- 2024లో 21 శాతం పెరుగుదల
- హైదరాబాద్ లో 17 శాతం అధికం
- నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడి
దేశవ్యాప్తంగా గతేడాది ఆఫీస్ లీజింగ్ అదరహో అనిపించేలా సాగింది. ఎనిమిది ప్రధాన నగరాల్లో కొత్త శిఖరాలను తాకింది. 2024లో మొత్తం 719 లక్షల చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) పరిమాణంలో లీజు లావాదేవీలు నమోదయ్యాయి. 2023లో స్థూల లీజింగ్‌తో పోల్చి చూసినప్పుడు 21 శాతం అధికం కాగా, కరోనా విపత్తుకు ముందు ఏడాది 2019 గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 19 శాతం వృద్ధి కనిపించిందని రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. కరోనా కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ తగ్గగా.. తర్వాత క్రమంగా పుంజుకున్నట్టు తెలిపింది. హైదరాబాద్ లో 17 శాతం అధికంగా లీజింగ్ నమోదైంది.
నగరాలవారీగా చూస్తే.. బెంగళూరులో స్థూల ఆఫీస్ లీజింగ్ 2024లో 45 శాతం వృద్ధితో 181 లక్షల చదరపు అడుగులకు చేరింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో 25 శాతం వృద్ధితో స్థూల లీజింగ్ 127 లక్షల చదరపు అడుగులుగా నమోదైంది. ముంబైలో 40 శాతం వృద్ధితో 104 లక్షల చదరపు అడుగుల లీజింగ్ లావాదేవీలు జరిగాయి. పుణెలో 19 శాతం పెరిగి 80 లక్షల చదరపు అడుగులకు చేరింది. అహ్మదాబాద్‌లో 64 శాతం వృద్ధితో 30 లక్షల ఎస్ఎఫ్టీ స్థూల లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. ఒక్క చెన్నై మార్కెట్లో మాత్రం 25 శాతం క్షీణించి 81 లక్షల ఎస్ఎఫ్టీకి పరిమితమైంది.