Categories: Celebrity Homes

విక్కీ కౌశల్ లీజు పునరుద్ధరణ, మూడేళ్లకు రూ.6.2 కోట్ల అద్దె

ప్రముఖ నటుడు విక్కీ కౌశల్ తన అపార్ట్ మెంట్ లీజును పునరుద్ధరించుకున్నారు. ముంబై జుహులని లగ్జరీ అపార్ట్ మెంట్ లో ఉంటున్న ఆయన.. మరో మూడేళ్ల కాలానికి లీజు పొడిగించుకున్నారు. ఇందుకోసం రూ.6.2 కోట్ల అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఏప్రిల్ లో ఒప్పందం కుదుర్చుకున్నారు. జనవరి 2025 నుంచి ప్రారంభమయ్యే ప్రస్తుత మూడు సంవత్సరాల లీజు ఒప్పందంలో మొదటి, రెండవ సంవత్సరాలకు నెలవారీ అద్దె రూ.17.01 లక్షలు ఉంటుందని స్క్వేర్ యార్డ్స్ పేర్కొంది. చివరి ఏడాది రూ.17.86 లక్షలకు పెరుగుతుంది. లీజు వ్యవధిలో కౌశల్ మొత్తం అద్దె చెల్లింపు దాదాపు రూ. 6.2 కోట్లకు చేరుకుంటుందని అంచనా. 2021 జూలైలో ఐదేళ్ల కాలానికి తొలుత ఆయన ఒప్పందం చేసుకున్నారు.

ALSO READ: సింప్లిసిటీ, చక్కదనాల మేళవింపు.. జూనియర్ ఎన్టీఆర్ నివాసం

అప్పుడు నెలవారీ అద్దె రూ.8 లక్షలు ఉండేది. తాజా ఒప్పందంలో అది రెట్టింపు దాటింది. కాగా, ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఎక్కువమంది ఎంచుకునే నివాస ప్రాంతాలలో ఒకటైన జుహు.. అనేక మంది బాలీవుడ్ ప్రముఖులకు నిలయం. సుందరమైన బీచ్, ఉన్నత స్థాయి రెస్టారెంట్లు, అంధేరి, బాంద్రా వంటి వ్యాపార కేంద్రాలకు సమీపంలో ఉంది. వెస్ట్రన్ ఎక్స్ ప్రెస్ హైవే, ముంబై మెట్రో నెట్‌వర్క్ ద్వారా అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉంది. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, కార్తీక్ ఆర్యన్, శక్తి కపూర్ వంటి బాలీవుడ్ తారలు కూడా జుహులో అపార్ట్ మెంట్‌లను కలిగి ఉన్నారు.

విక్కీ కౌశల్ లీజుకు తీసుకున్న అపార్ట్ మెంట్ రాజ్ మహల్‌లో ఉంది. ఇది రెడీ-టు-మూవ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఈ అపార్ట్ మెంట్ 258.48 చదరపు మీటర్ల (2,781.83 చదరపు అడుగులు) కార్పెట్ విస్తీర్ణంలో ఉంది. ఈ లావాదేవీకి రూ. 1.69 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ. 1,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. లీజు ఒప్పందంలో భాగంగా మూడు కార్ పార్కింగ్ స్థలాలు కూడా వస్తాయి. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ కింద ఆయన రూ.1.75 కోట్లు చెల్లించారు.

This website uses cookies.