తెలంగాణ రాష్ట్రంలో మధ్యతరగతి ఇళ్ల కొనుగోలుదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరకంగా మేలు చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలం నుంచి హైడ్రా కారణంగా నగరంలో ఇళ్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఇలాగే కొంతకాలం అమ్మకాలు తగ్గితే.. ఆటోమెటిగ్గా బిల్డర్లు తక్కువ రేటుకు ఫ్లాట్లను విక్రయిస్తారనే వార్తలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గత మూడు నెలల్నుంచి కొందరు డెవలపర్లు పది నుంచి పదిహేను శాతం తక్కువకు ఫ్లాట్లను అమ్ముతున్న విషయం తెలిసిందే.
ప్రధానంగా, సెప్టెంబరు నుంచి అయితే రియల్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు లేనే లేవు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. అధిక శాతం మంది బిల్డర్లకు ఫ్లాట్ల అమ్మకాలు జరగట్లేదు. కొన్ని నిర్మాణ సంస్థలకైతే జీరో సేల్ అనే చెప్పాలి. ఇదే ట్రెండ్ మరో రెండు మూడు నెలలు కొనసాగితే.. బిల్డర్లు తప్పదన్నట్లు మరింత రేటు తగ్గిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మనీ రొటేషన్ కోసమే బిల్డర్లు ధర తగ్గిస్తారని.. ఒకవేళ వారు బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలకు నెలసరి చేయాల్సిన పేమెంట్స్ చేయకపోతే.. వారి ఆస్తుల్ని ఎన్‌పీఏలుగా ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మరో ఏడాదిదాకా మార్కెట్ పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది కాబట్టి.. మధ్యతరగతి ప్రజలకు మరికొన్ని రోజుల్లో..
మార్కెట్ రేటుకంటే తక్కువకే ఫ్లాట్లు లభిస్తాయి. అందుకే, చాలామంది మధ్యతరగతి ప్రజలు రేవంత్ సారుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.