Categories: TOP STORIES

ప్రీ ఈఎంఐలో కొంటే ప్రయోజనమేనా?

  • పన్ను ప్రయోజనం నిల్
  • ఆదాయం లేనివారికీ ఓకే

గృహ రుణానికి సంబంధించి నిర్దేశించిన నెలవారీ వాయిదా (ఈఎంఐ)ల కంటే ముందు వచ్చే వాయిదాలను ప్రీ ఈఎంఐలు అంటారు. సాధారణ ఈఎంఐను ప్రధాన రుణ మొత్తాన్ని, ఆ రుణంపై వర్తించే వడ్డీ రేటును కలిపి చెల్లించే విధంగా లెక్కిస్తారు. అయితే, ప్రీ ఈఎంఐ విధానంలో మాత్రం కేవలం రుణంపై వడ్డీని మాత్రమే తిరిగి చెల్లిస్తారు. ఈ చెల్లింపు విధానంలో ప్రధాన రుణ మొత్తం ప్రభావితం కాదు. ప్రస్తుతం గృహ రుణానికి మాత్రమే అందుబాటులో ఉన్న ప్రీ ఈఎంఐ విధానంలో రుణ గ్రహీత అంగీకరించిన మేరకు ఇల్లు లేదా భవనం నిర్మాణ దశ ప్రకారం ఫైనాన్షర్ రుణాన్ని పంపిణీ చేస్తాడు. నిర్మాణ సమయంలో వడ్డీ మొత్తం పాక్షిక చెల్లింపుల్లో కట్టాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత రుణ గ్రహీత సాధారణ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇల్లు లేదా భవనం నిర్మాణం జరుగుతున్న సమయంలో తీసుకున్న రుణంపై కేవలం వడ్డీ మాత్రమే చెల్లించాల్సి వస్తుంది. ఫలితంగా రుణ గ్రహీతపై పెద్దగా భారం పడదు.

ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత నుంచి సాధారణ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. రుణ గ్రహీత నెలవారీ ఈఎంఐలు చెల్లించడానికి తగినంత ఆదాయ సామర్థ్యం కలిగి లేనప్పుడు ప్రీ ఈఎంఐ విధానం ఎంచుకోవాలి. ఉదాహరణకు ఓ వ్యక్తి 20 ఏళ్ల కాలానికి గృహ రుణం తీసుకున్నారు. అతడు ప్రీ ఈఎంఐ పద్ధతి ఎంచుకుని నిర్మాణం పూర్తయ్యే వరకు ఆ విధానంలో చెల్లించారు. ఐదేళ్లలో ఇంటి నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత నుంచి 20 ఏళ్ల కాలవ్యవధికి సంబంధించిన అసలు ఈఎంఐలు ప్రారంభమవుతాయి. అంటే.. మొత్తం అతడు ఐదేళ్లపాటు రుణంపై వడ్డీని, 20 ఏళ్లపాటు సాధారణ ఈఎంఐని చెల్లించినట్టు. అయితే, రుణదాతకు వడ్డీని మాత్రమే చెల్లించే ప్రీ ఈఎంఐ విధానంలో పన్ను ప్రయోజనాలు ఉండవు. ఈఎంఐ విషయంలో రుణ గ్రహీత ముందుగా చెల్లించిన మొత్తం వడ్డీని క్లెయిమ్ చేసే సదుపాయాన్ని కలిగి ఉంటారు.

This website uses cookies.