ఫాక్స్ కాన్ టెక్నాలజీ గ్రూపు చైర్మన్, యంగ్ ల్యూ రాసిన లేఖ తెలంగాణ రాష్ట్రంలో వారి సంస్థ పెట్టుబడులు పెట్టడంలోని నిబద్ధతను స్పష్టం చేసింది. తాము వీలయినంత త్వరలో కొంగర కలాన్ లో తమ సంస్థ ఉత్పత్తిని ప్రారంభిస్తామన్న యంగ్ ల్యూ, అందుకు సీఎం కేసీఆర్ సహకారాన్ని కోరారు.
తద్వారా ప్రపంచ ప్రఖ్యాత ఫాక్స్‌కాన్ కంపెనీ తెలంగాణలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలా ? వద్దా ? అనే సందిగ్ధంలో ఉందని ఒక వర్గం చేస్తున్న పుకార్లకు తెరపడ్డట్టయింది. మార్చి 2, 2023న జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్‌తో జరిగిన చర్చలను తన లేఖలో చైర్మన్ ప్రస్తావించారు. హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా తనకు మరియు తన బృందానికి అందించిన ఆతిథ్యానికి ఆయన సీఎం కేసీఆర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లో బస చేసిన సమయంలో తాము అద్భుతమైన సమయాన్ని గడిపామని చైర్మన్ తన పర్యటన గురించి వివరించారు.
సీఎం కేసీఆర్ ఆతిథ్యం తనను బాగా ఆకట్టుకున్నదని చైర్మన్ తన లేఖలో తెలిపారు. తన పుట్టిన రోజున స్వదస్తూరితో సీఎం కేసీఆర్ గ్రీటింగ్ కార్డు ఇవ్వడం వ్యక్తిగతంగా వారికి అమితానందాన్ని కలిగించింది. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కూడా. ముఖ్యంగా సీఎం కేసీఆర్ గారి దార్శనికత తనకు స్పూర్తిదాయకమని యంగ్ ల్యూ పేర్కొనడం తెలంగాణకు గర్వకారణం అని చెప్పవచ్చు. అదే విషయాన్ని తన లేఖలో పేర్కొన్నారు. ‘‘తెలంగాణ అభివృద్ధి దిశగా పురోగమించడానికి మీరు చేస్తున్న కృషి, కనబరుస్తున్న దార్శనికతల నుంచి నీను స్పూర్తిని పొందాను’’ అని ఒక అంతర్జాతీయ ప్రముఖ సంస్థ ఛైర్మన్ స్వయంగా ప్రకటించడం గొప్ప విషయం. అంతే కాకుండా వారు సీఎం కేసీఆర్ ను మన దేశం నుంచి లభించిన ఆత్మీయుడుగా భావించారు. తన సంస్థ వ్యాపార విస్తరణకు తెలంగాణ సరైన గమ్యస్థానమని వారు భావించారు.
‘‘ నాకు ఇప్పుడు భారతదేశంలో కొత్త స్నేహితుడు ఉన్నారు. భవిష్యత్తులో మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నాను.’’ అని చైర్మన్ యంగ్ లీ స్పష్టం చేశారు. తైవాన్లో కేసీఆర్‌కు ఆతిథ్యం ఇవ్వడం తన గౌరవమని పేర్కొంటూ చైర్మన్ యంగ్ లియు తన వ్యక్తిగత అతిథిగా తైవాన్‌కు ముఖ్యమంత్రికి ఆహ్వానం పంపారు. త్వరలో కేసీఆర్‌ను కలవాలని ఎదురుచూస్తున్నానని లేఖను ముగించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడమే కాకుండా తాను తెలంగాణ అభివృద్ధి పట్ల సిఎం కేసీఆర్ గారి కృషి దార్శనికత పట్ల ఎంతగానో ప్రేరణ పొందినట్టుగా ఈ లేఖ ద్వారా స్పష్టమౌతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో కంపెనీ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ చైర్మన్ ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ (హాన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కో. లిమిటెడ్), యంగ్ లియు సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖ పారిశ్రామిక రంగంలో రాష్ట్రానికి దక్కిన గొప్ప విజయం.
మీరూ జాగ్రత్త
కొంగరకలాన్లో తైవాన్ సంస్థ ఆసక్తి చూపెట్టగానే ముందుగా సంతోషించేది రియల్ ఎస్టేట్ వర్గాలే. ఆ ప్రాజెక్టు ఎప్పుడు వచ్చనో.. ప్రారంభించేదెప్పుడో తెలియదు కానీ.. ఈ లోపు ప్లాట్ల రేట్లను అమాంతం పెంచేస్తారు. కాబట్టి, ఈ ప్రకటన వచ్చినంత మాత్రాన కొంగరకలాన్లో రాత్రికి రాత్రే అద్భుతం జరగదని గుర్తుంచుకోెండి. ఈ సంస్థ కేవలం సానుకూలత వ్యక్తం చేసింది. ఆ సంస్థ ప్రతినిధులొచ్చి స్థలాన్ని చూసి.. అన్ని రకాల అనుమతులు తీసుకుని.. పరిశ్రమను ఆరంభించేందుకు కొంత సమయం పడుతుంది. కాబట్టి, రియల్ సంస్థలు మరియు మధ్యవర్తులు చెప్పే మాటల్ని నమ్మకుండా.. ఈ ప్రాంతంలో అధిక ధర పెట్టి భూములు కానీ ప్లాట్లు కానీ కొనుగోలు చేయకండి. ఈ ప్రకటన రాక ముందు ఎంత రేటుందో చూసి.. దాన్ని ప్రకారమే తుది నిర్ణయం తీసుకోండి.
This website uses cookies.