హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2025 జనవరి-మార్చి) మొత్తం 10,647 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో అమ్మకాలు 14,298 యూనిట్లుగా ఉండడం గమనార్హం. అంతేకాదు దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లోనూ జనవరి-మార్చి కాలంలో ఇళ్ల అమ్మకాలు 19 శాతం తగ్గిపోయాయి. మొత్తం 98,095 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్‌టైగర్ విడుదల చేసింది.
ఇళ్ల ధరలు పెరిగిపోవడం, వృద్ధి తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులు అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు నివేదిక తెలిపింది. అలాగే, ఎనిమిది ప్రముఖ నగరాల్లో మార్చి త్రైమాసికంలో కొత్త ఇళ్ల సరఫరా 10 శాతం తగ్గినట్టు పేర్కొంది. నగరాల వారీగా అమ్మకాలు చూస్తే.. అహ్మదాబాద్‌లో 10,730 ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన 12,915 యూనిట్ల అమ్మకాలతో పోల్చి చూస్తే 17 శాతం తగ్గుదల కనిపించింది. ఢిల్లీ మార్కెట్లో 8,477 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 10,058 యూనిట్లతో పోల్చి చూస్తే 16 శాతం తగ్గాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో అమ్మకాలు 26 శాతం క్షీణించి 30,705 యూనిట్ల ఇళ్లకు పరిమితయ్యాయి. పుణెలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 25 శాతం తక్కువగా 17,228 యూనిట్లుగా ఉన్నాయి. కోల్‌కతాలో విక్రయాలు కేవలం ఒక శాతం తగ్గి 3,803 యూనిట్లుగా ఉన్నాయి. బెంగళూరులో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యకాలంలో ఇళ్ల అమ్మకాలు 13 శాతం పెరిగి 11,731 యూనిట్లుగా నమోదయ్యాయి.
క్రితం ఏడాది ఇదే కాలలో 10,381 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. చెన్నైలోనూ అమ్మకాలు 8 శాతం పెరిగి 4,774 యూనిట్లుగా ఉన్నాయి. జనవరి-మార్చి కాలంలో ప్రముఖ నగరాల్లో కొత్త ఇళ్ల సరఫరా 10 శాతం తగ్గి 93,144 యూనిట్లుగా ఉంది. ‘‘ధరలు గణనీయంగా పెరగడం విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపించింది. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం కొత్త అనిశ్చితులను తీసుకొచ్చింది. ఇలాంటి తరుణంలో కొనుగోళ్ల పట్ల అప్రమత్తంగా వ్యవహరించడం సాధారణంగా కనిపించేదే’’అని ప్రాప్ టైగర్, హౌసింగ్ డాట్ కామ్ గ్రూప్ సీఈవో ధ్రువ్ అగర్వాల్ తెలిపారు.
This website uses cookies.