హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొందరు కరోనా రియల్టర్లు రాత్రికి రాత్రే డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో.. ప్రీలాంచ్ ప్రమోటర్లుగా అవతారం ఎత్తి.. అధిక సొమ్ము చెల్లిస్తామని మాయమాటలు చెప్పి లక్షలు దండుకుని చేతులెత్తేస్తున్నారు. ఇలాంటి సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఈవీకే గ్రూపు ఎండీ జి. శ్రీనివాస్ రావు ( జీఎస్సార్ గ్రూప్), ఈ సంస్థ మార్కెటింగ్ హెడ్ శిల్పలపై ఆర్‌సీపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇక్కడ కేసు పెట్టింది ఇన్వెస్టర్ కాదు.. ఆ సంస్థలో పెట్టుబడి పెట్టించిన ఏజెంటే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..
ఈవీకే అనే రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక ఏజెంటు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈవీకే కంపెనీలో రూ.50 లక్షలు పెట్టుబడి పెడితే.. రెండేళ్ల తర్వాత రెట్టింపు మొత్తం అంటే రూ.కోటి ఇస్తామని, సెక్యూరిటీగా 200 గజాల స్థలం రిజిస్టర్ చేస్తామని కంపెనీ ఆఫర్ ఇచ్చిందని.. దాంతో తన కస్టమర్ 2021లో రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టారని ఫిర్యాదులో తెలిపారు. దీంతో 200 గజాల స్థలాన్ని కంపెనీ రిజిస్టర్ చేసిందని.. కాకపోతే, ఒప్పందం ప్రకారం రెండేళ్లయ్యాక తన కస్టమర్ ఈవీకే కంపెనీకి వెళ్లి.. రూ.కోటి గురించి అడిగితే ఈవీకే ఎండీ జి.శ్రీనివాసరావు, మార్కెటింగ్ హెడ్ శిల్ప అసలు స్పందించట్లేదని పేర్కొన్నారు. ఆ ఆఫీసు చుట్టూ చెప్పులు అరిగేలా తిరగ్గా.. తిరగ్గా.. నాలుగు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారని తెలిపారు. కస్టమర్ పేరిట రిజిస్టర్ చేసిన 200 గజాల భూమిని తిరిగి కంపెనీకి బదలాయించాలని, ఆ ప్రక్రియ పూర్తయిన మూడు నెలల తర్వాత సొమ్ము ఇస్తామనే సమాచారం ఇచ్చారని చెప్పారు. ఈ నేపథ్యంలో కంపెనీ ఎండీ, ఇతరులను సంప్రదించడానికి చాలా రకాలుగా ప్రయత్నించినా స్పందించలేదని.. ఇక లాభం లేదనుకుని ఈవీకే కంపెనీ ఎండీ జి.శ్రీనివాసరావు (జీఎస్సార్ గ్రూప్), శిల్పపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్ని పరిశీలించిన పోలీసులు ఈవీకే కంపెనీ ఎండీ జి.శ్రీనివాసరావు, మార్కెటింగ్ హెడ్ శిల్పపై కేసు నమోదు చేశారని సమాచారం.
This website uses cookies.