కొనుగోలుదారులకు టీడీఎస్ బాదుడే
ప్రాపర్టీ కొంటున్నారా? అది రూ.50 లక్షల కంటే ఎక్కువ విలువైందా? అయితే, ఈ సంగతి మీ కోసమే. రూ.50 లక్షల కంటే విలువైన ప్రాపర్టీ కొనుగోలు చేసినప్పుడు ఒక శాతం మొత్తాన్ని టీడీఎస్ గా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాలి. మిగిలిన 99 శాతం మొత్తాన్ని అమ్మకందారుకు ఇవ్వాలి. ఇంతవరకు బాగానే ఉంది. ఒకవేళ సదరు అమ్మకందారు ఆధార్, పాన్ లింక్ లేకుంటే మీరు 20 శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్, పాన్ లింక్ గడువు ముగిసినా చాలామంది ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో ఐటీ విభాగం పలువురు కొనుగోలుదారులకు నోటీసులు పంపిస్తోంది. ముఖ్యంగా రూ.50 లక్షల కంటే పైబడిన ఇళ్లు కొన్నవారికి 20 శాతం టీడీఎస్ కట్టాలంటూ నోటీసులిస్తోంది. దీంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. వెంటనే అమ్మకందారులను సంప్రదించి వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ప్రాపర్టీ కొనే ముందు సదరు అమ్మకందారు ఆధార్, పాన్ లింక్ అయి ఉందో లేదో చూసుకోవడం మరచిపోకండి.