తమకు అనుకూలంగా తగిన ఉత్తర్వులు, అభిప్రాయాలు పొందడం కోసం మ్యాపులు ఫోర్జరీ చేసి వివిధ కార్యాలయాల్లో సమర్పించినందుకు ముగ్గురు ప్రముఖ బిల్డర్లపై ఔరంగాబాద్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. నగరంలోని సాతారా ప్రాంతంలో ఖరీదైన భూమిని దోచకునే ఉద్దేశంతోనే ఆ ముగ్గురు చీటింగ్ కు పాల్పడ్డారని భగవాన్ గోర్డే అనే కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశారు. అయితే, ఈ వ్యవహారంలో మోసపోయిన సిడాకో, ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) వంటి ప్రభుత్వ సంస్థలు ఫిర్యాదు చేయకపోవడంపై పోలీసులే ఆశ్చర్యపోయారు. గట్ నెంబర్ 220 మ్యాప్ ఆ ముగ్గురు బిల్డర్లు ఫోర్జరీ చేసి కుట్రకు తెరతీశారని గోర్డే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోర్జరీ చేసిన ఆ మ్యాప్ ను సిడాకో, ఏఎంసీల్లో సమర్పించారని పేర్కొన్నారు. ఆ మ్యాప్ ద్వారా ల్యాండ్ రికార్డులను అక్రమంగా మార్పులు చేసి తమకు అనుకూలమైన నిర్ణయం వెలువడేలా చేసుకున్నారని, అనంతరం ఆ భూమిని మరో ముగ్గురికి విక్రయించారని వివరించారు. బిల్డర్లతోపాటు భూమిని కొనుగోలు చేసిన వ్యక్తులకు కూడా అది ఫోర్జరీ మ్యాప్ అనే విషయం తెలుసని గోర్డే ఆరోపించారు. దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ఆయన సమర్పించారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల సమర్పించడం ద్వారా ప్రభుత్వ సంస్థలను వారు మోసం చేశారని పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆ ముగ్గురిపై చీటింగ్, ఫోర్జరీ అభియోగాలు మోపి కేసు నమోదు చేశారు.