- ఈ ఏడాది ప్రథమార్ధంలో
15 లక్షల చదరపు అడుగుల లీజు
లీజింగ్ విషయంలో హైదరాబాద్ దూసుకెళ్తోంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో 15 లక్షల చదరపు అడుగుల స్పేస్ లీజుకు సంబంధించిన లావాదేవీలు జరిగాయి. ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పై ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం హైదరాబాద్ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ లీజు స్పేస్ 15 లక్షల చదరపు అడుగులకు చేరగా.. సరఫరా మాత్రం 9 లక్షల చదరపు అడుగుల వద్దే ఉంది.
లీజింగ్ లో 3పీఎల్ సంస్థ 46 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా.. 21 శాతంతో ఈ కామర్స్, 9 శాతం వాటాతో రిటైల్ సంస్థలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్ లో ఫ్లిప్ కార్ట్ 2,75,000 చదరపు అడుగుల ఇండిపెండెంట్ వేర్ హౌస్ ను లీజుకు తీసుకోగా.. టీసీఐ సప్లై సొల్యూషన్స్ 2 లక్షల చదరపు అడుగుల ఇండియన్ లాజిస్టిక్స్ వేర్ హౌస్ ను అద్దెకు తీసుకుంది. ఇక సేఫ్ ఎక్స్ ప్రెస్ 1.4 లక్షల చదరపు అడుగుల ఇండిపెండెంట్ వేర్ హౌస్ ను లీజుకు తీసుకుంది. మరోవైపు హైదరాబాద్ లోని నాలుగు కారిడార్ల(నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్)లోఅద్దెలు పెరిగాయి. నార్త్ కారిడార్ లో ఇది 23 నుంచి 25 శాతం వరకు పెరగ్గా.. ఇతర మైక్రో మార్కెట్లలో 5 నుంచి 12 శాతం వరకు పెరుగుదల నమోదైంది. కాగా, టైర్-1 నగరాల్లో అప్ గ్రెడేషన్, విస్తరణ అవకాశాలపై దృష్టి సారించడం, దిగువ శ్రేణి నగరాల్లో కొత్త మార్కెట్ వ్యాప్తి, అభివృద్ధి చెందుతున్న లాజిస్టిక్స్ హబ్ లలో స్థానిక పంపిణీ నెట్ వర్క్ విస్తరణల నేపథ్యంలో భవిష్యత్తులో మరింత లీజింగ్ కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందని సీబీఆర్ఈ సౌత్ ఏసియా చైర్మన్, ఇండియా సీఈవో అంశుమన్ మేగజైన్ అభిప్రాయపడ్డారు.