చలికాలం మెల్లగా వెళ్లిపోతోంది. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఇక పూర్తిగా సమ్మర్ స్టార్ట్ అయితే పరిస్తితి ఏవిధంగా ఉంటుందోన్న ఆందోశన మొదలైంది. ఈ క్రమంలోనే తెలంగాణలో భవన నిర్మాణాలకు సంబందించిన కూల్ రూఫ్ పాలసీ గురించి గుర్తు చేస్తున్నారు రియల్ రంగ నిపుణులు. రాష్ట్రంలో నిర్మించే నివాస, వాణిజ్య భవనాలకు 2023లో కూల్ రూఫ్ పాలసీని తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇంతకీ ఏంటీ కూల్ రూఫ్ పాలసీ.. కూల్ రూఫ్ తో ఇళ్లకు, భవనాలకు వచ్చే ప్రయోజం ఏంటీ అన్న విషయాలు తెలుసుకుందాం.
నిన్నటి వరకు గజగజా వణికించిన చలి.. ఇప్పుడు మెల్లమెల్లగా జారుకుంటోంది. ఇదే సమయంలో అప్పుడే ఎండాకాలం మెదలవుతోంది. మార్చి నెల నుంచి ఎండలు మండిపోనున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. పెరుగుతున్న ఎండలతో నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం వేడిమికి తట్టుకోలేని పరిస్థితులు రాబోతున్నాయి. ఫలితంగా జనం ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలోనే చల్లదనం కోసం ఏసీల వాడకం విపరీతంగా పెరిగుతోంది. తద్వారా కాలుష్య ఉద్గారాలు అధికమవుతున్నాయి. అంతే కాకుండా విత్యుత్ వినియోగం కూడా భారీగా పెరుగుతోంది. మరోవైపు ఏసీలు అమర్చుకోలేని సామాన్యులు, వేడిమి వల్ల వడదెబ్బ బారినపడి అనారోగ్యం పాలవుతున్నారు. ఇందుకోసమే తెలంగాణ ప్రభుత్వం 2023 లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్, ట్రిపుల్ ఐటీ, జీహెచ్‌ఎంసీలతో కలిసి కూల్ రూఫ్ విధానాన్ని రూపొందించింది.
2023లో రూపొందించిన తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ.. ఐదేళ్ల పాటు అంటే 2028 వరకు అమల్లో ఉండనుంది. ఇప్పుడున్న ఇళ్లు, భవనాలతో పాటు కొత్తగా నిర్మించే నివాస, వాణిజ్య భవనాలకు కూల్ రూఫ్ పాలసీ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 600 గజాలు అంతకుపైన నిర్మించే నివాస, వాణిజ్య భవనాల్లో కూల్ రూఫ్ పాలసీని తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. 600 గజాలలోపు నిర్మించే ఇండ్లలోనూ ఈ విధానాన్ని అమలు చేసేవిధంగా ప్రోత్సాహకం అందించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
భవన నిర్మాణాలకు అనుమతులు తీసుకొనే సమయంలోనే కూల్ రూఫ్ తప్పనిసరి. కూల్ రూఫ్‌ను తనిఖీ చేసి అక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, బిల్డర్లు నిర్మించే భవనాలు, విద్యాసంస్థలు, బస్ స్టేషన్‌లు, బస్ స్టాప్‌లు, కన్వెన్షన్ సెంటర్లు, కమ్యూనిటీ హాళ్లు, హోటళ్లు, రిసార్ట్‌లు, హాస్పిటల్స్, క్లినిక్‌లు తదితర భవనాలన్నీ ఈ పాలసీ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం నిర్మించే డబుల్ బెడ్ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లకూ ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఐటీ కార్యాలయ భవనాలు, సెజ్‌లు, రిటైల్ కాంప్లెక్స్‌లు, షాపులు, మాల్స్, ఫంక్షన్ హాల్స్, పరిశ్రమల భవనాలు ఇలా అనేకం వీటి పరిధిలోకి వస్తాయి. వీటిల్లో తప్పనిసరిగా కూల్ రూఫ్ విధానం అమలు చేయాల్సి ఉంటుంది.
కూల్‌రూఫ్ విధానంలో నిర్మించే పై కప్పు వల్ల గది ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయి. ఆధునిక సాంకేతికతతో పైకప్పులకు ఉపయోగించే సామగ్రిలో కొన్ని మార్పులు చేయడం, ప్రత్యేక రసాయనాల వినియోగంతో 2 నుంచి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత తగ్గుతుందని అంచనా. దీనివల్ల సూర్యకిరణాలు తిరిగి వాతావరణంలోకే పరావర్తనం చెందడం ద్వారా ఇంటి లోపలకు వేడి రావడం తగ్గుతుంది. ఇప్పటికే నిర్మించిన భవనాలపై కూల్‌రూఫ్ ఏర్పాటుకు పలు పద్ధతులున్నాయి. శ్లాబ్ పైన కూల్ పెయింట్ వేయడం, వినైల్ షీట్లను పరచడం, టైల్స్ వేసుకోవడం, భవనాల పైన మొక్కల పెంపకం, సౌర విద్యుత్తు ఫలకాల ఏర్పాటు వంటి చర్యలతో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. కూల్ రూఫ్‌ల నిర్వహణకు ఖర్చు నామమాత్రంగానే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. చదరపు మీటర్‌కు 300 ఖర్చుతో కూల్ రూఫ్ వేసుకోవచ్చు. ఎండ తీవ్రత తగ్గడం వల్ల ఇంట్లో కూలర్లు, ఏసీలు, ఫ్యాన్ల వినియోగం తగ్గుతుంది. దీంతో రాష్ట్రంలో మూడేళ్ల తరువాత ప్రతి ఏడాది 600 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.