హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత నిచ్చి, సెప్టెంబర్ రెండవ వారంలోగా ఈ ప్రాజెక్టు కు సంబంధించిన భూ సేకరణ పూర్తి చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్ లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపై మంగళవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు రాష్ట్రంలో అత్యధిక ప్రాముఖ్యత సంతరించుకున్నదని, ఈ ప్రాజెక్ట్ సంబంధించి వివిధ దశలలో పెండింగ్ లో ఉన్న భూసేకరణ ప్రక్రియ ను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.
భూసేరణ నష్టపరిహారనికి సంబంధించిన అంశంపై ప్రత్యేక దృష్టి సారించి భూములు కోల్పోతున్న రైతులకు న్యాయ పరమైన నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూములు కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం అందే విదంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేసి.. భూముల మార్కెట్ విలువ ఆధారంగా.. పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. కోర్టు కేసుల పై కూడా ప్రత్యేక చొరవ తీసుకుని త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాల్ని జారీ చేశారు.