Will interest rate cuts boost real estate?
ఇల్లు కొనడానికి ఇది సరైన సమయమేనా?
రెపో రేటును మరోసారి తగ్గిస్తూ రిజర్వు బ్యాంకు తీసుకున్న నిర్ణయం రియల్టీకి ఊతమిస్తుందా అనే చర్చ జోరుగా సాగుతోంది. రెపో రేటును 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో ఆ మేరకు వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఫిబ్రవరిలో ఇదే విధమైన తగ్గింపు తర్వాత తాజాగా ఆర్బీఐ మళ్లీ తగ్గింపు బాటలోనే కొనసాగుతూ తీసుకున్న నిర్ణయం రియల్ రంగానికి ఊరటనిచ్చే అంశమేనని విశ్లేషిస్తున్నారు. అయితే, వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం కొనుగోలుదారులకు ఎంత వరకు ఉపయోగపడుతుందనే సందేహాలు తలెత్తక మానవు. మరి ఇల్లు కొనడానికి ఇది సరైన సమయమేనా అంటే.. అంత కచ్చితమైన సమాధానం రావడంలేదు.
నిజానికి తక్కువ వడ్డీ రేట్లు గృహరుణాలు తీసుకోవడానికి ప్రోత్సాహకరంగా ఉంటాయి. అయితే, ఈ దీర్ఘకాలిక రుణం తీసుకునే ముందు ఇతర అంశాలను కూడా బేరీజు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎంత మేర ఆదా అవుతుందో చూసుకోవాలి. ఉదాహరణరకు.. 20 ఏళ్ల కాలవ్యవధికి 8.75 శాతం వడ్డీతో రూ.50 లక్షల రుణం తీసుకుంటే.. నెలవారీ ఈఎంఐ రూ.44,186 అవుతుంది. ఆర్బీఐ తగ్గించిన రెపో రేటును బ్యాంకులు నేరుగా తన కస్టమర్లకు బదలాయిస్తే.. వడ్డీ రేటు 8.5 శాతానికి తగ్గుతుంది. దీని ప్రకారం ఈఎంఐ 43,391కి తగ్గుతుంది. అంటే నెలకు రూ.795 మేర ఆదా అవుతుంది. మిగతా రుణ వ్యవధిలో ఎలాంటి మార్పులూ లేకుండా ఇదే వడ్డీ రేటు కొనసాగుతుందని అనుకుంటే.. మొత్తమ్మీద రూ.1,90,649 మేర వడ్డీ ఆదా అవుతుంది. అలా కాకుండా నెలవారీ ఈఎంఐని తగ్గించకుండా రూ.44,186 కొనసాగించుకుంటే.. కాలవ్యవధి 10 నెలలు తగ్గుతుంది. ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీ రేటు అనేది నిజంగా మంచి వార్తే అయినప్పటికీ, ఇల్లు కొనడానికి ఇది ఒక్కటే కారణం కాకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మీ ఆదాయంలో స్థిరత్వం చాలా ముఖ్యమైన అంశమని.. త్వరలోనే అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే పరిస్థితి ఉన్నందున.. ఆ ప్రభావం ఎంతోకొంద మన మీద, మన ఉద్యోగాల మీద పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇల్లు కొనడం అనేది దీర్ఘకాలిక ఆర్థికపరమైన అంశానికి సంబంధించింది కాబట్టి.. అన్నీ బేరీజు వేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. మీ గృహ రుణ ఈఎంఐ మీ నికర వేతనంలో 30-35% మించకూడదని స్పష్టంచేస్తున్నారు. డౌన్ పేమెంట్ చేయడానికి తగిన మొత్తం, ఈఎంఐలను ఎలాంటి సమస్యా లేకుండా చెల్లించగలిగే సౌకర్యం ఉన్నవారు ఇంటి కొనుగోలు నిర్ణయంలో ముందుకు వెళ్లొచ్చని చెబుతున్నారు. అయితే, వడ్డీ రేట్లు ప్రస్తుతం తగ్గుతున్నప్పటికీ.. కాలక్రమేణా హెచ్చుతగ్గులకు లోనవుతాయనే అంశాన్ని దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
This website uses cookies.