్జితాన్ని కోల్పోతున్న ప్రజలు
- చోద్యం చూస్తున్న టీఎస్ రెరా
- పట్టించుకోని నిర్మాణ సంఘాలు
అంతర్జాతీయ నగరంగా ఖ్యాతినార్జించాల్సిన హైదరాబాద్.. దేశంలోనే ప్రీలాంచ్ స్కాములకు రాజధానిగా మారింది. పలు రియల్ సంస్థలు కొనుగోలుదారుల నుంచి కోట్ల రూపాయల్ని వసూలు చేసి.. వారి నెత్తి మీదే శఠగోపం పెట్టాయి. ఇదే బాటలో మరికొన్ని సంస్థలూ ఉన్నాయి. ఈ అక్రమ అమ్మకాల గురించి క్రెడాయ్ హైదరాబాద్ వంటి నిర్మాణ సంఘాలకు తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా, ప్రీలాంచ్ స్కాములు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. దీంతో, దేశవ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు ఎక్కడ్లేని తూట్లు పడుతున్నాయి.
గత ప్రభుత్వం హైదరాబాద్ గురించి చేసిన హైప్ కారణంగా.. ఇతర రంగాల నుంచి అనేకమంది రియల్ రంగంలోకి విచ్చేశారు. ముందుగా స్థలమైతే తీసుకుని.. ప్రీలాంచుల్లో ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయించేశారు. కొనుగోలుదారుల నుంచి కోట్ల రూపాయల్ని వసూలు చేశారు. తర్వాత అనుమతులు ఎలా తెచ్చుకోవాలో తెలియక.. మార్కెట్ స్థితిగతుల నుంచి బేరీజు వేయకుండా.. అనుకున్నంతగా అప్పులు చేతికి రాక.. చేతిలో ఉన్న సొమ్మును ఖర్చు పెట్టేసి..
నిర్మాణం ఆరంభించాల్సిన సమయం వచ్చేసరికి.. ఏం చేయాలో తెలియక చేతులెత్తేశారు. ఇందులో కొందరు కొన్ని నెలల్నుంచి కస్టమర్లకు తప్పించుకుని తిరుగుతున్నారు. ఇంకొందరేమో మాయమాటలు చెబుతూ కాలం గడిపేస్తున్నారు. దీంతో, చిర్రెత్తుకొచ్చిన బయ్యర్లు పోలీసు స్టేషన్లలో కేసులను ఫైలు చేశారు. కేసుల్ని పెట్టడం వల్ల సొమ్ములు చేతికొస్తాయో లేవో తెలియదు కానీ.. కొత్తవాళ్లు మోసపోకుండా ఉండేందుకు కేసుల్ని పెట్టామని కొందరు బయ్యర్లు ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.
కొన్ని స్కాములు.. క్లుప్తంగా..
హైదరాబాద్‌లో పలు రియల్ సంస్థలు ప్రీలాంచుల పేరిట ప్రజల నెత్తిమీద శఠగోపం పెట్టాయి. మరి, ఏయే సంస్థలు ఎంతెంత మేరకు వసూలు చేసి ప్రజల్ని మోసం చేశాయో.. ఈ కింది పట్టిక చూస్తే అర్థమవుతుంది.
సాహితీ గ్రూప్ 1500 కోట్లు
జయాగ్రూప్ 300 కోట్లు
మైత్రీ ప్రాజెక్ట్స్ 100 కోట్లు
భువనతేజ 200 కోట్లు
ఓబిలీ ఇన్‌ఫ్రా 20 కోట్లు
జేవీ ఎస్టేట్స్ 300 కోట్లు
జేజే ఇన్‌ఫ్రా 10 కోట్లు
భారతి బిల్డర్స్ 300 కోట్లు