Categories: TOP STORIES

కో వర్కింగ్ స్పేస్ కు పెరుగుతున్న డిమాండ్!

రియల్ ఎస్టేట్ రంగంలో తన ప్రత్యేకతను చాటుతున్న హైదరాబాద్.. కో వర్కింగ్ స్పేస్ లో కూడ దూసుకుపోతోంది. రోజు రోజుకు కో వర్కింగ్ స్పేస్ కు పెరుగుతున్న డిమాండ్ మేరకు నిర్మణరంగ సంస్థలు ఆ వైపు దృష్టి సారించాయి. దీంతో హైదరాబాద్ లో కో వర్కింగ్ స్పేస్ నిర్మాణాలు జోరందుకున్నాయి. కో వర్కింగ్ స్పేస్ నిర్మాణాలు, లీజింగ్ లో దేశంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలది సగం వాటా అని నివేదికలు చెబుతున్నాయి. భవిష్యత్తులో హైదరాబాద్ కో వర్కింగ్ స్పేస్ కన్స్ట్రక్షన్ లో నెంబర్ వన్ ప్లేస్ ను ఆక్రమించడం ఖాయమని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా ఐటీ, ఫార్మా, ఆర్ధిక రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగునంగా రియల్ రంగంలోను ఛేంజ్ వస్తోంది. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా నిర్మాణాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రత్యేకించి ఐటీ ఆఫీస్ లలో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. హైదరాబాద్‌ లో కో వర్కింగ్ స్పేస్ మార్కెట్‌ బాగా పుంజుకుంటోంది. భవిష్యత్తంతా కో వర్కింగ్ స్పేస్ దేనని ఐటీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పలు ఐటీ, స్టార్టప్ కంపెనీలు కో వర్కింగ్ స్పేస్ అవసరాన్ని గుర్తిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ తదితర కార్యాలయాలు భవనాల్లోనే ఉండాల్సిన పనిలేదు. సుమారు పదేళ్ల నుంచి మన దేశంలో కో-వర్కింగ్ పరిశ్రమ మెల్ల మెల్లగా పుంజుకుంటున్నా, గత మూడేళ్ల నుంచి క్రమంగా వృద్ధి చెందుతోంది

షాపింగ్‌ మాల్స్‌ లో, హోటళ్లలో, మల్టిఫ్లెక్స్ లలో ఎక్కడైనా ఉండే వెసులుబాటే కో వర్కింగ్ స్పేస్ ప్రత్యేకతగా చెప్పాలి. కో వర్కింగ్ స్పేస్ నిర్మాణాల్లో బెంగళూరు నగరం మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది. భారత్ లోని కోవర్కింగ్ స్పేస్ లీజింగ్ కార్యకలాపాల్లో సగం వాటా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలదేననీ, ఈ క్రమంలో నిర్మాణ రంగంలో గృహ, వాణిజ్య, రిటైల్‌, వేర్‌ హౌసింగ్‌, కో లివింగ్‌, హాస్పిటాలిటీతో పాటూ కార్యాలయాల్లో కొత్తగా కో వర్కింగ్ స్పేస్ విభాగంలోనూ అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఐటీ కంపెనీలతో పాటు, స్టార్టప్ సంస్థలు, ఇంక్యుబేటర్స్‌, బిజినెస్‌ సెంటర్లు ఎక్కువగా కో వర్కింగ్ స్పేస్ లలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ఐటీ కంపెనీలు కో వర్కింగ్ స్పేస్ వైపు మొగ్గుచూపుతుండటంతో ఈ పరిశ్రమకు డిమాండ్‌ ఏర్పడింది. రిమోట్‌ వర్కింగ్‌ పై విశ్వసనీయత, అనుమానం కారణంగా 90 శాతం కంపెనీలు ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌ వైపు మళ్లేందుకు ఇష్టపడుతున్నాయి.

హైబ్రిడ్‌ పని విధానం వైపు మొగ్గుచూపిస్తున్న కంపెనీలు ఎక్కువగా కో-వర్కింగ్‌ స్పేస్‌ వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆ తరువాత హబ్‌ అండ్‌ స్పోక్‌ మోడల్‌ తో పాటు ఇప్పటికే ఉన్న ఆఫీస్‌ లే-అవుట్‌ మార్పు కోసం కో వర్కింగ్ స్పేస్ ను ఇష్టపడుతున్నారని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రదానంగా కో వర్కింగ్‌, ఫ్లెక్సిబుల్ , మేనేజ్ స్పేస్ లను పూర్తి ఫర్నిచర్‌ తో, పనిచేసేందుకు సౌకర్యవంతంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వర్క్ స్పేస్ ను ఇతర సంస్థల ఉద్యోగులతో పంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకే కార్యాలయంలో ఎక్కువ సంస్థలు అద్దెకుంటాయి. అవసరమయితే కో వర్కింగ్ స్పేస్ ను ఒక రోజు కూడా అద్దెకు తీసుకోవచ్చు. కంపెనీల అవసరాలు, ఉద్యోగుల సంఖ్య, పని దినాలు, పనిచేసే సమయం వంటి అంశాలన్నింటిని పరిగిణలోకి తీసుకుని కో వర్కింగ్ స్పేస్ ను రెంట్ కు తీసుకుంటారు. ఇలాంటి వెసులుబాటు ఉండటమే కో వర్కింగ్ స్పేస్ ప్రత్యేకత. హైదరాబాద్‌ లో ఐదేళ్ల క్రితం 12 లక్షల చదరపు అడుగులు ఉన్న కో వర్కింగ్ స్పేస్ డిమాండ్ ఇప్పుడు 80 లక్షలకు పెరిగింది. హైదరాబాద్ లో ఎక్కువగా దేశీయ ఐటీ, ఫార్మా, ఆర్ధిక రంగ సంస్థలే లీజింగ్‌ వ్యవహారాలను చక్కబెడుతున్నాయి.

ఐటీ కార్యాలయాలు ఉన్నచోట కో వర్కింగ్ స్పేస్ కు అధికంగా డిమాండ్‌ ఉంది. ఐటీ సంస్థల ఉత్పాదకత పెంచేందుకు ఫ్లెక్సీ స్పేస్‌లు దోహదం చేస్తున్నాయని ఆయా సంస్థలు చెబుతుండటంతో వీటికి క్రమంగా డిమాండ్‌ పెరుగుతోంది. వచ్చే ఐదేళ్లలో ఈ పరిశ్రమ ప్రతి సంవత్సరం 20 శాతం వృద్ధి రేటుతో రెట్టింపు కానుందని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ లో ఈ తరహా కార్యాలయాల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని రియల్ రంగ సంస్థలు ఫ్లెక్సిబుల్ స్పేస్ నిర్మాణాలపై దృష్టి సారించాయి.

This website uses cookies.