రెరా అథారిటీ ఏర్పాటైన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రీలాంచ్ స్కాములు జరగడం దారుణమైన విషయం. ఇంతవరకూ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా జరిగింది లేదు. రెరా రాక ముందు.. గుర్గావ్, నొయిడాలో అనేకమంది డెవలపర్లు అమాయక ప్రజల్ని మోసగించిన విషయం తెలిసిందే. పది, పదిహేనేళ్లయ్యాక కూడా ఇంతవరకూ అక్కడ ఇళ్ల కొనుగోలుదారులు నేటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కానీ, రెరా ఏర్పాటైన తర్వాత.. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఏ రాష్ట్రంలోనూ ప్రీలాంచ్ స్కాములు జరగలేదు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన ఈ రెరా అథారిటీ తెలంగాణ రాష్ట్రంలో నిర్వీర్యమైంది. దేశమంతటా తెలంగాణ రాష్ట్ర పరువు పోయేలా చేసిందీ ఘటన. ప్రజల్నుంచి అక్రమంగా సొమ్ము వసూలు చేస్తున్న బిల్డర్లను ప్రభుత్వం నియంత్రించలేకపోయిందనే అపవాదు ఏర్పడింది.
సాహితీ సంస్థ ఎండీ ప్రీలాంచుల్లో సొమ్ము వసూలు చేస్తున్నాడని తెలిసి.. తెలంగాణ రెరా అథారిటీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆ సంస్థకు 2018లోనే ఎందుకు నోటీసుల్ని అందించలేదు? ఒకవేళ అందించానా, ఆతర్వాత ఎందుకు పట్టించుకోలేదు. ఒకవేళ, రెరా అథారిటీ ముందే స్పందించి, నోటీసులను అందించి, తగిన చర్యల్ని తీసుకుంటే.. ఇంతమంది ప్రజలు మోసపోయేవారు కాదు కదా! అసలు తెలంగాణ రాష్ట్రంలో రెరా అథారిటీని ఏర్పాటు చేసిందే అమాయక కొనుగోలుదారుల నుంచి మోసపూరిత బిల్డర్ల నుంచి కాపాడటానికే. ఇదే విషయాన్ని రెరా కార్యాలయం ప్రారంభోత్సవం రోజున మంత్రి కేటీఆర్ తెలిపారు కూడా. అయినప్పటికీ, రాష్ట్రంలో అక్రమంగా ఓ సంస్థ రూ.900 కోట్ల వసూలు చేశాడంటే.. రెరా అథారిటీ మొద్దునిద్ర పోతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
* రాష్ట్రంలో రెరా ఛైర్మన్గా రాజేశ్వర్ తివారీ ఉన్నంత కాలం సజావుగా సాగింది. ఆయన పదవీ విరమణ చేశాక.. అప్పటికే వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న సోమేష్ కుమార్ కు రెరా బాధ్యతల్ని ప్రభుత్వం అదనంగా కట్టబెట్టింది. ఆతర్వాత ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందడంతో రెరా అథారిటీకి కష్టకాలం ఏర్పడింది. ఎందుకంటే, రాష్ట్రం మొత్తాన్ని పర్యవేక్షించే సోమేష్ కుమార్కు రెరా మీద దృష్టి పెట్టేంత తీరిక లేకుండా పోయింది. ఈ బాధ్యత నుంచి ఆయన్ని తప్పించే వేరే అధికారికి పూర్తి స్థాయి అధికారాన్ని ఇచ్చి ఉన్నా పరిస్థితి మెరుగ్గా ఉండేది. సాహితీ వంటి స్కాములకు ఆదిలోనే అడ్డుకట్ట పడేది. రెరా అథారిటీ ఏర్పడిన తర్వాత.. సాహితీ ప్రీలాంచ్ స్కామ్ వెలుగులోకి రావడం ప్రభుత్వంపై చెరగని మచ్చ ఏర్పడిందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.
* ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఆలోచించి.. సాహితీ వంటి స్కామర్లు మార్కెట్లో ఎంతమంది ఉన్నారో ఆరా తీయాలి. వారి వివరాల్ని తెలంగాణ రెరా అథారిటీ పూర్తిగా సేకరించాలి.
* కొనుగోలుదారులు ఏయే సంస్థల వద్ద ప్రీలాంచుల్లో ఫ్లాట్లు కొన్నారో.. వారి సమాచారాన్ని అందజేయాలని రెరా అథారిటీ పత్రికా ప్రకటనను విడుదల చేయాలి. ఫలితంగా, ఈ ప్రీలాంచుల్లో ఫ్లాట్లు అమ్మిన వారికి కొంత భయం ఏర్పడుతుంది.
* ప్రీలాంచ్ సంస్థలకు నోటీసులిచ్చి.. ప్రాజెక్టుల పురోగతి గురించి తెలుసుకోవాలి. ఆయా ప్రాజెక్టుల తమ పరిధిలోకి రావు కదా అని భావించకుండా ముందు జాగ్రత్త చర్యల్ని తీసుకోవాలి.
* ప్రీలాంచుల్లో అమ్మిన డెవలపర్లతో కలిపి రెరా అథారిటీ ఒక డేటా బేస్ తయారు చేయాలి.
* ఇక నుంచి రాష్ట్రంలో ప్రీలాంచుల్లో ఫ్లాట్లు అమ్మకూడదని పెద్ద ఎత్తున ప్రకటనల్ని విడుదల చేయాలి.
* ప్రభుత్వం ముందస్తుగా ఆలోచించి కట్టుదిట్ట చర్యల్ని తీసుకుంటే తప్ప.. భవిష్యత్తులో మరిన్ని స్కాముల్లో ప్రజలు సొమ్ము పెట్టకుండా ఉంటారు.
* మధ్యతరగతి ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకుని.. ప్రభుత్వం అందుబాటు ధరలో ఇళ్లను నిర్మించే ప్రయత్నాలను మొదలెట్టాలి. లేకపోతే, తలాతోక లేని బిల్డర్లు తక్కువ రేటుకే ఫ్లాటు అని ప్రకటనల్ని గుప్పిస్తే.. అమాయక కొనుగోలుదారులు అందులో సొమ్ము పెట్టి మోసపోయే ప్రమాదముంది.