హైడ్రా మళ్లీ రంగంలోకి దిగిందా? అక్రమ కట్టడాలపై విరుచుకు పడేందుకు సన్నద్ధమవుతుందా అంటే ఔననే సమాధానం వినిపిస్తుంది. మూడు నెలల క్రితం దాకా చెలరేగిపోయిన హైడ్రా.. కోర్టు కేసుల నేపథ్యంలో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. గత కొంతకాలం నుంచి చెరువులకు సంబంధించిన సమగ్ర సర్వేను చేపట్టిన హైడ్రా.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను ఫిక్స్ చేసి.. వచ్చే నెల నుంచి మరోసారి విజృంభించేందుకు సిద్ధమవుతోందని సమాచారం.
హైడ్రా.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంతో పాటు సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. దీన్ని దెబ్బకు నిర్మాణ రంగం పూర్తిగా చతికిలాపడింది. ఎవరూ ఔనన్నా కాదన్నా ఇది ముమ్మాటికి నిజం. అందుకే, ఇల్లు కొనాలంటేనే చాలామంది భయపడుతున్న పరిస్థితి నెలకొంది. హైడ్రాపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడింది. న్యాయ స్థానాల్లో పిటీషన్లు దాఖలు కావడంతో.. హైడ్రా కాస్త వెనక్కి తగ్గింది. చెరువుల ఆక్రమణలకు సంబంధించి.. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లపై హైకోర్టు ఆదేశాలతో.. హైడ్రా మూడు నెలల క్రితం చెరువుల సర్వేను చేపట్టింది. నీటిపారుదల, రెవెన్యూ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, సర్వే అండ్ సెటిల్ మెంట్ డిపార్ట్ మెంట్ అధికారులు చెరువుల సర్వే పనుల్లో నిమగ్నమయ్యారు. చెరువులు, జలాశయాల ఎఎప్టీఎల్, బఫర్ జోన్ల పరిధి, విస్తీర్ణం తేల్చడం దాదాపు కొలిక్కి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. చెరువుల సర్వే కోసం అత్యాధునిత సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరికరాలను ఉపయోగిస్తున్నారు. సర్వే పూర్తయిన తరువాత అధికారిక వెబ్ సైట్లో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల వివరాలను పొందుపరుస్తారు.
మార్చి నెలాఖరుకల్లా చెరువులు, జలాశయాల సర్వేను హైడ్రా పూర్తి చేస్తుంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఫిక్స్ చేసి, ఆ వివరాలన్నీ కోర్టుకు సమర్పిస్తుంది. ఆ తర్వాతే ఏప్రిల్ నుంచి హైడ్రా మళ్లీ రంగంలోకి దిగేలా ప్లాన్ చేస్తోందని సమాచారం. న్యాయపరమైన చిక్కులు లేకుండా అక్రమ నిర్మాణాల్ని కూల్చేసేలా హైడ్రా కసరత్తు చేస్తోంది. అంతే కాకుండా కబ్జాకు గురైన చెరువులకు పూర్వ వైభవం కల్పించే దిశగా అడుగులేస్తోందని సమాచారం. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న వారిపైన కఠినంగా వ్యవహరిస్తుందని తెలిసింది. అయితే ఇంతకు ముందులా ప్రభుత్వ అనుమతులు తీసుకుని నిర్మించుకున్న ఇళ్లు, అపార్టుమెంట్లను కూల్చివేస్తే ప్రయత్నం చేస్తే మాత్రం.. ప్రజల నుంచి గట్టి వ్యతిరేకత ఏర్పడే ప్రమాదముంది. ఏదీఏమైనా, సీఎం రేవంత్ రెడ్డి తుది నిర్ణయంపై హైడ్రా పనితీరు ఆధారపడుతుందని చెప్పొచ్చు.
This website uses cookies.