Categories: TOP STORIES

రియ‌ల్ రంగానికి చీక‌టి సంవ‌త్స‌రం..

2024 హైద‌రాబాద్
రియ‌ల్ రౌండప్‌..

* ఎయిర్‌పోర్టు మెట్రో ర‌ద్దు
* ఫార్మా కారిడార్ ర‌ద్దు
* హైడ్రా దూకుడు..
* పైస‌లిస్తేనే కొత్త అనుమ‌తులు

* ఆరంభం కాని కొత్త ప్రాజెక్టులు
* డ‌బ్బులిస్తేనే ఎన్వోసీల జారీ
* బ‌య్య‌ర్ల‌లో క‌రువైన ఆత్మ‌విశ్వాసం
* ప‌రారైన రియ‌ల్ ఇన్వెస్ట‌ర్లు

రియ‌ల్ నేప‌థ్యానికి చెందిన రేవంత్ రెడ్డి సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టాక‌.. మార్కెట్ జోష్‌తో ప‌రుగు పెడుతుంద‌ని ఆశించిన వారికీ.. 2024లో ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు క‌నిపించాయి. ఎయిర్‌పోర్టు మెట్రో ర‌ద్దు అన‌గానే ఇన్వెస్ట‌ర్లు న‌గ‌రం నుంచి పారిపోయారు. ఫార్మా సిటీ ర‌ద్దుతో ప్లాట్లు కొన్న‌వారంతా దిగ్భ్రాంతికి లోన‌య్యారు. ప‌క్కా ప్ర‌ణాళిక‌ల్లేకుండా.. ముంద‌స్తు వ్యూహం క‌రువై.. హ‌డావిడిగా ఆరంభ‌మైన‌ హైడ్రా వ‌ల్ల.. రియాల్టీకి ఎక్క‌డ్లేని న‌ష్టం జ‌రిగింది. ఈ రంగాన్ని బెదిరించి సొమ్ములు వ‌సూలు చేయ‌డానికే హైడ్రా బూచి చూపెట్టార‌ని.. నిర్మాణ రంగ‌మంతా గ‌గ్గోలు పెట్టింది. త‌మ వ‌సూళ్ల ప‌ర్వం పూర్త‌య్యాక‌.. రెరా ప్రాజెక్టుల జోలికి వెళ్ల‌మ‌నే ప్ర‌క‌ట‌న‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింద‌నే ప్ర‌చారం జోరుగా జ‌రిగింది. ఏదీఏమైన‌ప్ప‌టికీ, ట్రిపుల్ ఆర్‌, ఫ్యూచ‌ర్‌సిటీల‌తో.. నవంబ‌రు నుంచి మార్కెట్లో పాజిటివ్ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ప్ప‌టికీ, మార్కెట్ కోలుకోవ‌డానికి ఎన్నిరోజులు ప‌డుతుందో తెలియ‌ని దుస్థితి నెల‌కొంది.

భారత‌దేశంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి ప్ర‌త్యేక‌మైన స్థాన‌ముంది. దేశంలోని ప్రధానమైన మెట్రో నగ‌రాల్లో హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోంది. అంతర్జాతీయ మౌలిక వసతులతో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న భాగ్యనగర రియాల్టీ 2024 లో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. 2023 నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు, 2024 మేలో లోక్ సభ ఎన్నికల ప్రభావం.. హైదరాబాద్ రియ‌ల్ ఎస్టేట్ పై స్పష్టంగా కనిపించింది. దీనికి తోడు రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణాయాలు.. హైదరాబాద్ నిర్మాణ రంగంపై పాజిటివ్ తో పాటు నెగిటివ్ ఎఫెక్టును చూపెట్టాయి.

రియాల్టీపై ఎన్నికల ప్రభావం..
హైదరాబాద్ నిర్మాణ రంగంపై అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ప్రభావం స్పష్టంగా కనిపించింది. సరిగ్గా ఏడాది క్రితం నవంబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. అంతకు ముందు మూడు నెలల నుంచే రియల్ ఎస్టేట్ నెమ్మదించింది. ఎన్నికల నేపధ్యంలో మనీ సర్కులేషన్ తగ్గడంతో ఇళ్ల అమ్మకాలపై ప్రభావం పడింది. 2023 జులై నుంచి మొదలు డిసెంబర్ వరకు హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ లావాదేవీలు భారీగా తగ్గాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లోని నిర్మాణ రంగంపై ఎన్నికల ప్రభావం స్పష్టంగా కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో భాగ్యనగరంలో ఇళ్ల అమ్మకాలు 30శాతం మేర తగ్గాయని రియల్ వర్గాలు స్పష్టం చేశాయి. 2024 మే నెలలో వచ్చిన లోక్ సభ ఎన్నికల ప్రబావం కూడా హైదరాబాద్ నిర్మాణ రంగంపై స్పష్టంగా కనిపించింది. కాక‌పోతే ఎన్నికల సమయంలో అమ్మ‌కాలు తగ్గడం సర్వసాధారణమే అయినా.. ఆ త‌ర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ మరికొంత నెమ్మదించింది.

రాయదుర్గం-శంషాబాద్ మెట్రో రద్దు
తెలంగాణలో కొత్తగా అధికారం చేపట్టిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రోపై తీసుకున్న నిర్ణయం హైదరాబాద్ నిర్మాణ రంగంపై ప్రతికూల ప్రభావం చూపించింది. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో రైల్ ప్రాజెక్టు చేపట్టాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించి అందుకు సంబంధించి 2022 డిసెంబర్ 9న శంకుస్థాపన‌ కూడా చేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును రద్దు చేసింది. 2024 డిసెంబర్ 13న రాయదుర్గం-శంషాబాద్ మెట్రో ప్రాజెక్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తారాజువ్వలా దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్ కొంతమేర నెమ్మదించింది. ఈ మెట్రో ప్రాజెక్టుతో గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు భారీగా నివాస, వాణిజ్య నిర్మాణాలకు అవకాశం ఉంటుందని రియాల్టీ వర్గాలు భావించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో రైల్ ను రద్దు చేయడంతో ఒక్కసారిగా అంతా నీరసించిపోయారు. అయినప్పటికీ వెస్ట్ జోన్ రియల్ ఎస్టేట్ కు ఏ మాత్రం ఢోకా లేకున్నా.. రాయదుర్గం-శంషాబాద్ మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కితే మరింత వేగంగా నిర్మాణ రంగం అభివృద్ది చెందేదని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.

ముచ్చర్ల ఫ్యూచర్ సిట్-4.O ప్రకటన
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న ముచ్చర్ల ఫార్మా సిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నట్లు స్పష్టం చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో ఫోర్త్ సిటీని అభివృద్ది చేయనున్నట్లు జులై 31న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫ్యూచర్ సిటీలో విద్య, వైద్యం, క్రీడలు, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సహా పలు రంగాలను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్దం చేస్తోంది. ఆధునిక సమాజంలో యువతకు అవసరమైన నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు ఇక్కడ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుండగా.. అందుకు శంకుస్థాపన కూడా చేశారు. ఇక ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నిర్మించనున్నారు. నగరంతో అనుసంధానం చేస్తూ మెట్రో రైల్ సహా వివిధ ప్రాంతాల నుంచి గ్రీన్ ఫీల్డ్, రేడియల్ రోడ్లను అభివృద్ది చేస్తున్నారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అనేక ఐటీ తదితర కంపెనీలు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. దీంతో ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు రియల్ ఎస్టేట్ కు కేంద్రంగా మారనున్న‌ది.

మెట్రో రెండో దశ విస్తరణ
హైదరాబాద్ లో మెట్రో రైల్ రెండో దశకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నగరంలోని శివారు ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగనున్న‌ది. రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణానికి రూ. 24,269 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రం ప్రభుత్వం పరిపాలనా అనుమతులను జారీ చేసింది. మెట్రో రెండో దశకు అంచనా వ్యయం. హైదరాబాద్ మెట్రో ద్వారా ప్రస్తుతం రోజుకు దాదాపు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. రెండో దశ కూడా అందుబాటులోకి వస్తే రోజుకు మరో 8 లక్షల మంది మెట్రోలో ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండో దశ నిర్మాణ పనులు అయిదు కారిడార్లలో మొత్తం 76.4 కిలో మీటర్ల మేర జరగనున్నాయి. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు 36.8 కి.మీ, రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలీస్ వరకు 11.6 కి.మీ, ఎంజీబీఎస్ నుంచి చంద్ర‌యాన్ గుట్ట వరకు 7.5 కి.మీ, మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు 13.4 కి.మీ, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కి.మీ. మేర కొత్త మెట్రో కారిడార్లు రానున్నాయి. దీంతో నగరంలోని శివారు ప్రాంతాల్లో సైతం నిర్మాణ రంగం జోరందుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇళ్ల అమ్మకాల్లో హెచ్చు తగ్గులు
దేశంలో రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే..ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలతో హైద‌రాబాద్ పోటీపడుతోంది. కొన్నిసార్లు ఈ నగరాలను దాటేసి దూసుకుపోతోంది. హైదరాబాద్ రియాల్టీ గురించి ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 9 నెలల వ్యవధిలో ఇక్కడ 59,386 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలిపింది. వీటి విలువ రూ. 36 వేల కోట్లకు పైనే ఉందని పేర్కొంది. అంతకు ముందు సంవత్సరం 2023లో ఇదే సమయంలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు 52,591 తో పోలిస్తే 13 శాతం పెరిగాయి. ఎక్కువగా రూ. కోటి అంతకు మించి విలువైన ఇళ్లకే డిమాండ్ ఉందని, వీటిల్లో 79 శాతం వృద్ధి కనిపించిందని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. హైదరాబాద్ లో 2024 జనవరి నెలలో 5444 యూనిట్స్ రిజిస్ట్రేషన్ కాగా.. జులైలో అత్యధికంగా 8781 ఇళ్లు రిజిస్టర్ అయ్యాయి. కానీ, సెప్టెంబర్ నెలలోనే రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గి కేవలం 4903 యీనిట్స్ మాత్రమే విక్రయాలు జరిగాయి. ఆగస్టులో సాధారణంగానే రిజిస్ట్రేషన్లు జరగ్గా.. సెప్టెంబరు నెలలో జులైతో పోలిస్తే సగానికి పడిపోయాయి. ఆత‌ర్వాత‌ క్రమంగా రియల్ ఎస్టేట్ మార్కె కోలుకుంటూ స్థిరంగా కొనసాగుతోంది.

హైడ్రా ప్రభావం
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై హైడ్రా ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్ ప్రజలను విపత్తుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వ ఆస్తుల రక్షణ, నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం స‌రికొత్త‌ వ్యవస్థను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పేరుతో జులైలో స్వతంత్ర వ్యవస్థకు రూపకల్పన చేసింది. హైడ్రా వల్ల నగరంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు బాగా తగ్గిపోయాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆగస్టు నెలలో తగ్గిన రిజిస్ట్రేషన్లే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

* హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజ్ గిరి, సంగారెడ్డి జిల్లాల్లో జూలై నెలలో 58 వేల రిజిస్టేషన్లు జరిగితే, ఆగస్టులో అది 41 వేలకు తగ్గడంతో హైడ్రా ప్రభావం ఎంతమేర ఉందజనేది స్పష్టంగా అర్దమవుతోంది. అనుమతులు తీసుకున్న నిర్మాణాల్ని సైతం హైడ్రా కూల్చివేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో హైడ్రా కాస్త దూకుడు తగ్గించి, చెరువుల సర్వే చేపట్టడం.. జులైకి ముందు నిర్మించిన నిర్మాణాల జోలికి వెళ్లమని ప్రకటించడంతో మెల్ల మెల్లగా రియల్ ఎస్టేట్ రంగం కోలుకుంటోంది. హైదరాబాద్ లో క్రమంగా ఇళ్ల అమ్మకాలు పెరుగుతున్నాయి.

భవన నిర్మాణ అనుమతులు
గత ఏడాది 2023తో పోలిస్తే.. ఈ సంవత్సరం 2024 రియల్‌ఎస్టేట్‌ మార్కెట్ పెరిగిందని.. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలకు వచ్చిన దరఖాస్తులే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. భవన నిర్మాణాలకు సంబంధించి ఈ ఏడాది నవంబరు వరకు జీహెచ్‌ఎంసీలో 21,346కు గాను.. 20,240 దరఖాస్తులను అధికారులు పరిష్కరించారు. గత ఏడాది 2023తో పోలిస్తే.. 20 శాతం అధికంగా భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన‌ దరఖాస్తులు వచ్చాయి. ఇదే సమయంలో దరఖాస్తుల పరిష్కారం ఈ ఏడాది 40 శాతం మేర వృద్ధిని నమోదు చేసింది. హెచ్‌ఎండీఏలో లేఅవుట్‌, భవన నిర్మాణాలు, ఆక్యూపెన్సీతో పాటు వివిధ అనుమతుల దరఖాస్తులు ఈ ఏడాది 45 శాతం పెరిగాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. హెచ్ఎండీఏ లోను దరఖాస్తుల పరిష్కారాలు 24 శాతం మేర పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల‌లో భవన నిర్మాణ అనుమతులను వేగవంతం చేసేందుకు ప్రణాళిక విభాగం అధికారులు సాంకేతికతను ఉపయోగించడంతో పాటు ఏఐ సేవలను వాడుకుంటున్నారు.

రికార్డు స్థాయిలో ఆఫీస్ లీజింగ్
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే హైదరాబాద్‌ ముందంజలో ఉంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 25 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ నమోదైంది. గత ఏడాది సగటు త్రైమాసిక లీజు ఒప్పందాలతో పోలిస్తే.. ఇది 11 శాతం అధికమని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.

అనుమ‌తులివ్వాలంటే..
హైద‌రాబాద్‌లో ఎక‌రానికి రెండు ల‌క్ష‌ల కంటే అధిక చ‌ద‌రపు అడుగుల స్థ‌లాన్ని నిర్మించాలంటే.. ప్ర‌భుత్వంలో ఉన్న పెద్ద‌వాళ్ల నుంచి చెప్పిస్తేనే.. అనుమతులిస్తున్నార‌నే ప్ర‌చారం 2024లో ఊపందుకుంది. ప్ర‌భుత్వంలోని ఎవ‌రో పెద్ద వ్య‌క్తుల్ని క‌లిసి.. వారికి ఆమ్యామ్యాలు స‌మ‌ర్పిస్తేనే.. అనుమ‌తులిస్తున్నార‌నే వార్త‌లు మార్కెట్లో గుప్పుమంటున్నాయి. అందుకే, హైద‌రాబాద్‌లో కొత్త ప్రాజెక్టులు ఆరంభం కాక‌పోవ‌డానికిదో ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి, క‌ర్ణుడి చావుకి ల‌క్ష కార‌ణాలు అన్న‌ట్లు.. హైద‌రాబాద్ రియాల్టీ మార్కెట్ కుప్ప‌కూల‌డానికి అనేక కార‌ణాల‌ని చెప్పొచ్చు.

This website uses cookies.