ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చాక నయా పైసా కూడా జీఎస్టీ కట్టక్కర్లేదనే విషయం ఇళ్ల కొనుగోలుదారులకు తెలిసిందే. అందుకే, అధిక శాతం మంది ఓసీ వచ్చిన ప్రాజెక్టుల్లోనే ఫ్లాట్లను కొనడానికి ఇష్టపడతారు. అయితే ఓసీ అందుకున్న ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొన్నా.. జీఎస్టీ కట్టాలంటూ అధికారులు డెవలపర్లకు తాఖీదులను అందజేస్తున్నారు. దీంతో, ఏం చేయాలో అర్థంకాక కొందరు నగర డెవలపర్లు తల పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిసి దీనిపై స్పష్టత తీసుకోవాలని పలువురు డెవలపర్లు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
జీఎస్టీ అధికారుల వరుస దాడులతో హైదరాబాద్ నిర్మాణ రంగంలో కలకలం చెలరేగుతోంది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అందుకున్న ప్రాజెక్టుల మీద కూడా జీఎస్టీని కట్టాలంటూ అధికారులు నోటీసుల్ని జారీ చేయడంతో ఆశ్చర్యపోయిన డెవలపర్లు.. ఓసీ వచ్చిన తర్వాత ఎందుకు కట్టాలంటూ ప్రశ్నిస్తున్నారు. మొన్నటి వరకూ ప్లాట్ల మీద జీఎస్టీ తప్పనిసరి అన్నారు. ఆతర్వాత అక్కర్లేదనే తీర్పులు వెలువడ్డాయి. అసలీ జీఎస్టీకి సంబంధించి ఎందుకీ గందరగోళం ఏర్పడుతుందని డెవలపర్లు ప్రశ్నిస్తున్నారు. రోజుకో నిబంధన ఎందుకు మారుతోందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఒక ప్రాజెక్టును కట్టేందుకు డెవలపర్లు స్థలయజమానులతో అంగీకారం కుదుర్చుకుని అపార్టుమెంట్లను నిర్మిస్తారన్న విషయం తెలిసిందే. ఒప్పంద ప్రకారం ఎవరి ఫ్లాట్లను వాళ్లు విక్రయిస్తారు. ఈ క్రమంలో డెవలపర్లు అమ్మిన ఫ్లాట్లకు కొనుగోలుదారుల నుంచి వసూలు చేసే జీఎస్టీ ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారు. కాకపోతే, చాలామంది స్థలయజమానులు తాము విక్రయించిన ఫ్లాట్ల మీద జీఎస్టీని చెల్లించట్లేదు. ఈ సొమ్మూ డెవలపర్లే కట్టాలని అంటున్నారు. వాళ్లు అమ్మే ఫ్లాట్ల మీద తామెందుకు కడతామని డెవలపర్ల వాదన. అయితే, అధికారులేమో స్థల యజమానుల బదులు బిల్డర్లకు జీఎస్టీ నోటీసులను అందజేస్తున్నారు. ముక్కుపిండి డెవలపర్లతో జీఎస్టీని కట్టిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు స్థల యజమానులేమో ఏకంగా డెవలపర్ల మీద కేసులు కూడా పెడుతున్నారని తెలిసింది.
సాధారణంగా డెవలపర్లు ఏం చేస్తున్నారంటే.. హైదరాబాద్‌లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ని అందుకున్నాక.. బయ్యర్ల నుంచి జీఎస్టీ వసూలు చేయట్లేదు. కానీ, వీటి మీద కూడా జీఎస్టీ కట్టాలని అధికారులు దాడులు చేస్తుండటంతో ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి, నగరంలో డెవలపర్లు ఇప్పుడిప్పుడే పారదర్శకత వైపు అడుగులు వేస్తున్నారు. కొనుగోలుదారుల నుంచి జీఎస్టీని వసూలు చేసి.. ఠంచనుగా డిపార్టుమెంటుకు చెల్లిస్తున్నారు. కానీ, స్థల యజమానులు విక్రయించే ఫ్లాట్ల ఫ్లాట్ల మీద తమను జీఎస్టీ కట్టాలనడం సమంజసం కాదని డెవలపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ చేసేటప్పుడే జీఎస్టీ కట్టాలా? లేకపోతే ఫ్లాట్లను అమ్మిన తర్వాత కట్టాలా? అనే అంశం మీద స్పష్టత కావాలని కోరుతున్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ఠమైన మార్గదర్శకాల్ని విడుదల చేయాలని అభ్యర్థిస్తున్నారు.
కొందరు కొనుగోలుదారులు స్థలయజమాని వద్ద ఫ్లాట్లను కానీ విల్లాలను కానీ ఎందుకు కొంటున్నారో తెలుసా? గచ్చిబౌలి వంటి ప్రాంతంలో చాలామంది భూయజమానులు ప్రభుత్వ విలువ మీదే రిజిస్ట్రేషన్ చేయడమే ఇందుకు ప్రధాన కారణం. ఉదాహరణకు, గచ్చిబౌలిలో ఒక బిల్డర్ చదరపు అడుక్కీ రూ.8500 చొప్పున ఫ్లాట్ విక్రయిస్తున్నాడని అనుకుందాం. అదే ప్రాజెక్టులో స్థలయజమాని చదరపు అడుక్కీ రూ.500 తగ్గించి ఫ్లాట్లను విక్రయిస్తున్నాడు. అంతేకాకుండా, చదరపు అడుక్కీ రూ.3000 చొప్పున రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అంటే, సదరు స్థలయజమాని ఐదు వేల చదరపు అడుగుల మీద స్టాంప్ డ్యూటీ అస్సలు కట్టడం లేదన్నమాట. జీఎస్టీ కూడా చెల్లించట్లేదు కాబట్టి కొనుగోలుదారులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. కాకపోతే, ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుతోంది. అంటే, స్థలయజమాని వద్ద ఫ్లాట్లు కొంటే జీఎస్టీ, స్టాంప్ డ్యూటీని తగ్గించుకోవచ్చని బయ్యర్లు భావిస్తున్నారు. ఇలాంటి తప్పుడు విధానాలపై జీఎస్టీ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వీటి మీద స్పష్టత కావాలి!
ల్యాండ్ లార్డ్ ఫ్లాట్ల మీద జీఎస్టీ ఎవరు కట్టాలి?
అతను కట్టకపోతే డెవలపర్ ఏం చేయాలి?
లీగల్ నోటీసు పంపిస్తే సరిపోతుందా?
బిల్డర్ కట్టమంటే ఎక్కడ్నుంచి చెల్లించాలి?
This website uses cookies.