- దేశంలోనే పేరెన్నిక గల నిర్మాణ సంస్థ
- ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద వసూలు
- ప్రాజెక్టు చేపట్టడానికి ఈ సంస్థ వద్ద నిధుల్లేవా?
- అందుకే, బయ్యర్ల నుంచి సొమ్ము వసూలా?
దేశంలోనే పేరెన్నిక గల నిర్మాణ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్.. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో కొత్త ప్రాజెక్టును ఆరంభిస్తోంది. ఈ ప్రాంతం అటు శంషాబాద్ విమానాశ్రయానికి ఇటు ఐటీ సంస్థలకు నడిమధ్యలో ఉంటుంది కాబట్టి.. గోద్రెజ్ ప్రాపర్టీస్ తో సహా పలు సంస్థలు.. కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాయి. ఇంతవరకూ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే, సమస్య ఏమిటంటే.. గోద్రెజ్ ప్రాపర్టీస్ టీజీ రెరా నిబంధనల్ని బేఖాతరు చేస్తూ.. స్థానిక సంస్థల నుంచి అనుమతిని తీసుకోకుండానే.. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట.. అక్రమ రీతిలో ఫ్లాట్లను విక్రయిస్తోంది. దేశంలోనే ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఇలా రెరా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటే.. టీజీ రెరా కళ్లు మూసుకుందా? స్థానిక బిల్డర్ల వల్ల చిన్న తప్పు జరిగితే జరిమానా విధించే టీజీ రెరా గోద్రెజ్ ప్రాపర్టీస్ ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జాగా ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయిస్తుంటే ఏం చేస్తోందని.. స్థానిక బిల్డర్లు, కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు.
కేవలం గోద్రెజ్ ప్రాపర్టీస్ సంస్థే కాదు.. ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరుకు చెందిన పలు నిర్మాణ సంస్థలు హైదరాబాద్ నగరంలో.. ఎలాంటి జంకు లేకుండా ప్రీలాంచ్ అమ్మకాల్ని చేస్తున్నారు. అసలు వీరికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? ఎవరేం చేసినా టీజీ రెరా పట్టించుకోదని వీరు భావిస్తున్నారా? లేక టీజీ రెరా ఛైర్మన్‌తో సహా సభ్యుల చేతిలో కొంత సొమ్ము ముట్టచెబితే.. చూసీచూడనట్లు వ్యవహరిస్తారనే విషయం దేశవ్యాప్తంగా నిర్మాణ సంస్థలకు తెలిసిపోయిందా? అందుకే, పరాయి రాష్ట్రాల బిల్డర్లు హైదరాబాద్‌కి విచ్చేసి ఇలా ప్రీలాంచ్లో ఫ్లాట్లను విక్రయిస్తున్నారా? అదే హైదరాబాద్ నగరానికి చెందిన బిల్డర్లు ముంబైకి వెళ్లి ఇలా ప్రీలాంచ్లో ఫ్లాట్లను విక్రయించగలరా? అలా చేస్తే మహారెరా ఊరుకుంటుందా?
* గోద్రెజ్ ప్రాపర్టీస్ రాజేంద్రనగర్లో 12 ఎకరాల్లో ఆరంభించే ప్రాజెక్టులో.. టూ బెడ్రూమ్ ఫ్లాట్ల (1300-1400 ఎస్ఎఫ్‌టీ) ను కొనేవారు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట సుమారు ఆరు లక్షలను గోద్రెజ్ పేరిట చెక్కులను ఇవ్వాలట. త్రీ బీహెచ్‌కే ఫ్లాట్లు (1650-1800 ఎస్ఎఫ్‌టీ) కావాలంటే రూ.7.5 లక్షలు.. 3 బీహెచ్‌కే లార్జ్ ఫ్లాట్ల (1850- 2350 ఎస్ఎఫ్‌టీ) కోసం రూ.9 లక్షలు.. 4 బీహెచ్‌కే ఫ్లాట్లు (2900 ఎస్ఎఫ్‌టీ) కొనుక్కోవాలంటే సుమారు రూ.15 లక్షలను ముందస్తుగా చెక్కులను గోద్రెజ్ సంస్థకు అందజేయాలట. ఈవోఐ కింద ముందస్తు చెక్కుల్ని ఇచ్చేవారు అత్యుత్తమ ఫ్లాట్లను ఎంపిక చేసుకోవచ్చనే ఆశను గోద్రెజ్ సంస్థ కల్పిస్తోంది. ఇందులో చదరపు అడుక్కీ రూ.7000 నుంచి 7500 మధ్యలో ధరను నిర్ణయించారు. ఈవోఐ కింద ఫ్లాట్లను విక్రయించకూడదని.. అది రెరా నిబంధనలకు విరుద్ధమని.. గతంలో టీజీ రెరా ఛైర్మన్ పలు సందర్భాల్లో తెలియజేశారు. మరి, గోద్రెజ్ ప్రాపర్టీస్ వంటి బడా సంస్థలే.. ఇలా ప్రీలాంచ్లో ఫ్లాట్లను విక్రయిస్తుంటే.. టీజీ రెరా ఎలాంటి చర్యల్ని తీసుకోలేని నిస్సహాయ స్థితిలో పడిపోయిందా?
గోద్రెజ్ ప్రాపర్టీస్ వంటి బడా నిర్మాణ సంస్థ.. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమేంటి? ఇంటి కొనుగోలుదారుల వద్ద సొమ్ము తీసుకుని ఫ్లాట్లను కట్టడమేమిటి? అంటే ఈ సంస్థ వద్ద హైదరాబాద్‌లో ప్రాజెక్టును చేపట్టడానికి తగినంత నిధుల్లేవా? అందుకే, ఇలా ప్రీలాంచ్లో ఫ్లాట్లను అమ్ముతోందా? అంటూ కొనుగోలుదారులు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. టీజీ రెరాను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తే తప్ప.. ఈ ప్రీలాంచ్ అమ్మకాల్ని అరికట్టలేరు. మళ్లీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినట్లే.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ప్రీలాంచ్ మోసాలు పెరిగిపోతుండటం దారుణమైన విషయం.