hydra demolish Sandhya Convention Encroachments
గచ్చిబౌలి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న సంధ్యా కన్వెన్షన్ ఆక్రమణలను మంగళవారం హైడ్రా తొలగించింది.ఫెర్టిలై జర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లే ఔట్‌లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధరరావు ఆక్రమణలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా చర్యలు తీసుకుంది. అనుమతి లేకుండా నిర్మించిన సంధ్యా కన్వెన్షన్ మిని హాల్‌తో పాటు.. ప్రధాన కన్వెన్షన్‌ను ఆనుకుని నిర్మించిన వంట గదులను, 10 రెస్టు రూంలను హైడ్రా తొలగించింది. అలాగే ఐరన్ పిల్లర్లతో జీ ప్లస్ 2గా నిర్మించిన రెండు కట్టడాలను కూడా కూల్చింది.
1980 దశకంలో 20 ఎకరాల విస్తీర్ణంలో 162 ప్లాట్లతో లే ఔట్ వేయగా దాని నామరూపాలు లేకుండా సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్‌రావు చేశారంటూ హైడ్రా ప్రజావాణిలో పలువురు ప్లాట్ యజమానులు ఫిర్యాదు చేశారు. “ సంధ్యా కన్వెన్షన్ పేరిట అడుగుపెట్టి పక్కనే ఉన్న మా లే ఔట్‌ను కబ్జా చేశారు. కష్టార్జితంతో కొనుక్కున్న ప్లాట్ల చిరునామా లేకుండా..మొత్తం హద్దులను చెరిపేశారు. లే ఔట్‌లో రహదారులు, పార్కుల ఆనవాళ్లు లేకుండా ఆక్రమించేశారు. ఇదేమని అడిగితే తమపైనే దాడులు చేశారు. ఈ మోసాలను తట్టుకోలేక పలువురు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.
ఒకటా రెండా.. 30 వరకూ కేసులు ఆయనపై పలు పోలీసు స్టేషన్లో నమోదయ్యాయి. తమ లే ఔట్‌కు సంబంధించి కూడా 5కు పైగా కేసులు ఆయనపై నమోదయ్యాయి. హైడ్రా రావడంతో మాకు ధైర్యం వచ్చింది. మీరైనా చర్యలు తీసుకోండి `అని లేఔట్‌లోని పలువురు ప్లాట్ యజమానుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రాకు సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు ఆక్రమణలు ఒకదాని తర్వాత ఒకటిగా బయటపడ్డాయి. అక్కడ లేఔట్ నామరూపాలు లేకుండా కబ్జాలు జరిగాయని.. పలునిర్మాణాలకు అనుమతులు లేవని అధికారులు నిర్ధారించుకున్నారు. ఇదే విషయాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌గారికి అధికారులు నివేదించారు. కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. లే ఔట్ చుట్టూ నిర్మించిన ప్రహరీతో పాటు పలు ఆర్చిలను హైడ్రా కూల్చివేసింది.
శ్రీధరరావుపై అనేక ఫిర్యాదులు..
హైడ్రా చర్యలతో ధైర్యాన్ని కూడగట్టుకున్నబాధితులు వివిధ మార్గాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. నగరంలో ఉన్నవారే కాకుండా.. విదేశాల్లో ఉన్నవారు కూడా హైడ్రాను ఆన్‌లైన్లో ఫిర్యాదు చేస్తున్నారు. తమను లే ఔట్‌లోకి కూడా రానీయకుండా అడ్డుకున్నారని.. మా ప్రమేయం లేకుండా డెవలప్‌మెంట్ అగ్రిమెంట్లు రాయించుకుని నిర్మాణాలు చేపడుతున్నారని పలువురు హైడ్రాకు ఫిర్యాదుచేశారు. విదేశాల నుంచి మెయిల్స్‌తో పాటు.. వీడియో రూపంలో వారి గోడును వెల్లగక్కుతున్నారు.
అక్కడ మేం కొనుక్కున్న ప్లాట్ లేదని శ్రీధరరావు మనుషులు చెప్పడంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నారంటూ ఢిల్లీ నుంచి ఓ మహిళ ఆన్‌లైన్లో ఫిర్యాదు చేశారు. త్వరలో హైదరాబాద్ వచ్చి హైడ్రా కార్యాలయంలో నేరుగా ఫిర్యాదు చేస్తానంటూ వేడుకున్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా హైడ్రాను సంప్రదిస్తున్నారు. ఒక్క ఫెర్టిలైజర్స్ కార్పరేషన్ ఉద్యోగుల లే ఔట్ వారే కాకుండా.. వేర్వేరు ప్రాంతాల్లో శ్రీధర రావు చేసిన ఆక్రమణలపై ఫిర్యాదులందుతున్నాయి. ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమణలకు సంబంధించి హైడ్రాకు పలువురు ఫిర్యాదు చేస్తున్నారు.
This website uses cookies.