Aditya Homes Hyderabad
మూసీ పరీవాహకంలో జరుగుతున్న తమ నిర్మాణాలన్నీ సక్రమమేనని,. అందులో నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఆదిత్య హోమ్స్ స్పష్టం చేసింది. వాస్తవాలను పరిశీలించకుండా పర్యావరణవేత్త డాక్టర్ లుబ్నా సర్వత్ ఆరోపణలు చేయడం సబబు కాదని పేర్కొంది. మూసీ నదీ పరీవాహకం వెంబడి జరుగుతున్న ఆక్రమణలపై ఆమె గళమెత్తుతున్న సంగతి తెలిసిందే. వెంటనే ఆ ఆక్రమణలు, పారిశ్రామిక కాలుష్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలపై ఆదిత్య హోమ్స్ స్పందించింది. తమ ప్రాజెక్టులో నిబంధనల ఉల్లంఘన అనేదే జరగలేదని స్పష్టం చేసింది.
మూసీ నదిని ఆక్రమించి ప్రాజెక్టు కడుతున్నారంటూ డాక్టర్ లుబ్నా సర్వత్ చేస్తున్న ఆరోపణలన్నీ గూగుల్ ఎర్త్, ఎన్ఆర్ఎస్ సీ మ్యాప్ ల అధికారిక కేఎంఎల్ డేటా ఆధారంగా చెబుతున్నారని, అయితే అది ఏ అధికారిక కేఎంఎల్ సమాచారమో అన్నది స్పష్టంగా లేదని పేర్కొంది. అలాగే ఆమె ఏ ఎలైన్ మెంట్ గురించి చెబుతున్నారో కూడా స్పష్టంగా తెలియట్లేదని వెల్లడించింది. ‘సాధారణంగా ఏ జలవనరులకు సంబంధించిన రివర్ బెడ్ అధికారిక ఎలైన్ మెంట్ తెలియాలన్నా రెవెన్యూ విలేజ్ మ్యాప్ చూడాలి. ఒకవేళ నదికి సంబంధించి ఎంఎఫ్ఎల్ చూడాలంటే నీటిపారుదల శాఖ అధికారికంగా ధ్రువీకరిస్తుంది.
నది ఆక్రమణ అని ఓ నిర్ణయానికి వచ్చే ముందు అసలు అధికారిక సమాచారాన్ని లుబ్నా పరిశీలించ లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారులు సైట్ ను క్షుణ్నంగా తనిఖీ చేసి, ప్రతిపాదనలను ఆమోదించేందుకు హెచ్ఎండీఏకు నిరభ్యంతర సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇచ్చారు. ఆ తర్వాతే హెచ్ఎండీఏ భవన నిర్మాణ ప్లాన్ కు అనుమతి ఇచ్చింది. ఆ ప్లాన్ కు అనుగుణంగానే నిర్మాణాలు జరుగుతున్నాయి. గతంలో కూడా కొంతమంది ఇలాగే ఆరోపణలు చేయడం వల్ల హెచ్ఎండీఏ అనుమతులు ఉపసంహరించింది.
దాన్ని తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశాం. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో హెచ్ఎండీఏ అనుమతులను పునరుద్ధరించింది. అందుకోసం మరోసారి రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో తనిఖీలు కూడా చేయించింది. ఈ నివేదికన్నీ హెచ్ఎండీఏ సహా సంబంధిత శాఖల వద్ద ఉన్నాయి. అవాస్తవాలు, తప్పుడు సమాచారం ఆధారంగా దారుణమైన ఆరోపణలు చేసే ముందు డాక్టర్ లుబ్నా ఈ నివేదికలు పరిశీలించి ఉంటే సబబుగా ఉండేదని ఆదిత్యా హోమ్స్ తెలియజేసింది.
ALSO READ: రెండేళ్లలో మురుగురహిత మూసీ నది
విద్యావేత్త అయిన లుబ్నా ఇలాంటి ఆరోపణలు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి అసంబద్ధ ఆరోపణల వల్ల ప్రాజెక్టుకు, సంస్థకు ఎంత చెడ్డపేరు వస్తుందో ఆమె అర్థం చేసుకోవాలి. ఒక కంపెనీ పేరు చెడగొట్టడానికి అనధికారిక సరిహద్దులు వేటినీ పరిగణనలోకి తీసుకోకూడదు. ఈ తరహా ఆరోపణలు తీవ్ర అభ్యంతరకరం. వీటిని ఖండిస్తున్నాం. అవసరమైతే నష్ట పరిహారం కోసం ఇలాంటి వ్యక్తులపై చట్టపరంగా పోరాడతాం’ అని ఆదిత్య హోమ్స్ స్పష్టం చేసింది. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించిన సరిహద్దుల లోపల మాత్రమే నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తేల్చి చెప్పింది.
‘మూసీ అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్.. మూసీ నదికి రిటైనింగ్ వాల్స్ కట్టేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయడానికి కన్సల్టెన్సీల కోసం 2024 మార్చిలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేసింది. మూసీ నది హైడ్రాలిక్ మోడల్ కూడా ఇందులో భాగంగా ఉంది. వర్షం వేర్వేరు తీవ్రతలతో పడినప్పుడు ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఇది అంచనా వేస్తుంది. సమీప భూమలకు ముంపు రాకుండా సంబంధిత అధికారులు నిర్ణయించినట్టు నదీ పరీవాహక ప్రాంతంలో రిటైనింగ్ వాల్స్ నిర్మించాలని కోరుతున్నారు. అంటే ఇప్పుడు ముంపునకు గురయ్యే ప్రాజెక్టులోని ప్రతి ప్రైవేటు భూమిని తీసుకెళ్లే ప్రతిపాదన లేదు. రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి ముందు తర్వాత నదీ ప్రవాహం వెంబడి క్రాస్ సెక్షన్ డ్రాయింగ్ లను చేర్చాలని అధ్యయనం ప్రతిపాదించింది.
మూసీ నది ఒడ్డున రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి అధికారులు నిర్ణయించిన ప్రకారం నది సరిహద్దు దాటే వరదను నివారించే లక్ష్యంతో డీపీఆర్ సిద్ధం చేయాలని కోరారు. అధ్యయనాల దశ, క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి చట్టపరమైన మద్దతు ఇవ్వడం తెలియదు. కానీ డాక్టర్ లుబ్నా సర్వత్ మూసీ నదికి అవతల ఉన్న ప్రైవేటు భూముల్లో విస్తరించి ఉన్న మూసీ ప్రాజెక్టు సరిహద్దును ఖరారు చేసి ఆక్రమణలున్నాయని చెప్పేస్తున్నారు. ఏ మాత్రం ఆలోచించకుడా సంబంధిత అధికారుల అనుమతులతో చట్టబద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసే స్థాయికి ఆమె వెళ్లారు’ అని విమర్శించింది.
This website uses cookies.