Categories: TOP STORIES

మణికొండలో అక్రమ నిర్మాణాల లెక్క తీస్తున్న అధికారులు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో అనుమతులు లేని, అనుమతులను ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అభిప్రాయపడింది. అక్రమ నిర్మాణాలపట్ల ప్రభుత్వం, జీహెచ్ ఎంసీలు అమలు చేస్తున్న క్రమబద్ధీకరణ విధానం అక్రమ నిర్మాణాలకు ప్రోత్సాహం ఇస్తున్నట్లుందని కోర్టు వ్యాఖ్యానించింది. మణికొండలో ఎక్కడెక్కడ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు, నిబంధనలు పాటించని నిర్మాణాలు ఎన్ని ఉన్నాయన్నదానిపై నివేధిక ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో అధికారులు ఆ లెక్కలు తీసే పనిలో పడ్డారు.

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ జాగీరులోని సర్వే నం 203/1/3/1, 204 నుంచి 209, 210/1/3 లలో అక్రమ నిర్మాణాలు చేపట్టినా చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ మణినగర్ ప్లాట్ మెంబర్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ సొసైటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన హైకోర్టు.. మణికొండ జాగీరులో యథాతథ స్థితి కొనసాగించాలని, నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలను సమర్పించాలంటూ 2023 మార్చి 14న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని, అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ మణినగర్ ప్లాట్ మెంబర్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ సొసైటీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సి.వి.భాస్కర్ రెడ్డి మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. పిటిషన్ తోపాటు కోర్టు ధిక్కరణ పిటిషన్ తో జతచేసిన ఫొటోలను పరిశీలిస్తే అక్రమ, అనధికారిక నిర్మాణాలను ఇప్పటికే మొదలుపెట్టినట్లు స్పష్టమవుతోందన్నారు.

ప్రాథమికంగా పరిశీలించి చూస్తే.. యథాతథ స్థితి కొనసాగించాలంటూ 2023 మార్చి 14న ఇదే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను చిత్తశుద్ధితో అమలు చేయలేదని తెలుస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు, తొలగించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు పలు తీర్పులు వెలువరించిందని గుర్తు చేశారు. మణికొండ జాగీరులో మొత్తం ఎన్ని నిర్మాణాలున్నాయి, ఎన్నింటికి అనుమతులు ఇచ్చారు, అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాల వివరాలు ఇవ్వాలని జీహెచ్ ఎంసీని ఆదేశించారు. అనుమతులను ఉల్లంఘించి చేపట్టిన, అక్రమ నిర్మాణాలపై ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై సమగ్ర నివేధిక ఇవ్వాలని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలకు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేయాలంటూ ఏవైనా లేఖలు రాశారా? ఒకవేళ అలా లేఖలు రాస్తే వాటి వివరాలు తెలపాలని న్యాయమూర్తి ఆదేశించారు. అంతే కాకుండా అక్రమ నిర్మాణాలపై ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులపై తీసుకున్న చర్యలపై జులై 2లోగా నివేదిక సమర్పించాలని జీహెచ్ ఎంసీ అధికారులను హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.

ఒకవేళ నివేదిక సమర్పించడంలో విఫలమైతే జీహెచ్ ఎంసీ, హెచ్ ఎండీఏ కమిషనర్ లు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై వివరణ ఇవాల్సి ఉంటుందని పేర్కొంటూ విచారణను జులై 2కు వాయిదా వేశారు. హైకోర్టు ఆదేశాలతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు మణికొండలో అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించారు. ఎక్కడెక్కడ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని లెక్కలు తీసే పనిలో పడ్డారు. మణికొండ జాగీర్ లో వందలకొద్ది అక్రమ నిర్మాణాలు ఉన్నాయని హెచ్ఎండీఏ అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి హైకోర్టుకు అక్రమ నిర్మాణాలపై అధికారులు ఎలాంటి నివేధిక ఇస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు గ్రామ పంచాయితీ అయిన మణికొండ ఇప్పుడు మునిసిపాలిటీ. ఇక్కడ చిన్నా పెద్ద కాలనీలు మొత్తం కలిపి 42 వరకు ఉన్నాయని తెలుస్తోంది. పదేళ్ల వరకు మణికొండలో స్టాండ్ లోన్ అపార్ట్ మెంట్స్ మాత్రమే నిర్మాణం జరుపుకునేవి. కానీ ఇప్పుడు భారీ నిర్మాణాలు, హైరైజ్ అపార్ట్ మెంట్స్ ను నిర్మిస్తున్నారు. ఐటీ కారిడార్ కు పక్కనే ఉండటంతో పెద్ద ఎత్తున స్కై స్క్రాపర్స్ నిర్మాణం జరుగుతోంది.

అయితే మణికొండ అక్రమ నిర్మాణాలకు నెలవని చెప్పకతప్పదు. ఇక్కడ నిర్మించిన, ఇంకా నిర్మిస్తున్న వేలాది నిర్మాణాలు నిబంధనలకు విరుద్దంగా జరుపుకుంటున్నాయని చెబుతున్నారు. రోడ్లను ఆక్రమించి కట్టడం, సెట్ బ్యాక్ నిబంధనలను పాటించకపోవనడం, అనుమతులకు మించి అంతస్థులను నిర్మించడం, గండిపేట నుంచి వచ్చే వాటర్ పైప్ లైన్ బాడీని సైతం ఆక్రమించి నిర్మాణాలు చేయడం వంటి ఎన్నో ఉల్లంఘనలు ఇక్కడ కనిపిస్తాయి. అనధికార లెక్కల ప్రకారం మణికొండలో నిబంధనలు పాటించకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలు సుమారు 1700 వరకు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో ఇండిపెండెంట్ ఇళ్ల నుంచి మొదలు స్టాండ్ లోన్ అపార్ట్ మెంట్లు, కొన్ని భారీ భవనాలను సైతం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని అధికారులు గుర్తించారు. హైకోర్టు ఆదేశాలతో ఇప్పుడు అలాంటి అక్రమ కట్టడాల లెక్క తేల్చే పనిలో పడ్డారు. మరి మణికొండ అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

This website uses cookies.