గ్రేటర్ సిటీలో 21 శాతం
పెరిగిన ఇళ్ల అమ్మకాలు
విశ్వనగరం హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, కోలుకోవడానికి చాలాకాలం పడుతుందంటున్న వారి ప్రచారంలో ఏ మాత్రం వాస్తం లేదని రియాల్టీ రిసెర్చ్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా చెబుతోంది. భాగ్యనగరంలో నిర్మాణ రంగం డౌన్ కావడం కాదు.. గత ఏడాదితో పోలిస్తే మరింత వృద్ధి చెందిందని అంటోంది. బయట జరుగుతున్న ప్రచారానికి, వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉందని నైట్ ఫ్రాంక్ లెక్కలు చెబుతున్నాయి. ఈ యేడాది 2024 జనవరి-జూన్ లో మొదటి ఆరు నెలల కాలంలో 18,573 ఇళ్లు, అపార్ట్ మెంట్స్ లో ఫ్లాట్ల అమ్మకాలు జరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక స్పష్టం చేసింది.
గత సంవత్సరం ఇదే సమయంలో అంటే 2023 జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో అమ్మకాలు జరిగిన ఇళ్ల సంఖ్యతో పోలిస్తే, ఈ యేడాది అమ్మకాల సంఖ్య 21 శాతం ఎక్కువని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఈ ఒక్క నివేదిక చాలు హైదరాబాద్ రియాల్టీ మార్కెట్ లో ఏ మాత్రం తగ్గుదల లేదని, ఇంకా వృద్ది చెందుతోందని చెప్పడానికి. హైదరాబాద్ నిర్మాణరంగ మార్కెట్ కు తిరుగులేదని చెప్పడానికి మరో ఉదాహరణ ఉంది. హైదరాబాద్‌లో ఆఫీసు స్థలాలకు గత సంవత్సరం కంటే ఈ యేడాది 71 శాతం అధికంగా డిమాండ్ ఏర్పడింది. ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో మొత్తం ఆఫీస్ స్పేస్ అమ్మాకాలు 50 లక్షల చదరపు అడుగులకు చేరినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది.
హైదరాబాద్ లోనే కాకుండా దేశవ్యాప్తంగానూ రియల్ ఎస్టేట్ మార్కెట్ మంచి వృద్దిలో ఉందని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. హైదరాబాద్ సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ లో ఇళ్ల అమ్మాకాలు 11 శాతం పెరిగి 1.73 లక్షలకు చేరాయని లెక్కలు చెబుతున్నాయి. భారత్ రియాల్టీ మార్కెట్ లో ఇది 11 ఏళ్ల గరిష్ఠ స్థాయి అని నైట్ ఫ్రాంక్ చెబుతోంది. దీనికి తోడు ఆఫీస్ స్పేస్ కు 33 శాతం డిమాండ్ పెరిగి, 3.47 కోట్ల చదరపు అడుగులకు చేరిందని నివేదిక పేర్కొంది. ఇక హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రీమియం ఇళ్ల అమ్మకాలు 2024 ప్రథమార్ధంలో 34 శాతం పెరిగిన సంగతి తెలిసిందే.