- టన్నుకు రూ.5వేలకు పైగా పెరుగుదల
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం మన దేశంలోని స్టీల్ ధరలపై పడింది. అక్కడ యుద్ధం కారణంగా సరఫరాకు విఘాతం కలగడంతో దేశీయంగా స్టీల్ ఉత్పత్తిదారులు హాట్ రోల్డ్ కాయిల్ (హెచ్ ఆర్సీ), టీఎంటీ బార్ల ధరలను టన్నుకు రూ.5వేలకు పైగా పెంచేశారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం పరిస్థితిని బట్టి ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం టన్ను హెచ్ ఆర్సీ ధర రూ.66వేలు ఉండగా.. టీఎంటీ బార్ల రేటు రూ.65వేలకు పెరిగింది.
అంతర్జాతీయ స్థాయిలో సరఫరా చైన్ ప్రభావితం కావడం వల్లే ప్రస్తుతం 20 శాతం మేర ధరలు పెరిగాయని ఈ పరిశ్రమకు చెందిన ఓ నిపుణుడు వెల్లడించారు. స్టీల్ తయారీలో కీలకమైన కోకింగ్ కోల్ ధర ప్రస్తుతం టన్నుకు 500 డాలర్లకు చేరిందని వెల్లడించారు. మన అవసరాలకు వినియోగించే కోకింగ్ కోల్ లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటున్నామని వివరించారు. ఎక్కువ భాగం ఆస్ట్రేలియా నుంచి కొనుగోలు చేస్తుండగా.. దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా నుంచి కూడా దీనిని దిగుమతి చేసుకుంటున్నట్టు చెప్పారు.
‘రష్యా, ఉక్రెయిన్ లు అటు సహజవాయువు, ఇటు కోకింగ్ కోల్ తోపాటు స్టీల్ ఎగుమతి చేస్తున్నాయి. ప్రస్తుతం యుద్ధం కారణంగా వీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడటంతో అంతర్జాతీయంగా వీటి ధరలు పెరిగాయి. పరిస్థితులను మేం క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం. సాధ్యమైనంత వరకు ఈ ప్రభావం మా వినియోగదారులపై పడకుండా చూసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం’ అని టాటా స్టీల్ సీఈఓ టీవీ నరేంద్రన్ తెలిపారు.