- ప్రభుత్వానికి నిర్మాణ సంఘాల వినతి
- పెంచడానికిది సరైన సమయం కాదు
- వాస్తవ పరిస్థితుల్ని గమనించండి
- యూడీఎస్, ప్రీ సేల్స్ వల్ల రియాల్టీ కుదేలు
రియల్ ఎస్టేట్ గురు, హైదరాబాద్: ఫిబ్రవరి 1 నుంచి భూముల మార్కెట్ విలువల్ని పెంచాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర నిర్మాణ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. స్టేక్ హోల్డర్లు, ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకోకుండా.. రాష్ట్ర రియల్ రంగంలో నెలకొన్న సమస్యల్ని పట్టించుకోకుండా తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని కొంతకాలం పాటు వాయిదా వేయాలని అభ్యర్థిస్తున్నాయి. ట్రెడా, క్రెడాయ్ హైదరాబాద్, క్రెడాయ్ తెలంగాణ సంఘాలు రాష్ట్ర మంత్రలు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తదితరులకు వినతి పత్రాన్ని అందజేశాయి. ఈ వినతి పత్రంలో పేర్కొన్న ముఖ్యమైన అంశాలిలా ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ నిష్క్రియపరత్వం వల్ల గత నాలుగైదు నెలల్నుంచి యూడీఎస్, ప్రీలాంచ్ అమ్మకాల కేటుగాళ్లు పెరిగి రియల్ రంగం దారుణంగా దెబ్బతిన్నది. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాల్లేవు. భూముల మార్కెట్ విలువల్ని పెంచి ఏడు నెలలు కూడా కాలేదు. ఇప్పటికే నాలా ఛార్జీలను పెంచేశారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో.. భూముల మార్కెట్ విలువల పెంపుదలను వాయిదా వేయాలి. ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలతో సహా బహిరంగ ప్రదేశాలను సందర్శించడానికి భయపడుతున్నారు. నిషేధిత జాబితా నుండి ఇటీవల విడుదలైనవి మూడు లక్షలకు పైగా ఆస్తులు ఉన్నాయి మరియు ఇంకా చాలా విడుదల కావలసి ఉంది. ఇంకా ఈ ఖాతాలో లక్షల లావాదేవీలు పెండింగ్‌లో ఉన్నాయి.
మార్కెట్ సెంటిమెంట్ మరియు రియల్ ఎస్టేట్ ధరలను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రీ-సేల్స్, యూడీఎస్ అమ్మకాలు మరియు వంద శాతం చెల్లింపుల విక్రయాల ముప్పును నియంత్రించడానికి పరిశ్రమ మరియు ప్రభుత్వం ఇంకా యంత్రాంగాన్ని రూపొందించలేదు. కోవిడ్ ఉన్నప్పటికీ సిమెంట్ మరియు స్టీల్‌తో సహా నిర్మాణ సామగ్రి ధరలు గణనీయంగా పెరిగాయి. ఆస్తుల మార్కెట్ విలువలు 30% నుండి 100% కంటే ఎక్కువగా పెరిగి కేవలం ఏడు నెలలు మాత్రమే అయ్యింది. మార్కెట్ విలువల చివరి సవరణ నుండి ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని 37 శాతం, నాలా ఛార్జీలను 67 శాతం చొప్పున పెంచింది. ఇలాంటి అనేక ప్రతికూల అంశాల కారణంగా.. భూముల మార్కెట్ విలువల పెంపుదల నిర్ణయాన్ని కొంతకాలం పాటు వాయిదా వేయాలని ట్రెడా, క్రెడాయ్ హైదరాబాద్, క్రెడాయ్ తెలంగాణ నిర్మాణ సంఘాలు కోరుతున్నాయి.