Categories: TOP STORIES

బాల‌కృష్ణ వ‌ద్ద దొరికిన ఆస్తుల విలువ‌.. రూ.100 కోట్లుగా గుర్తింపు

* ఇంకా పెరిగినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు
* కోర్టులో హాజ‌రుప‌రిచి.. మ‌ళ్లీ క‌స్ట‌డీలోకి!
* బినామీల‌ను ప్ర‌శ్నించే ప‌నిలో ఏసీబీ
* ఎవ‌రెవ‌రు ఏమిచ్చార‌నే కోణంలో ద‌ర్యాప్తు
* ఆయ‌న‌కు స‌న్నిహిత రియ‌ల్ట‌ర్లు, ఏజెంట్ల‌పై న‌జ‌ర్‌..

హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో భారీగా ఆస్తులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. వాటి విలువ మార్కెట్ వేల్యూ ప్రకారం 100 నుంచి 200 కోట్ల రూపాయల ఆస్తులుగా ఉన్న‌ట్లు అధికారులు తొలుత గుర్తించారు. నానక్ రామ్ గూడలోని ఆయ‌న ఇంట్లో దొరికిన నగలు, 84 ల‌క్ష‌ల నగదు, ఆస్తుల పత్రాలను స్వాధీన‌ప‌ర్చుకున్నారు. హైదరాబాదులో విల్లాలు, ఫ్లాట్లతో పాటుగా శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్ది ల్యాండ్ ఉన్న‌ట్లుగా గుర్తించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 100 ఎకరాల ల్యాండ్ పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు.

* బాలకృష్ణ ఇంటితో పాటు బంధువులు, మిత్రుల‌ కంపెనీలో సోదాల్ని జ‌రిపారు. దాదాపు రెండు కిలోల పైచిలుకు బంగారు ఆభరణాలు, భారీగా వెండి, 80కి పైగా అత్యంత ఖరీదైన వాచీలు కూడా స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో ఐఫోన్లను సీజ్ చేశారు. 90 ఎకరాలకు సంబంధించిన భూమి పత్రాల్ని స్వాధీన‌ప‌ర్చుకున్నారు. కొడకండ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాలు, జనగామలో 24 ఎకరాలు.. ఇలా ప‌లు భూముల‌కు సంబంధించిన‌ పత్రాల్ని స్వాధీన పరుచుకున్నారు. భూముల‌న్నీ బినామీల పేర్ల మీద ఉన్నట్లు గుర్తించారు. బాల‌కృష్ణ బినామీల‌ను కూడా ప్ర‌శ్నిస్తామ‌ని ఏసీబీ అధికారులు అంటున్నారు. ఆయ‌న‌కు ప‌లు కంపెనీల్లో పెట్టుబ‌డులు ఉన్న‌ట్లుగా గుర్తించారు.

* హెచ్ఎండిఏ డైరెక్టర్ తో పాటు మెట్రో రైల్ ప్లానింగ్ డిపార్టుమెంట్‌లో బాల‌కృష్ణ కీల‌క పాత్ర పోషించారు. టీఎస్ రెరాలో సెక్రెటరీ హోదాలో ఉంటూ రియల్ ఎస్టేట్‌ సంస్థలకు లబ్ధి చేకూర్చినట్టు ఆరోపణలున్నాయి. ఇప్పుడు వరకు ఇంట్లో దొరికిన ఆస్తుల పత్రాలను పూర్తిగా వెరిఫై చేస్తున్నామ‌ని.. బాలకృష్ణను కోర్టులో పరిచి తిరిగి కస్టడీ లోకి తీసుకుంటామ‌ని ఏసీబీ అధికారులు అంటున్నారు.

This website uses cookies.