కర్ణాటకలో గతేడాది 2630కి పైగా ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా పూర్తి కాలేదని ఆ రాష్ట్ర రెరా వెల్లడించింది. ఈ ప్రాజెక్టుల్లో దాదాపు సగం బెంగళూరులోనే ఉన్నాయని తెలిపింది.
బెంగళూరులో 1301 ప్రాజెక్టులు జాప్యమయ్యాయని వివరించింది. కర్ణాటక రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (కె రెరా) డేటా ప్రకారం, 1,007 ప్రాజెక్టులు ఇప్పటికే పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏ ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ వ్యవధి గడువు ముగిసిందో తెలియజేస్తూ కె రెరా తన వెబ్ సైట్ లో వివరాలు అందుబాటులో ఉంచింది. ప్రాజెక్టుల జాప్యంపైనా, కె రెరా చర్యలపైనా పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ, కర్ణాటక రెరా, ప్రభుత్వ సంస్థలు సరిగా వ్యవహరించలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఇప్పటికే ప్రధాని మోదీకి డిజిటల్ సౌత్ ట్రస్ట్ అనే సంస్థ లేఖ రాసింది. గృహ కొనుగోలుదారులను మరింత దోపిడీ నుండి రక్షించడానికి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగూ రియల్-టైమ్ ప్రాజెక్ట్ పర్యవేక్షణ చేయాలని కోరింది.
రెరా చట్టం ప్రకారం డెవలపర్లు ప్రతి ప్రాజెక్టును రెరాలో నమోదు చేసుకోవాలి. ఆ ప్రాజెక్టు పూర్తికి ఎంత సమయం పడుతుందో చెప్పి ఆ మేరకు అనుమతి పొందాలి. ఒకవేళ ఏవైనా సమస్యలు, అనుకోని అడ్డంకుల కారణంగా ప్రాజెక్టు నిర్దేశిత గడువులోగా పూర్తి కాకుంటే ఆ వివరాలను రెరాకు తెలియజేసి గడువు పొడిగింపు కోరాలి. అయితే, కర్ణాటకలో చాలా ప్రాజెక్టుల గడువు ముగిసినా.. ఆ మేరకు దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇళ్ల కొనుగోలుదారులు తాము ఎంచుకున్న ప్రాజెక్టుకు నిర్దేశిత గడువు ఉందో లేదో పరిశీలించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
This website uses cookies.