గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంటి నిర్మాణాల కోసం అనుమతులు ఇచ్చిన జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అథారిటీల అధికారులు సైతం హైడ్రా పనితీరుపై అయోమయంలో పడ్డారు. హైడ్రా నుంచి నోటీసులు అందుకున్న వారు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులను సంప్రదిస్తే.. వారేం సమాధానం చెప్పలేకపోతున్నారని తెలుస్తోంది. తాము అనుమతులు ఇచ్చాక.. ఇప్పుడు హైడ్రా అక్రమ కట్టడాలని కూలగొడుతుండటంతో.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అథారిటీలు సైతం ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.
ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. హైడ్రా అధికారాలు, పరిధులపై స్పష్టత కోరేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు సిద్దమవుతున్నారని సమాచారం. ఏదేమైనా హైడ్రా జెట్ స్పీడ్ దూకుడుకు మాత్రం బడాబాబులేమో గాని సామాన్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తప్పుడు మార్గాల్లో ఇంటి అనుమతులు ఇచ్చినట్లయితే, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి గాని.. పైసా పైసా కూడబెట్టి కష్టపడి కట్టుకున్న ఇంటిని కూల్చడం సరికాదని అంటున్నారు.