Hydra Are there no illegal structures visible within the 111 GEO perimeter
పేదల ఇళ్లను కూల్చి వేయడం ఎంతో సులువు.. ఎందుకంటే వాళ్ళు మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకుంటారు తప్ప ఆ తర్వాత ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ వాళ్ళు తిరగలేరు. అంత సొమ్ము కూడా ఖర్చు పెట్టలేరు. అందుకే హైడ్రా వంటి సంస్థలు పేదల మీదే ప్రతాపం చూపిస్తాయి. హైడ్రా కమిషనర్ ఇప్పటికైనా.. 111 జీవో ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలు, విల్లా ప్రాజెక్టులు, కన్వెన్షన్ సెంటర్లను కూల్చివేయాలి. అప్పుడే దానిపై గౌరవ పెరుగుతుందని సామాన్య, మధ్య తరగతి ప్రజలు భావిస్తున్నారు.
వాస్తవానికి జీవో 111 పరిధిలోని ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు చాలా వెలిశాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. వాటిని అడ్డుకోవాలని, నిర్మాణాలు జరగకుండా చూడాలని పలువురు పోరాడుతున్నా.. అధికార యంత్రాంగం అటు వైపు కన్నెత్తి కూడా చూడదు. ముఖ్యంగా హైడ్రా వచ్చిన తర్వాత పేదల ఇళ్లపైనే ప్రతాపం చూపించింది. సెలవు రోజుల్లో విరుచుకుపడి వారి నివాసాలను నేలమట్టం చేసింది. కనీసం వారికి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే పరిస్థితి కూడా కల్పించేది కాదు.
మరి పేదల నివాసాలపై ప్రతాపం చూపిస్తున్న హైడ్రా.. పెద్దల భవనాల జోలికి ఎందుకు వెళ్లడం లేదు? ముఖ్యంగా 111 జీవో పరిధిలోని ప్రాంతాల్లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు హైడ్రాకు కనిపించడంలేదా? అనేది సామాన్య జనం ప్రశ్న. తాజాగా ఈ వ్యవహారంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జీవో 111 అమల్లో ఉన్నా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.
ALSO READ: ప్లాటు.. కొంటున్నారా?
జీవో 111 పరిధిలోకి వ్చే ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు యథేచ్చగా సాగుతున్నాయని హైకోర్టులో ఒక వ్యక్తి పిల్ దాఖలు చేశారు. ఆనంద, నియో, ఆర్యా, కేఎల్ఎన్ ఉత్సవ్.. ఇలా పలు పేర్లతో కన్వెన్షన్ సెంటర్లు నిర్మిస్తున్నారని తెలిపారు. ఒక్కో కన్వెన్షన్ సామర్థ్యం 5 వేల మందికి పైనే ఉందని.. అంటే వాటి నుంచి ఎన్ని వ్యర్థాలు, కాలుష్యం వస్తాయో ఆలోచించాలని పేర్కొన్నారు. ఇవన్నీ జంట జలాశాయాలకు పెను ముప్పని వివరించారు.
నిర్మాణాలపై నిషేధిత ఉత్తర్వులున్నా.. సంబంధిత అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చెరువులు, జలాశయాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా కూడా ఈ నిర్మాణాలను అడ్డుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ పిల్ పై వాదనలు విన్న ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఐదుగురు కన్వెషన్ సెంటర్ల యజమానులకు నోటీసులు జారీ చేసింది. మరి ఇప్పటికైనా హైడ్రా ఈ వ్యవహారంలో స్పందిస్తుందేమో చూడాలి.
This website uses cookies.