Categories: TOP STORIES

అపార్ట్ మెంట్ లో ఫ్లాటా లేక విల్లానా?

రియల్ ఎస్టేట్ లో ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతోంది. ఒకప్పుడు వ్యక్తిగత ఇళ్లకు డిమాండ్ ఉండగా.. ఇప్పుడు అపార్ట్ మెంట్ కల్చర్ పెరిగింది. అది కాస్త విల్లాల వరకు విస్తరించింది. ప్రస్తుతం లగ్జరీ అపార్ట్ మెంట్స్, విల్లాలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. దీంతో విల్లా కొనడం బెటరా లేదంటే అపార్ట్ మెంట్ కొనాలా అన్న సందేహం చాలా మందిలో మెదులుతోంది. మరి ఈ విషయంలో రియల్ రంగ నిపుణులు ఏంచెబుతున్నారు?

నిర్మాణరంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. గతంలో చిన్న పాటి ఇళ్ల నిర్మాణం నుంచి మొదలైన కన్స్ట్రక్షన్ రంగం ఇప్పుడు హద్దులు లేని ఆకాశాన్ని తాకుతోంది. ఇండిపెండెంట్ ఇళ్ల నుంచి అపార్ట్ మెంట్స్, స్కైస్క్రాపర్స్, విల్లాల వరకు అభివృద్ధి చెందింది. పెరుగుతున్న నగర జనాభా మేరకు నివాస భవనాల మార్కెట్ అంచనాలను మించి ముందుకెళ్తోంది. ఈ క్రమంలో ప్రస్తుత రియల్ ఎస్టేట్ మార్కెట్ లో వ్య క్తిగత అభిరుచులు, జీవనశైలి ఇంటి కొనుగోలులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఒకరు ప్రశాంతంగా ఉండే చోట నివసించాలనుకుంటే, మరొకరు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రాంతంలో ఇల్లు కావాలని కోరుకుంటుంటారు. కొన్నిసార్లు అవసరాలను బట్టి కూడా నిర్ణయాలు మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే  ఏ అవసరమైనా దానికి తగ్గ ఇళ్లు అందుబాటులో ఉండటం హైదరాబాద్‌ ప్రకత్యేకత.

ఇంటి కొనుగోలులో ఎవరికెన్ని ఆలోచనలు, ఇష్టాలు ఉన్నా చివరికి ఏది కొనాలనేది కొనుగోలుదారుడి బడ్జెట్‌ నిర్ణయిస్తుంది. తమకు కావాల్సిన ప్రదేశంలో సాధారణంగా ఫ్లాట్‌ తో పోలిస్తే విల్లా ధర ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత ఇంటికి కూడా ఎక్కువ ధర పెట్టాల్సి వస్తుంది. వ్యక్తిగత ఇళ్లలో మెయింటెనెన్స్ తక్కువగా ఉన్నప్పటికీ.. అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్‌, విల్లాలో ఈ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. గేటెడ్‌ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లలో, విల్లాలలో గార్డెనింగ్‌, స్విమ్మింగ్ ఫూల్, స్పోర్స్ట్ క్లబ్, క్లబ్‌హౌస్‌ సౌకర్యాలతో నిర్వహణ ఖర్చులు ఇంకా ఎక్కువగా ఉంటాయి. హైదరాబాద్ లో భారీ అపార్ట్ మెంట్స్ ఎక్కువగా సిటీకి దగ్గర్లో కడుతున్నారు. చాలావరకు మౌళిక వసతులన్నీ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే అపార్ట్ మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. నగర శివారు ప్రాంతాల్లో సైతం ఆపార్ట్ మెంట్ కల్చర్ బాగా పెరిగింది. మొత్తానికి కొనుగోలుదారులకు ఫ్లాట్ల ఎంపికకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: ‘భూదాన్‌’ అక్రమాల్లో ఐఏఎస్, ఐపీఎస్‌లు

అపార్ట్ మెంట్స్ ఉన్న చోట చుట్టుపక్కల స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ తో పాటు అన్నీ అందుబాటులో ఉంటాయి. అదే విల్లా అయితే చాలా వరకు నగర శివారు ప్రాంతాల్లో ఉన్నాయి. అవుటర్‌ రింగ్ రోడ్డు పరిసరాల్లో విల్లా ప్రాజెక్టులు చాలావరకు కడుతున్నారు. వ్యక్తిగత ఇళ్లు సైతం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు బయట.. అవుటర్‌ రింగ్ రోడ్డు లోపల అందుబాటులో ఉన్నాయి. వీటి చుట్టుపక్కల సౌకర్యాలన్నీ అందుబాటులోకి వచ్చేవరకు కొంత సమయం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇక అపార్ట్ మెంట్ లో ఫ్లాట్లను 1500 చదరపు అడుగుల నుంచి  16వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. డబుల్ బెడ్రూం నుంచి 6 బెడ్రూంల వరకు నిర్మిస్తున్నారు. ఎంత విశాలమైనప్పటికీ ఫ్లాట్‌ అనగానే ఇరుకిరుకు అనే భావన ఉంటుంది. అయితే ఇవి చిన్న కుటుంబాలకు అనువుగా ఉంటాయి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్థులైతే ఎక్కువ సమయం బయటే కాబట్టి వీరికి ఫ్లాట్‌ అనువుగా ఉంటుంది.

పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబాలు ఉన్నవారు వ్యక్తిగత ఇల్లు, విల్లాలవైపు మొగ్గు చూపవచ్చు. కుటుంబ సభ్యులకు స్వేచ్ఛ కూడా ఇక్కడ ఎక్కువే లభిస్తుంది. పెట్టుబడి దృష్ట్యా సైతం వీటిని కొనుగోలు చేయవచ్చు. విల్లా అయితే తమకు నచ్చినట్లుగా ఇంటిని మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. శివార్లలో వ్యక్తిగత గృహాలు, విల్లాలు విసిరేసినట్లుగా ఉంటాయి. ఇక్కడ అభివృద్ధి చెందాలంటే మరికొంత సమయం పడుతుంది. అదే నగరంలోని ప్రధానమైన ప్రాంతాల్లో విల్లా కొనాలంటే మాత్రం కోట్లల్లో ఖర్చు చేయాల్సిందే.

హైదరాబాద్ లో ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాలు, సమీప ప్రాంతాల్లో విల్లా కనీసం 8 కోట్ల నుంచి 25 కోట్ల వరకు ధరలున్నాయి. అదే నగర శివారు ప్రాంతాల్లో అయితే 2 కోట్ల నుంచి 6 కోట్ల వరకు ధరలున్నాయి. అపార్ట్ మెంట్స్ లోను ఇప్పుడు ధరలు తక్కవేమీ లేవు. లగ్జరీ హైరైజ్ భవనాల్లో ప్రాంతాన్ని బట్టి ఫ్లాట్ 1.5 కోట్ల నుంచి 15 కోట్ల వరకు ధరలున్నాయి. గేటెడ్‌ కమ్యూనిటీ విల్లాలు, బహుళ అంతస్తుల్లో మూడంచెల వ్యవస్థ ఉంటుంది. రెండింట్లోనూ సానుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

This website uses cookies.