ప్రముఖ పర్యాటక ప్రదేశం హాంకాంగ్ లో గతేడాది సగటు అద్దె ధరలు 5.8 శాతం పెరిగాయి. 2025లో ఇదే ఒరవడి కొనసాగడంతోపాటు అద్దెల పెరుగదల 2024ని మించిపోతుందని అంచనా. వాస్తవానికి ఈ ఏడాదే హాంకాంగ్ లో అద్దెలు రికార్డు స్థాయికి చేరుకోనున్నాయి. ఆగస్టు 2019 నుంచి చూస్తే మునపటి గరిష్ట స్థాయిని ఇది అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హాంకాంగ్ కు కొత్తగా వస్తున్నవారి నుంచి డిమాండ్ పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రతిభను ఆకర్షించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన టాప్ లాటెంట్ పాస్ స్కీమ్ వంటి కార్యక్రమాలు అద్దె డిమాండ్ ను మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.
ఇళ్లను అద్దెకు తీసుకునే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య, నైపుణ్యం కలిగిన నిపుణుల స్థిరమైన ప్రవాహంతో అద్దె ధరలు పెరుగుతూనే ఉంటాయని అంచనా వేస్తున్నాను. “2024లో, మా కోలైఫ్ అపార్ట్ మెంట్ల అద్దె ఖర్చులు 10 శాతం పెరిగాయి. 2025లో 20% వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. కొత్తగా వస్తున్నవారితోపాటు విద్యార్థుల నుంచి డిమాండ్ ఉండటంతోపాటు మార్కెట్ ధరలలో సాధారణ పెరుగుదల, చాలా ఇళ్లు సౌకర్యవంతంగా లేకపోవడం, స్టైల్ గా ఉండకపోవడం, ప్రజలు నివసించాలనుకునే అపార్ట్ మెంట్లలో కో లివింగ్ ఆప్షన్లు లేకపోవడం వంటి కారణాలతో డిమాండ్ అనేది సరఫరాను మించిపోయింది’ అని ప్రాపర్టీ రెంటల్, మేనేజ్మెంట్ సర్వీస్ అయిన కోలైఫ్ హాంకాంగ్ జనరల్ మేనేజర్ ఎకటెరినా లిచాక్ తెలిపారు.
ఈ నేపథ్యంలో అద్దెపై ఆదా చేయడానికి స్థిరమైన నెలవారీ రేటుతో దీర్ఘకాలిక ఒప్పందాలను చేసుకోవాలని సూచించారు. ఉదాహరణకు, కాజ్వే బేలోని ఒక గది ప్రస్తుతం కోలైఫ్ ద్వారా నెలకు 14,000 హాంకాంగ్ డాలర్లకు అద్దెకు లభిస్తోంది. ఇప్పుడే దీర్ఘకాలానికి అదే మొత్తంతో ఒప్పందం చేసుకుంటే డబ్బు ఆదా అవుతుందని పేర్కొన్నారు.