Categories: TOP STORIES

శ్మ‌శానవాటిక క‌బ్జా చేసిన రాంకీ.. హైడ్రాకు ఫిర్యాదు.. ప‌రిశీలించిన క‌మిష‌న‌ర్

అల్వాల్‌ మండలం మచ్చబొల్లారంలోని శ్మశాన వాటిక స్థలాలను రాంకీ నిర్మాణ సంస్థ కబ్జా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మచ్చబొల్లారం మోతుకుల కుంటకు సమీపంలో ఉన్న హిందూ శ్మశానవాటిక స్థలంలో రాంకీ సంస్థ చెత్త వేస్తుండడంతో పరిసరాలు దుర్గంధభరితంగా మారి ఇబ్బందులు పడుతున్నామని మచ్చబొల్లారం రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కొన్నాళ్ల క్రితం హైడ్రాకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శ్మశానవాటిక, పక్కనున్న ప్రభుత్వ భూములను రంగనాథ్‌ పరిశీలించారు. అనంతరం రంగనాథ్‌ మాట్లాడుతూ..

సర్వే నంబర్‌ 199లో మొత్తం 15.19 ఎకరాల స్థలం హిందూ శ్మశాన వాటికకు కేటాయించగా, అందులో రెండు ఎకరాలు రాంకీకి ఇచ్చినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. కేటాయించిన రెండెకరాలు కాకుండా, మరో రెండు, మూడెకరాలు అదనంగా కబ్జా చేసినట్టు స్థానికులు ఫిర్యాదు చేశారన్నారు. స్థానిక ఎంపీ ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేశారని రంగనాథ్‌ తెలిపారు. ఇటీవల మంత్రి శ్రీధర్‌బాబు వద్ద జరిగిన సమావేశంలో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తనతోపాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబర్తికి సూచించారని, ఎంత భూమి కేటాయించారు..? ఎంత వినియోగిస్తున్నారన్నది తేలే వరకు నిర్మాణ పనులు నిలిపివేయాలని రాంకీ సంస్థను ఆదేశించినట్లు చెప్పారు. మచ్చబొల్లారంలోని శ్మశాన వాటిక స్థలంలో రాంకీ సంస్థ చెత్త డంపింగ్‌ చేయడంతో పాటు పలు నిర్మాణాలు చేపట్టి కబ్జాకు యత్నిస్తుందనే విషయాలన్నీ త్వరలోనే తేల్చుతామన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానికుల నుంచి వివరాలు సేకరించినట్లు రంగనాథ్‌ చెప్పారు.

This website uses cookies.