King Johnson Koyyada, 9030034591 : కేంద్రంతో పాటు ఏపీలో ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ గణనీయంగా అభివృద్ధి చెందుతుందని క్రెడాయ్ నేషనల్ జాయింట్ సెక్రటరీ, వైజాగ్‌కు చెందిన లక్ష్మీ అసోసియేట్స్ ఎండీ రాజా శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. కేంద్రం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటైన సందర్భంగా రియల్ ఎస్టేట్ గురుకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గత రెండున్నర దశాబ్దాల నుంచి.. వైజాగ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడూ స్థిరంగా అభివృద్ధి చెందిందే తప్ప.. స్పెక్యులేషన్ ఆధారంగా డెవలప్ అవ్వలేదన్నారు. వైజాగ్ రియాల్టీ మార్కెట్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాల్ని వివరించారు. సారాంశం రాజా శ్రీనివాస్ మాటల్లోనే..
వైజాగ్ రియాల్టీ మార్కెట్ రాజకీయాలకు అతీతంగానే వ్యవహరించేది. ఇక్కడే ఏపీ రాజధానిని ఏర్పాటు చేయాలని.. గత పదేళ్లలో విశాఖపట్నంలో ఒక్క ఉద్యమం కూడా జరగలేదు. కాబట్టి, రాజధాని ఎక్కడ ఏర్పాటైనా ఇక్కడి మార్కెట్‌కు వచ్చే నష్టమేం లేదన్నారు. ప్రతిఒక్కర్ని అక్కున చేర్చుకోవడమే వైజాగ్ ప్రత్యేకత. కాకపోతే, ముంబై తరహాలో.. రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం అవతరిస్తే బాగుంటుంది. అదే రాజకీయ రాజధాని అయితే ప్రొటోకాల్స్ ఎక్కువగా పాటించాల్సి వచ్చేది. ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు వంటివి ఎదురయ్యేవి. వాస్తవానికి, విశాఖ రియాల్టీ మార్కెట్ ఎంతో పరిణితి చెందిందని చెప్పొచ్చు. అనేక పబ్లిక్ సెక్టార్ సంస్థలున్నాయి. వైజాగ్ షిప్‌యార్డ్, స్టీల్ ప్లాంట్ వంటివి ఉన్నాయి. విశాఖపట్నం ప్రత్యేకత ఏమిటంటే.. రహదారి మార్గం, ఆకాశమార్గం, సముద్రమార్గం, రైల్వే మార్గం.. ఇలా నాలుగు మార్గాలున్న అతికొద్ది ప్రపంచ నగరాల సరసన నిలుస్తుంది.
వైజాగ్‌లో ఏపీ రాజధానిగా ఏర్పాటైనా.. ఏర్పాటు కాకున్నా.. ఈ నగరానికొచ్చే నష్టమేం లేదు. కనీసం ఒక్క శాతం నష్టం కూడా జరగదు. ఎందుకంటే, స్పెక్యులేషన్ మీద ఎప్పుడు ఆధారపడింది లేదు. అపార్టుమెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు వంటివి నివాసితులే ఎక్కువగా తీసుకుంటారు తప్ప స్పెక్యులేషన్ కోసం ఎవరూ పెద్దగా కొనుగోలు చేయరు. కాకపోతే ప్లాట్లలో కొంత స్పెక్యులేషన్ ఉన్నమాట వాస్తవమే. అయితే, స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించేవారే ఇక్కడ ఇళ్లను కొనుగోలు చేయడం ఆరంభించారు.
గృహరుణాల్ని తీసుకుని.. ఆదాయ పన్ను రాయితీ కోసం తీసుకునేవారే ఎక్కువగా ఉన్నారు. గత రెండు దశాబ్దాలుగా మార్కెట్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ.. ఇళ్ల ధరలు ఎక్కడా తగ్గని నగరం ఏదైనా ఉందా అంటే.. ఠక్కువ వైజాగ్ అని చెప్పొచ్చు. ముందే చెప్పుకున్నట్లు ఇది స్పెక్యులేషన్ ఆధారంగా నడిచే మార్కెట్ ఇక్కడ పెద్దగా డెవలప్ అవ్వలేదు. పైగా, స్థల లభ్యత కూడా వైజాగ్‌లో తక్కువే ఉంటుంది. ఒకవైపు సముద్రం, మరోవైపు ఈస్టర్న్ ఘాట్స్ వల్ల ల్యాండ్ లాక్ జియోగ్రఫీ అని చెప్పుకోవచ్చు. ఫలితంగా, ఒక ప్రాంతంలో అపార్టుమెంట్లను కట్టిన తర్వాతే మిగతా ప్రాంతాల్లో కట్టడం ఆనవాయితీగా వస్తున్నది.
వార్షిక ప్రాతిపదికన చూస్తే.. గత రెండు దశాబ్దాల నుంచి.. ఐదు నుంచి పది శాతం రియాల్టీ గ్రోత్ ఉంటుందిక్కడ. చదరపు అడుక్కీ రూ.250 నుంచి ఫ్లాట్లను అమ్మడాన్ని చూశాను. ప్రస్తుతం చదరపు అడుక్కీ రూ.10 వేలు చొప్పున ఇక్కడ ఫ్లాట్లు అమ్ముడవుతున్నాయి. వైజాగ్‌లో సుమారు వెయ్యి మంది దాకా బిల్డర్లు ఉంటారు. ఇందులో ఐదు వందల మంది యాక్టివ్‌గా ఉంటారు. వీరి చేతిలో ఎప్పుడూ ఒకట్రెండు నిర్మాణాలైతే ఉంటాయి. ఏటా సుమారు పది వేల ఫ్లాట్ల నిర్మాణం జరుగుతుంది. టాప్ టెన్ బిల్డర్సే దాదాపు ఐదు నుంచి ఆరు వేల ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. అందులో ఏటా ఎనభై శాతం ఎప్పటికప్పుడు అమ్ముడవుతుంటాయి. మిగతావి మరుసటి ఏడాదిలో మిగతావి అమ్ముడవుతాయి.
సుమారు రెండు దశాబ్దాల నుంచి వైజాగ్ మార్కెట్‌తో నాకు అనుబంధం ఉంది. అప్పట్నుంచి మార్కెట్ అనేక ఒడుదొడుకుల్ని సమర్థంగా అధిగమించింది. ఎలాంటి ఆందోళన అయినా.. ఆర్థిక మాంధ్యమైనా.. మార్కెట్ సమర్థంగా ఎదుర్కొంది. పెద్దగా నష్టపోయింది లేదు. ఇప్పటివరకూ నేను యాభై ప్రాజెక్టుల దాకా పూర్తి చేశాను. గాజువాక, రిషికొండలో ప్రస్తుతం రెండు నిర్మాణాల్ని డెవలప్ చేస్తున్నాను.
This website uses cookies.