పెరుగుతున్న ఇళ్ల ధరలకు కాస్త కళ్లెం పడనుందా? ఏటా క్రమం తప్పకుండా భారీగా పెరుగుతున్న రెసిడెన్షియల్ రేట్ల వేగానికి కొంచెమైనా బ్రేక్ పడనుందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల ధరల పెరుగుదల 5 శాతం లోపే ఉంటుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. పెద్ద సంఖ్యలో కొత్త లాంచ్ లు రానుండమే ఇందుకు కారణమని విశ్లేషించింది. వార్షిక ప్రాతిపదికన ఇళ్ల ధరలు 2024 ఆర్థిక సంవత్సరంలో 22 శాతం పెరిగాయి. అయితే, తాజా ఆర్థిక సంవత్సరంలో అది 5 శాతానికే పరిమితమవుతుందని నివేదిక అంచనా వేసింది.
2023 ఆర్థిక సంవత్సరంలో చాలామటుకు పాత స్టాక్ క్లియర్ కావడం, భూముల ధరలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఉన్న స్టాక్ కు డిమాండ్ పెరిగి ఇళ్ల ధరలు 14 శాతం పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగం స్థిరంగా కొనసాగుతుందని, వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటం, అందుబాటు ఇళ్ల లభ్యత ఆశించిన స్థాయిలో ఉండటంతో ధరల పెరుగుదల స్వల్పంగానే ఉంటుందని నివేదిక వెల్లడించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అద్భుతమైన పనితీరు కనబరిచిందని, ఇళ్ల ధరలు, వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ చివరి 9 నెలల్లో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 25 శాతం మేర పెరిగాయని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఇళ్ల అమ్మకాలు 8 శాతం నుంచి 10 శాతం మేర వృద్ధి చెందుతాయని అంచనా వేసింది.
This website uses cookies.