దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కి గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి గోల్డ్ రేటింగ్ లభించింది. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఈ సెంటర్ కు సీఐఐ-ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ఈ రేటింగ్ ఇచ్చింది. తెలంగాణ పోలీసులు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గోల్డ్ రేటింగ్ సర్టిఫికెట్ ను ముఖ్యమంత్రి సమక్షంలో డీజీపీ మహేందర్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంతరెడ్డికి ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సి. శేఖర్ రెడ్డి అందజేశారు. దేశంలోనే ఐజీబీసీ రేటింగ్ సాధించిన మొట్టమొదటి పోలీస్ కమిషనరేట్ ఇదే కావడం విశేషం.
550 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ఆన్ సైట్ సోలార్ పీవీ సిస్టమ్, అధిక పనితీరు కలిగిన ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ లు, వంద శాతం ఎల్ఈడీ లైటింగ్, మున్సిపల్ నీటి డిమాండ్ తగ్గించడానికి సమర్థవంతమైన ప్లంబింగ్ ఫిక్చర్లను వినియోగించడం, వంద శాతం మురుగునీటిని అక్కడే శుద్ధి చేసి ల్యాండ్ స్కేపింగ్, ప్లషింగ్ అప్లికేషన్ ల కోసం తిరిగి వాడటం, వంద శాతం స్పేస్ పగటి వెలుగులోనే ఉండటం వంటి అంశాలను పరిశీలించిన తర్వాత గోల్డ్ రేటింగ్ ఇచ్చారు.