దేశంలో లగ్జరీ రియల్ ఎస్టేట్ కు ప్రాధాన్యం పెరుగుతన్న క్రమంలో అందుబాటు, మధ్యస్థ ఇళ్ల లభ్యత కూడా తగ్గుతోంది. రూ.కోటి కంటే తక్కువ ధర ఉన్న ఇళ్ల సరఫరా గతేడాది 30 శాతం తగ్గిందని ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రధాన నగరాల్లో ఈ విభాగంలోని ఇళ్ల సరఫరా 2023లో 2,83,323 యూనిట్లు ఉండగా.. 2024లో 1,98,926 యూనిట్లకు తగ్గింది. 2022లో 3,10,216 యూనిట్లుగా ఇది ఉంది. అంటే ఈ ఇళ్ల సరఫరా క్రమంగా తగ్గుతూ వస్తోందని నివేదిక తెలిపింది. దీనిని బట్టి చూస్తే ఈ తొమ్మది నగరాల్లో (హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, పుణె, థానే, నవీ ముంబై, కోల్ కతా, ఢిల్లీ) అందుబాటు ఇళ్ల సంక్షోభం మొదలైనట్టే భావించొచ్చని వ్యాఖ్యానించింది.
హైదరాబాద్ లో ఏకంగా 58 శాతం తగ్గుదల నమోదైంది. మన భాగ్యనగరంలో ఈ ఇళ్ల సరఫరా 2023లో 31,645 యూనిట్లు ఉండగా.. 2024 వచ్చేసరికి 13,238 యూనిట్లకు తగ్గింది. ఢిల్లీలో 2023లో 4,726 యూనిట్ల సరఫరా ఉండగా.. 2024లో 43 శాతం తగ్గుదలతో 2,672 యూనిట్లకు చేరింది. బెంగళూరులో 11 శాతం తగ్గి 25,012 యూనిట్లకు పడిపోయింది. అంతకుముందు సంవత్సరంలో అది 28,206 యూనిట్లుగా ఉంది. చెన్నైలో కొత్త సరఫరా 13,852 యూనిట్ల నుంచి 12,743 యూనిట్లకు తగ్గింది. కోల్కతాలో 18,406 యూనిట్లతో పోలిస్తే 41 శాతం తగ్గి 10,785 యూనిట్లకు చేరుకుంది. ముంబైలో 8,763 యూనిట్ల నుంచి 31 శాతం క్షీణతతో 6,062 యూనిట్లకు పడిపోయిందని నివేదిక వెల్లడించింది. మొత్తమ్మీద గత రెండేళ్లలో హైదరాబాద్ లో ఈ ఇళ్ల సరఫరా 69 శాతం తగ్గినట్టు నివేదిక తెలిపింది. అదే సమయంలో ముంబైలో 60 శాతం, ఢిల్లీలో 45 శాతం తగ్గుదల నమోదైంది.
ప్రస్తుతం భారతదేశ జనాభాలో 8% మంది టైర్ 1 నగరాల్లో నివసిస్తున్నారు. ఉపాధి అవకాశాల కోసం ఎక్కువ మంది ప్రజలు ఈ నగరాలకు తరలివెళ్లడం వల్ల వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య విపరీతంగా పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి అందుబాటు, మధ్యస్థ ఇళ్ల సరఫరాను పెంచకపోతే ఆస్ట్రేలియా, కెనడాల్లో జరిగిన హౌసింగ్ సంక్షోభానికి దారి తీసే ప్రమాదం ఉంది’’ అని ప్రాప్ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసుజా హెచ్చరించారు. పెరుగుతున్న వలసలు, పెరుగుతున్న మైక్రో కుటుంబాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, రాబోయే ఐదేళ్లలో ఈ నగరాల్లో 1.5 కోట్ల గృహాలు అవసరమవుతాయని అంచనా వేసినట్టు చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, ప్రభుత్వం సరసమైన మరియు మధ్య-ఆదాయ గృహాలను ఆచరణీయ ఎంపికగా మార్చడానికి పన్ను తగ్గింపులు, రాయితీల ద్వారా డెవలపర్లను ప్రోత్సహించాలని, అలాగే గృహ రుణ రాయితీలు, స్టాంప్ డ్యూటీల్లో మినహాయింపుల ద్వారా కొనుగోలుదారులకు ప్రయోజనాలను అందించాలని సూచించారు.
This website uses cookies.