Categories: TOP STORIES

హైదరాబాద్లో క్యాపిటాల్యాండ్ టెక్ పార్క్

సింగపూర్ కు చెందిన క్యాపిటాలాండ్ ఇన్వెస్ట్ మెంట్ (సీఎల్ఐ) కొత్తగా పునర్నిర్మించిన ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్ (ఐటీపీహెచ్) బుధవారం ప్రారంభమైంది. మంత్రి కేటీఆర్ దీనిని ప్రారంభించారు. మాదాపూర్ లో పునర్నిర్మించిన ఐటీపీహెచ్ లోని బ్లాక్ ఏ భవనంలో పలు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాల ఏర్పాటుకు ఒప్పందాలు కూడా కుదుర్చుకోవడంతో వంద శాతం లీజు పూర్తయినట్టు సీఎల్ఐ తెలిపింది.

బ్లాక్ ఏ భవనంలో మొత్తం 1.4 మిలియన్ల చదరపు అడుగుల్లో అంతర్జాతీయ సంస్థలైన బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్, ఎర్నెస్ట్ అండ్ యంగ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, వీఎక్స్ ఐ గ్లోబల్, యూఎస్ టెక్నాలజీ, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, క్లౌడ్ ఫర్ సి సర్వీసెస్, ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ వంటి సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఐటీపీహెచ్ ను దశలవారీగా వచ్చే ఏడు నుంచి పదేళ్లలో పూర్తి చేయనున్నారు. ఈ పార్కు మొత్తం పూర్తయితే 4.9 మిలియన్ అడుగుల గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తుంది. దాదాపు 50వేల మందికిపై ఐటీ నిపుణులు పని చేసుకోవచ్చు.

అలాగే ఐటీపీహెచ్ ఆవరణలో 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. క్యాపిటా లాండ్ ఇండియా ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్ (క్లింట్) కు దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో 12 బిజినెస్ పార్కులు ఉండగా.. అందులో మూడు హైదరాబాద్ లోనే ఉండటం విశేషం. ఐటీపీహెచ్ లో ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ కాకుండా నవీ ముంబై, చెన్నైల్లో కూడా ఏర్పాటవుతున్నాయని, అలాగే బెంగళూరులోని తమ ఇంటర్నేషనల్ టెక్ పార్కులో మరో డేటా సెంటర్ నెలకొల్పడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని క్లింట్ తెలిపింది.

This website uses cookies.