Categories: LATEST UPDATES

జోరుగా సిమెంట్ విక్రయాలు

  • 2022లో 18 నుంచి 20 శాతం మేర వృద్ధి నమోదయ్యే అవకాశం
  • కోవిడ్ ముందు పరిస్థితి కంటే 6 శాతం ఎక్కువ
  • ఇక్రా నివేదిక

కరోనా మహమ్మారి కారణంగా కాస్త ఒడిదొడుకులకు లోనైన రియల్ రంగం తిరిగి గాడిన పడింది. దేశవ్యాప్తంగా చక్కని జోరుతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ పరిశ్రమ గణనీయమైన వృద్ధి సాధిస్తుందని, 18 నుంచి 20 శాతం మేర వృద్ధి నమోదవుతుందని ప్రముఖ సంస్థ ఇక్రా అంచనా వేసింది. కోవిడ్ ముందు ఉన్న పరిస్థితి కంటే 6 శాతం అధికంగా వృద్ధి నమోదవుతుందని పేర్కొంది.

 

అయితే, అధిక ఉత్పాదక వ్యయం తదితర కారణాల వల్ల నిర్వహణ లాభాల్లో 440 నుంచి 480 బేసిస్ పాయింట్లు తగ్గిపోతాయని వివరించింది. ‘2022లో 18 నుంచి 20 శాతం వృద్ధి కనపడుతుంది. 355 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర అమ్మకాలు జరుగుతాయి. ఇది కోవిడ్ ముందు జరిగిన అమ్మకాల కంటే 6 శాతం అధికం. గ్రామీణ హౌసింగ్ లో డిమాండ్ పెరడం వల్ల ఈ పరిస్థితి కనిపిస్తుంది’ అని ఇక్రా తన నివేదికలో పేర్కొంది.

అమ్మకాలు 5 శాతం మేర పెరిగినా, మెట్రిక్ టన్నుపై వచ్చే నిర్వహణ లాభం 10 శాతం మేర తగ్గుతుందని ఇక్రా ఏవీపీ అండ్ సెక్టార్ హెడ్ అనుపమా రెడ్డి తెలిపారు. ఉత్పాదక వ్యయం పెరగడమే ఇందుకు కారణమన్నారు. ముడి పదార్థాలు 12 శాతం, ఇంధనం 31 శాతం, రవాణా చార్జు 5 శాతం మేర పెరగడం ఉత్పాదక వ్యయంపై ప్రభావం చూపినట్టు వివరించారు. 2021 ఆర్థిక సంవత్సరం తొలి పది నెలలలో పోలిస్తే, 2022 ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో 25 శాతం మేర సిమెంట్ ఉత్పాదకత పెరిగి 290 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. కోవిడ్ ముందు 2020 ఆర్థిక సంవత్సరం తొలి పది నెలలతో పోలిస్తే ఇది 4 శాతం అధికమని పేర్కొంది.

This website uses cookies.