Categories: TOP STORIES

హైదరాబాద్ రిటైల్ ధమాకా

పెరిగిన లీజింగ్ కార్యకలపాలు

కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మాంద్యం ముప్పు వంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో రియల్ ఎస్టేట్ పరిశ్రమ నిలకడగానే వెళుతోంది. ప్రపంచవ్యాప్తంగా కొన్నిచోట్ల ఒడుదొడుకులు ఉన్నప్పటికీ, మనదేశంలో క్రమంగా పుంజుకుంటోంది. తాజాగా హైదరాబాద్ లోని మాల్స్ లో రిటైల్ లీజింగ్ మెరుగుపడినట్టు తేలింది. 2022 జూలై-డిసెంబర్ లో హైదరాబాద్ రిటైల్ లీజింగ్ లో వృద్ధి నమోదైనట్టు సీబీఆర్ఈ సౌత్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా విడుదల చేసిన రిటైల్ రిపోర్టులో పేర్కొంది. 2022 జూలై-డిసెంబర్ మధ్య ఇన్వెస్ట్ మెంట్ గ్రేడ్ మాల్స్, హై స్ట్రీట్స్, స్టాండెలోన్ లలో దాదాపు 0.21 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ జరిగినట్టు వెల్లడించింది. మొత్తం లీజింగ్ లో ఫ్యాషన్ అపెరల్ కు సంబంధించి 51 శాతం ఉండగా.. పుడ్ అండ్ బేవరేజెస్ 25 శాతం, హైపర్ మార్కెట్ 10 శాతం వాటా కలిగి ఉన్నాయి. నివేదికలోని కీలకాంశాలివీ

    • శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో అజార్టీ 15 వేల చదరపు అడుగులు లీజుకు తీసుకుంది
    • శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లోనే హైకూ బ్రూ 15వేల చదరపు అడుగుల లీజు ఒప్పందం చేసుకుంది
    • పాంటలూన్స్ సంస్థ జైన్స్ బాలాజీ బిగ్ టౌన్ లో 14 వేల చదరపు అడుగులు లీజుకు తీసుకుంది
    • పాన్ ఇండియా ప్రాతిపదికన చూస్తే రిటైల్ లీజింగ్ లో 2022లో 21 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. 2022లో ఈ లీజింగ్ 4.17 మిలియన్ చదరపు అడుగులకు చేరగా.. సరఫరా మాత్రం 1.45 మిలియన్ చదరపు అడుగులే ఉంది
    • 2022 జూలై-డిసెంబర్ విషయానికి వస్తే రిటైల్ లీజింగ్ అర్థ వార్షిక ప్రాతిపదికన 5 శాతం పెరిగి 2.43 మిలియన్ చదరపు అడుగులకు చేరగా.. సరఫరా 129 శాతం పెరిగి దాదాపు ఒక మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది
    • మొత్తం లీజింగ్ వ్యవహారాల్లో బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, ముంబైలు కలిసి 80 శాతం వాటా కలిగి ఉన్నాయి
    • ఫ్యాషన్, దుస్తుల రిటైలర్లు తమ ప్రాభవం కొనసాగించారు. మొత్తం లీజింగ్ లో 42 శాతం వాటా వీరిదే
    • కోవిడ్ తర్వాత నగరాల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనడంతో జనం మళ్లీ రిటైల్ దుకాణాలు, మాల్స్ కు తరలి వస్తున్నారు. వారు అటు ఈ కామర్స్ తోపాటు భౌతిక స్టోర్లనూ సందర్శిస్తున్నారు. ఆఫ్ లైన్, ఆన్ లైన్ మిశ్రమంగా ఉన్న హైబ్రిడ్ కామర్స్ ని ఎంచుకుంటున్నారు
ప్రస్తుతం భారతీయ రిటైల్ రంగం కోలుకుంటోందని, 2023లో ఇది మరింత ఊపందుకుంటుందని సీబీఆర్ఈ ఇండియా, సౌత్ ఈస్ట్ ఆసియా, మిడిల్ ఈస్ట్ అండ్ ఆప్రికా చైర్మన్ అండ్ సీఈఓ అన్షుమన్ మ్యాగజీన్ అభిప్రాయపడ్డారు. క్లిష్టంగా మారిన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లోనూ పలు అంతర్జాతీయ బ్రాండ్లు టైర్-1 నగరాల్లోనే కాకుండా టైర్-2, టైర్-3 నగరాలకు విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. కరోనా అనంతరం చాలామంది భౌతిక రిటైల్ స్టోర్లకు తిరిగి వస్తున్నారని.. అప్పటినుంచి హైబ్రిడ్ కామర్స్ ను ఎంచుకుంటున్నారని సీబీఆర్ఈ ఇండియా అడ్వైజరీ అండ్ ట్రాన్సాక్షన్స్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ రామ్ చందనాని తెలిపారు. కరోనా కంటే ముందున్న స్థాయిని 2022 జూలై-డిసెంబర్ అమ్మకాలు అధిగమించాయని వివరించారు. ఇక కొత్తగా పూర్తయిన మాల్స్ లో 2023 జనవరి-జూన్ లో లీజింగ్ ఊపందుకోవడం ఖాయమని స్పష్టంచేశారు. అలాగే బలమైన రిటైల్ డిమాండ్ తో నడిచే చాలా నగరాల్లోని కొన్ని సూక్ష్మ మార్కెట్లలో అద్దె విలువలు అర్థ వార్షిక ప్రాతిపదికన పెరిగాయని నివేదిక వెల్లడించింది. ఢిల్లీ, బెంగళూరుల్లోని కొన్ని ఎంపిక చేసిన ప్రదేశాల్లో అద్దెలు దాదాపు 4 శాతం నుంచి 8 శాతం మధ్య పెరగ్గా.. అహ్మదాబాద్ 4 నుంచి 12 శాతం పెరిగాయి. ఢిల్లీలోని ప్రముఖ మాల్ క్లస్టర్లు 3 నుంచి 15 శాతం, బెంగళూరులో 2 నుంచి 6 శాతం అద్దె వృద్ధి సాధించాయి.

2022 జూలై-డిసెంబర్ నివేదికలో ముఖ్యాంశాలు..

  • ఢిల్లీలో అంతర్జాతీయ, దేశీల బ్రాండ్ల విస్తరణ కొనసాగుతోంది. ఈ కాలంలో 0.54 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ జరిగింది. ఫ్యాషన్ అండ్ అపెరల్ 34 శాతం ఉండగా.. హైపర్ మార్కెట్ 12 శాతం, ఫుడ్ అండ్ బేవరేజెస్ 9 శాతం వాటా కలిగి ఉన్నాయి
  • బెంగళూరులో సరఫరా వేగంగా పుంజుకుంది. కొత్త మాల్స్ లో లీజులు ఊపందుకున్నాయి. మొత్తం 0.91 మిలియన్ చదరపు అడుగుల లీజులు జరిగాయి. ఇక్కడ ఫ్యాషన్ అండ్ అపెరల్ వాటా 42 శాతం ఉండగా.. ఫుడ్ అండ్ బేవరేజెస్ వాటా 13 శాతం, వినోద రంగం వాటా 11 శాతం ఉన్నాయి
  • ముంబైలో సెకండరీ స్పేస్ కు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇక్కడ 0.22 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ జరిగింది. ఫ్యాషన్, దుస్తుల వాటా 30 శాతం ఉండగా.. లగ్జరీ 15 శాతం, ఎఫ్అండ్ బి 10 వాతం వాటా కలిగి ఉన్నాయి
  • చెన్నైలో లీజింగ్ వ్యవహారాలు కరోనా ముందు స్థాయిన అందుకున్నాయి. ఇక్కడ 0.26 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ జరిగింది. ఫ్యాషన్ అండ్ అపెరల్ (52 శాతం), కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ (18 శాతం), లగ్జరీ (7) శాతం వాటాలతో ఉన్నాయి
  • పుణెలో 0.10 మిలియన్ చదరపు అడుగుల రిటైల్ లీజింగ్ జరిగింది
  • కోల్ కతాలో 0.14 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ జరగ్గా.. ఇందులో ఫ్యాషన్ అండ్ అపెరల్ వాటా ఏకంగా 71 శాతం ఉండటం విశేషం

This website uses cookies.