Categories: TOP STORIES

ప్లాటు.. ఫ్లాటు కొంటున్నారా?

రియల్ ఎస్టేట్.. ఇది కేవలం రియాల్టీ బిజినెస్ చేసే పెద్ద పెద్ద సంస్థలకే కాదు సామాన్యులకు సైతం సంబంధించిన సబ్జెక్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇల్లు లేదా ఇంటి స్థలం కొనుక్కోవాలని కోరుకునే వారే. అయితే ఈ క్రమంలో నిబద్ధత కలిగిన నిర్మాణసంస్థలు మినహా కొంత మంది రియల్టర్ల చేతుల్లో జనాలు మోసపోతున్నారు. అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో జరిగే మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న నిపుణులు.. స్థిరాస్తి కొనే ముందు అందుకు సంబంధించిన పత్రాలను నిశితంగా పరిశీలించాలని చెబుతున్నారు.

రియల్ ఎస్టేట్ ఎంతో మంది జీవితాలను నిచ్చెనలు ఎక్కిస్తుంటే, ఉజ్వల భవిష్యత్తును ఊహించుకున్న మరెంతో మంది అగాథంలో కూరుకుపోతున్నారు. సొంతింటి కలను నెరవేర్చుకుంటున్న వారు కొందరైతే, మంచి లాభాలు ఇస్తుందన్న నమ్మకంతో మరికొందరు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. రియల్ ఎస్టేట్‌లో ట్రెండ్ వెంట పరుగులు పెడుతూ ఆయా లావాదేవీలకు ముందు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా నష్టపోతున్న వారూ ఉన్నారు. ఇదే సమయంలో కొత్తగా పుట్టుకొస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు జనాల అవసరాలను అసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాయి. అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో జరిగే మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు.

రియల్ ఎస్టేట్ లో ప్రాధమిక స్థాయిలో జరిగే మోసం యాజమాన్య హక్కులకు సంబంధించింది. కొన్ని రియాల్టీ సంస్థలు యాజమాన్య హక్కులు లేకపోయినప్పటికీ సంబంధిత స్థలం లేదా ఫ్లాట్ అమ్ముతుంటాయి. వారంతట వారే పవర్ అఫ్ అటార్నీ క్లెయిమ్ చేసుకొని స్థలాన్ని అమ్ముతారు. వాస్తవానికి సుప్రీం కోర్ట్ ఈ పవర్ అఫ్ అటార్నీ ద్వారా అమ్మకాలు చేయవద్దని స్పష్టంగా తీర్పునిచ్చింది. అంతే కాదు కోర్టు వివాదాలు, ఇతర వివాదాల్లో నలుగుతున్న భూములను కూడా అమ్ముతుంటారు కాబట్టి యాజమాన్య హక్కులకు సంబంధించి పూర్తి అప్రమత్తతో ఉండాలని చెబుతున్నారు.

ALSO READ: రెరా నంబర్, క్యూఆర్ కోడ్ స్పష్టంగా కనిపించాల్సిందే

ఇంటి స్థలం కొనేటప్పుడు లేదంటే అపార్టుమెంటులో ఫ్లాట్‌ తీసుకునే సమయంలో ఒకటికి రెండు సార్లు అన్ని ధ్రువపత్రాలను సరి చూసుకుంటే ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదని నిపుణులు అంటున్నారు. ఇంటి స్థలం, అపార్టుమెంట్ లో ఫ్లాట్‌, ఇల్లు కొనేముందు అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాలని సూచిస్తున్నారు. యాజమాన్య హక్కులు పరిశీలించడానికి అన్ని లింకు డాక్యుమెంట్లలోనూ ఆస్తి సర్వే నంబరు, సరిహద్దుల పరంగా ఒకేలా ఉందా లేదా నిర్ధారించుకోవాలి. లే అవుట్‌ మున్సిపాలిటీ, డీటీసీపీ, హెచ్‌ఎండీఏ, మున్సిపల్‌ కార్పొరేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ లాంటి సంస్థల పర్మీషన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. టైటిల్‌ డీడ్స్‌, ఆస్తి యాజమాన్య పత్రాలను సంబంధిత ప్రభుత్వ విభాగాలు జారీ చేసిన డాక్యుమెంట్స్ తో సరి చూసుకోవాలి. కొనదల్చిన భూమి రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ 1908 సెక్షన్‌ 22ఎ కింద, ప్రభుత్వం చేసిన ఇతర చట్టాలు, నిషేధిత ఆస్తుల కిందకు రాదని నిర్ధారించుకోవాలి.

మరీ ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఆస్తిని భౌతికంగా చూసి, పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాతే కొనుగోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇంటి స్థలాన్ని సంబంధించిన లేఅవుట్ లేదా అపార్ట్ మెంట్ అభివృద్ధి చేస్తున్న సంస్థ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. వాస్తవ యజమాని మొదలుకొని ప్రస్తుత విక్రయదారు వరకు లింకు డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. అనుమతి పొందిన ప్లాన్‌ ప్రకారం సైట్‌ ప్లాన్‌, లొకేషన్‌ హద్దులు ఉన్నాయా అనేదానిపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి. ఇల్లు లేదా అపార్ట్ మెంట్ ప్లాన్‌ ప్రకారం నిర్మించకపోతే.. ఎప్పుడైనా మున్సిపాలిటీ అధికారులు కూల్చేయవచ్చు. ఇంకా అర్థం కాని వ్యవహారాలుంటే.. స్థిరాస్తి లావాదేవీలపై అనుభవమున్న న్యాయనిపుణులను సంప్రదించి అప్పుడు నిర్ణయం తీసుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

This website uses cookies.