Categories: TOP STORIES

111 జీవో ఎత్తివేసే ముందు స్టేక్ హోల్డ‌ర్ల‌ను సంప్ర‌దించ‌లేదా?

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం.. హైద‌రాబాద్లో జీవో నెం.50ని ప్ర‌వేశ‌పెట్టే స‌మ‌యంలో.. నిర్మాణ సంఘాల‌తో ప‌లుసార్లు చ‌ర్చించింది. వారి అభిప్రాయాల్ని తీసుకున్న‌ది. అదేవిధంగా కూల్ రూఫ్ పాల‌సీ ప్ర‌వేశ‌పెట్టే స‌మ‌యంలో తెలంగాణ నిర్మాణ సంఘాల‌తో చ‌ర్చ‌ల్ని జ‌రిపింది.

వారి స‌ల‌హాలు, సూచ‌న‌ల్ని తీసుకుని పాల‌సీకి మెరుగులు దిద్దింది. మ‌రి, ఏ అంశ‌మైనా నిర్మాణ సంఘాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపే ప్ర‌భుత్వం.. ట్రిపుల్ వ‌న్ జీవో ఎత్తివేత గురించి ఎందుకు చ‌ర్చించ‌లేదు? హైద‌రాబాద్ రియ‌ల్ రంగాన్ని అయోమ‌యానికి గురి చేసే ఇంత‌టి బ‌డా నిర్ణ‌యం గురించి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌లేదెందుకు? రియ‌ల్ సంఘాల‌తో చ‌ర్చ‌లు అవ‌స‌రం లేద‌ని భావించిందా? లేక‌పోతే, వారితో చ‌ర్చ‌లు జ‌రిపితే ట్రిపుల్ వ‌న్ జీవో ఎత్తివేత సాధ్య‌ప‌డ‌ద‌ని అనుకున్న‌దా? ఇలా ప్ర‌భుత్వం ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణాలేమిట‌నే అంశాన్ని ప‌లువురు డెవ‌ల‌ప‌ర్లు విశ్లేషిస్తున్నారు.

ట్రిపుల్ వ‌న్ జీవో వ్య‌వ‌హారం ఎన్‌జీటీ మ‌రియు హైకోర్టు ప‌రిధిలో ఉన్న‌ది. గ‌తంలో సుప్రీం కోర్టు సైతం 111 జీవోను స‌మ‌ర్థించింది. అంతెందుకు, రాష్ట్ర ప్ర‌భుత్వం 2022 సెప్టెంబ‌రులో ట్రిపుల్ వ‌న్ జీవోను ఎత్తివేయ‌లేద‌ని హైకోర్టుకు లిఖిత‌పూర్వ‌కంగా తెలియ‌జేసింది.

హ‌రిత సూత్రాల‌కు అనుగుణంగా మాస్ట‌ర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తామ‌ని మంత్రి కేటీఆర్‌, పుర‌పాల‌క శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్లు ప‌లు సంద‌ర్భాల్లో వెల్ల‌డించారు. జంట జ‌లాశ‌యాల‌కు మురుగునీరు రాకుండా ప‌టిష్ఠ‌మైన చ‌ర్య‌ల్ని తీసుకుంటామ‌ని.. మాస్ట‌ర్ ప్లాన్‌ను సిద్ధం చేసిన త‌ర్వాతే.. 111 జీవోను అమ‌లు చేస్తామ‌న్న ప్ర‌భుత్వం.. హ‌ఠాత్తుగా ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్న‌దేమిట‌ని రియ‌ల్ట‌ర్లు ప్ర‌శ్నిస్తున్నారు. అందుకే, 111 జీవో ఎత్తివేత‌కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌లైన త‌ర్వాతే స్పందిస్తామ‌ని ప‌లు నిర్మాణ సంఘాల పెద్దలు అంటున్నారు. మొత్తానికి, ట్రిపుల్ వ‌న్ జీవో ఎత్తివేత రియ‌ల్ రంగానికి కొంత‌మేర‌కు క‌ష్ట‌మే తెచ్చింద‌ని చెప్పాలి.

This website uses cookies.