- 600 చ.అ. ఇంటి ఖర్చు.. 10 లక్షలే
- కొండలు, గుట్టలు, పొలాలు.. ఎక్కడైనా నిర్మాణం సులువు
- ఫ్యాక్టరీలో తయారు చేసి.. సైటు వద్ద బిగించుకోవచ్చు
- ఆకర్షణీయమైన డిజైన్..
- ప్రకృతిలో నివసిస్తున్న అనుభూతి
- భద్రతకు ఎలాంటి ఢోకా లేదు
- చిన్నారులకు ఉపయోగపడే విధంగా సింగిల్ బెడ్‌రూం కట్టవచ్చు
ఇల్లు అంటే కాంక్రీటుతో నాలుగు గోడల్ని కట్టాలనే పోకడకు కాలం చెల్లింది. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న యువ దంపతుల కారణంగా.. ఇంటి స్వరూపం కూడా సంపూర్ణంగా మారిపోయింది. ఎక్కడో ఒక చోట స్థలం తీసుకుని.. అందులో పిల్లర్లు వేసి, శ్లాబు పోసి, గోడలు కట్టి, గృహప్రవేశం చేయాలని కోరుకునేవారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. నవయువకులు కొత్త తరహా ఇళ్ల కోసం అన్వేషిస్తున్నారు. ప్రధానంగా, విదేశాల్లో ప్రాముఖ్యతను సంతరించుకునే మాడ్యులార్ గృహాల వైపు మన వాళ్లు దృష్టి సారిస్తున్నారు.
ఊటీ, కొడైకెనాల్, కులుమనాలీలకు వెళితే అక్కడి మంచు కొండలు, పచ్చటి పరిసరాలు మనల్ని ఇట్టే ఆకర్షిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అరుకు వెళ్లినా ఆనందమేస్తుంది. మన వద్ద వికారాబాద్, ఆదిలాబాద్లో కేరీమేరీ వంటివి పచ్చటి కొండలతో చూడముచ్చటగా దర్శనమిస్తాయి. అలాంటి కొండల మధ్య ప్రకృతిని ఆస్వాదించేందుకు సంప్రదాయ పద్ధతిలో ఇల్లు కట్టడం సాధ్యమవుతుందా? కాదు కదా. మరి కొండల మధ్య.. తివాచీపర్చిన పచ్చదనంలో.. ఓ ఇల్లు కట్టుకుని ప్రకృతిలో మమేకం అయ్యేందుకు.. మన ముందుకొచ్చిన ప్రత్యామ్నాయమే.. మాడ్యులార్ ఫామ్ హౌజ్.
ఖర్చు ఎంత?
ఉక్కుతో తయారయ్యే ఈ మాడ్యలార్ ఇంటిని తయారు చేసేందుకు 45 రోజులు పడుతుంది. పూర్తిగా అగ్నివ్యాప్తిని నిరోధిస్తుంది. ఎండ నుంచి కాపాడుతుంది. టాటా డోర్లను వినియోగిస్తారు. యూపీవీసీ కిటికీలను వాడతారు. కిలో వాట్ సోలార్ ప్యానెల్‌ని బిగిస్తే విద్యుత్తు బిల్లుల గురించి చింతించక్కర్లేదు. ప్లానింగ్, మ్యాన్ పవర్, మెటీరియల్స్ వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఓ 600 చదరపు అడుగుల్లో సింగిల్ బెడ్‌రూం ఇంటిని రూపొందించేందుకు సుమారు రూ.10 లక్షలు ఖర్చవుతుంది. సైటు కండిషన్ బట్టి పునాదికయ్యే ఖర్చు ఇంటి యజమాని అదనంగా భరించాల్సి వస్తుంది. నాలుగైదేళ్ల తర్వాత మనం ఈ ఇంటిని వద్దనుకుంటే.. విడిభాగాలుగా విడగొట్టేసి అమ్ముకున్నా.. కొంత సొమ్ము వెనక్కి వస్తుంది.
స్ట్రక్చర్: స్టీల్ ఫ్యాబ్రికేషన్
ఫినిష్: సిమెంట్ బోర్డులు
సివిల్: ఇటుక గోడ
ఫ్లోరింగ్: తాండూరు
తలుపులు: టాటా డోర్లు
కిటికీలు: యూపీవీసీ
పేయింట్: ఏషియన్
బాత్‌రూము: కొహ్లర్ ఫిక్షర్స్
ఎప్పుడు పూర్తి? 45 రోజుల్లోపు
మాడ్యులార్ గృహాలే నయా పోకడ
ఆర్కిటెక్చర్ అంటే కేవలం ఇల్లను కట్టడం కాదు. ప్రకృతిలో పరవశించేలా గృహాల్ని నిర్మించాలన్నదే మా తాపత్రయం. అందుకే, ఈ మాడ్యులార్ కాన్సెప్టుతో గ్రీన్ బిల్డింగ్ డిజైన్ చేశాం. ఈ ఇంటిని ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. పూర్తి స్థాయి భద్రతగా ఉంటుంది. పునాదులు తవ్వక్కర్లేదు. కాంక్రీటు పోయనక్కర్లేదు. కార్మికుల గురించి తిప్పలు పడాల్సిన అవసరం లేదు. నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుతున్నాయన్న భయమూ పడక్కర్లేదు. ఎంచక్కా మనం అనుకున్న డిజైన్‌కు తగ్గట్టుగా ఇంటిని ఒక చోట తయారు చేసి.. వాటిని సైటు వద్దకు తీసుకెళ్లి బిగించుకుంటే సరిపోతుంది. ధర తక్కువ. నాణ్యతగా ఉంటుంది. కేవలం 45 రోజుల్లో ఇంటి నిర్మాణమంతా పూర్తవుతుంది. మేం ఇంటీరియర్స్ వర్క్ ఎంతో వైవిధ్యంగా చేసిస్తాం.