దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో విద్యార్థుల వసతి గృహాలు, పేయింగ్ గెస్ట్ అకామిడేషన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు, ఉద్యోగ నిమితం ఏటా లక్షలాది మంది మెట్రో నగరాలకు వస్తుంటారు. ఇలాంటి వారంతా అటు హాస్టళ్లు, ఇటు పీజీ అకామిడేషన్ల వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో నగరాల్లో వీటి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
అన్ని సౌకర్యాలూ కల్పిస్తుండటం, విద్యాసంస్థలు లేదా కార్యాలయాలకు సమీపంలో ఉండటం వంటి అంశాలు వీటి డిమాండ్ మరింత పెరగడానికి దోహదపడుతున్నాయి. ఒకే వయసు ఉండే వ్యక్తులతో కలసి ఉండటం, ఆధునిక సౌకర్యాలు, మెరుగైన ప్రయాణ వసతులతో సులువైన రాకపోకలు, రోజువారీ కార్యకలాపాలలో సహాయం వంటి పలు అంశాలు యువతను హాస్టళ్ల వైపు మళ్లిస్తున్నాయి. బయట నలుగురైదుగురు కలిసి గది అద్దెకు తీసుకుని ఉండటం కంటే ఇదే బెటరని భావిస్తున్నారు. ఫలితంగా మెట్రో నగరాల్లో పీజీలకు డిమాండ్ పెరుగుతోంది.