-
మహా రెరా ఆదేశం
ఏడాది లేదా రెండేళ్ల కాలానికి ముందుగానే మెయింటనెన్స్ ఛార్జీలను వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని రెరా తాజాగా స్పష్టం చేసింది. అలా అడ్వాన్స్ మెయింటనెన్స్ ఛార్జీలు వసూలు చేయకుండా ప్రమోటర్లను నిలువరించాలని సంబంధిత యంత్రాంగాన్ని ఆదేశించింది. అంతే కాకుండా కనీసం సగానికి పైగా ఫ్లాట్లు బుక్ అయిన తర్వాతే కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలు ఏర్పాటయ్యేలా చూడాలని పేర్కొంది.
ఏడాది లేదా రెండేళ్ల కాలానికి ఒకేసారి మెయింటనెన్స్ ఛార్జీలు వసూలు చేయడం రెరా చట్టానికి విరుద్ధమని.. దీనికి సంబంధించి మహారాష్ట్ర రెరా పలు మార్గదర్శకాలు జారీ చేసిందని ముంబై గ్రాహక్ పంచాయత్ చైర్మన్ శిరీష్ దేశ్ పాండే తెలిపారు. ఇది ఇళ్ల కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. ‘రెరా చట్టం సెక్షన్ 11 (4) (ఈ), మహా రెరా నిబంధనలు 9(1) ప్రకారం.. ఓ అపార్టుమెంట్ లో మెజార్టీ ఫ్లాట్లు బుక్ అయిన తర్వాత మూడు నెలలలోపు అసోసియేషన్ ఏర్పాటయ్యేలా ప్రమోటర్ చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా మెయింటనెన్స్ ఛార్జీలను ప్రమోటర్ వసూలు చేయడం సబబు కాదు’ అని వివరించారు. అడ్వాన్స్ మెయింటనెన్స్ ఛార్జీలు వసూలు చేయడం పూర్తిగా అక్రమం, చట్టవిరుద్ధం అని స్పష్టం చేశారు.