తూర్పు ప్రవేశమార్గంలో ఉన్న లేఅవుట్లోకి ప్రవేశించినవారు.. మొత్తం లేఅవుట్‌లోని ఎడమవైపు భాగంలో ప్లాట్లను ఎంచుకోవాలి. ఇల్లు కట్టిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్లేందుకు తూర్పు వైపునకు కానీ ఉత్తరం వైపునకు కానీ ఈశాన్యం వైపు కానీ నడక ఏర్పడుతుంది. దీని వల్ల మంచి ఆలోచనలు వస్తాయి. ఉన్నత విద్యావంతులుగా ఎదుగుతారు. ప్రభుత్వసంస్థల్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మంచి రాజకీయ జీవితం ఏర్పడుతుంది. కుటుంబం మధ్య సత్సంబంధాలు దృఢంగా ఉంటాయి. మొత్తానికి, జీవితం సాఫీగా సాగుతుంది. ఎలాంటి ఒడిదొడుకులు ఏర్పడటానికి ఆస్కారముండదు.
ఉత్తర ప్రవేశమార్గం ఉన్నటువంటి లేఅవుట్‌లో దక్షిణం వైపులో తూర్పు లేదా ఉత్తరం అభిముఖంగా ఉన్న ప్లాట్లను ఎంచుకోవడం ఉత్తమం.
పశ్చిమ వాయువ్యంలో ప్రవేశమార్గం ఉన్నట్లయితే, మొత్తం లేఅవుటుకి కుడివైపు అనగా, దక్షిణ భాగాన ఉన్న తూర్పు, ఉత్తరం, పడమర అభిముఖంగా ఉన్న ప్లాట్లను ఎంచుకోవాలి.
దక్షిణాగ్నేయంలో ప్రవేశమార్గం ఉన్నట్లయితే.. లేఅవుటుకి ఎడమవైపు భాగంలో ఏ దిక్కున ప్లాటు అయినా మంచిదే.
మొత్తం లేఅవుటులో ఎటువైపు అయినా సరే, దక్షిణ అభిముఖం ఉన్న ప్లాటును తీసుకోవాల్సి వస్తే.. ఆ ప్లాట్లులో ఇల్లు కట్టిన తర్వాత బయటికొచ్చే మార్గం తూర్పు వైపునకు నడక సాగించి రహదారిలో కలిసేలా ఉండటం ఉత్తమం. ఉదయాన్నే లేచిన తర్వాత దక్షిణం, పడమర వైపు నడవటం మంచిది కాదు. ఒకవేళ ఇలా చేస్తే, జీవితంలో అన్నిరకాల అనర్థాలు ఎదురవుతాయి.
తూర్పు, ఉత్తరం అభిముఖంగా ఉన్న ప్లాటును ఎంచుకోవడం వల్ల ఉదయాన్నే సూర్యరశ్మీ నేరుగా ఇంట్లోకి ప్రసరిస్తుంది. దీని వల్ల ఆయా ఇంట్లో నివసించే వారికి చర్మ రోగాలు, దీర్ఘకాలిక రోగాలు వంటివి దరిచేరవు. అందులో నివసించేవారు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు. పిల్లలు చక్కగా చదువులు, నడవడిక అలవడే అవకాశం ఉంటుంది.