అసలు తెలంగాణ ముఖ్యమంత్రికి సలహాలు ఎవరిస్తున్నారో తెలియదు కానీ.. ఆయన్ని మొత్తం తప్పుదోవ పట్టిస్తున్నారని నిర్మాణ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే, గత డిసెంబరులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. ఆయన ఎయిర్‌పోర్టు మెట్రో రద్దు అన్నారు. ఫార్మాసిటీని రద్దు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మార్కెట్ కుదుటపడుతుందని అనుకోగానే.. హైడ్రాను రంగంలోకి దింపి రచ్చరచ్చ చేశారు. నగర రియల్ రంగం కుదుటపడక ముందే భూములు, ఫ్లాట్ల మార్కెట్ విలువలను పెంచాలని సర్కార్ నిర్ణయించింది. అసలే ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పుడు.. ఇలా మార్కెట్ విలువల్ని పెంచకుండా.. రియల్ రంగంలో సానుకూల వాతావరణం నెలకొల్పే దిశగా నిర్ణయాలు తీసుకోవచ్చు కదా అని నిపుణులు సూచిస్తున్నారు. భూముల మార్కెట్ విలువల్ని పెంచేందుకు ఎవరికీ వ్యతిరేకత లేదు. కాకపోతే, మార్కెట్ కుదుటపడ్డాక చేస్తే మేలని అంటున్నారు.
తెలంగాణలో స్థిరాస్తుల మార్కెట్ విలువల పెంపుకు రంగం సిద్దమైంది. రాష్ట్రంలో ప్రాంతాన్ని బట్టి 100 శాతం నుంచి 400 శాతం మేర స్థిరాస్తుల మార్కెట్ విలువలను పెంచేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్దం చేసింది. పెంచిన స్థిరాస్తుల మార్కెట్ విలువలు ఏప్రిల్ నుంచి అమలయ్యే విధంగా రెవెన్యూ శాఖ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో భూములకు సంబంధించి.. బహిరంగ మార్కెట్ కు, రిజిస్ట్రేషన్ విలువలకు భారీ వ్యత్యాసం ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు గత గత పది నెలలుగా రేవంత్ సర్కార్ భూముల మార్కెట్ విలువల పెంపుపై అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే పలు రకాల నివేదికలతో మార్కెట్ విలువల్లో హెచ్చుతగ్గులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. పలు సవరణ ప్రతిపాదనల్ని సిద్ధం చేశారు. ఏటా భూముల విలువ పెంచాలని, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆరేళ్ల తర్వాత భూముల విలువలు పెంచడానికి రంగం సిద్ధమైంది. ఫ్లాట్ల ధరలను ఆయా ప్రాంతాలను బట్టి 15-30 శాతం, స్థలాల విలువను ఒకటి నుంచి నాలుగు రెట్లు వరకు పెంచే అవకాశం ఉంది.
వ్యవసాయ భూములు, స్థలాల విషయంలో ఇప్పుడున్న పుస్తక విలువను సవరించి ప్రాంతాన్ని బట్టి 100 నుంచి 400 శాతంపైగా పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం కనిష్టంగా 75 వేలుగా ఉంది. దీంతో ఇప్పుడు ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువను కనిష్టంగా 2 లక్షల వరకు సవరించొచ్చు. ఇక జాతీయ రహదారులు, ఇతర కమర్షియల్ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను 100 శాతం నుంచి 400 శాతం మేర పెంచనున్నట్లు తెలుస్తోంది. నగరాలు, పట్టణాల్లో ఇంటి స్థలాలు, అపార్ట్ మెంట్స్ లోని ఫ్లాట్స్ విలువలను సైతం సవరించేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం అపార్ట్ మెంట్ లో చదరపు అడుగు ఫ్లాట్ ధర రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువ ప్రకారం నగరాల్లో సగటున 3200 ఉంది. దీన్ని 60 శాతం మించకుండా పెంచాలని సర్కారు భావిస్తోంది. అంటే చదరపు అడుగు ధర 5120 వరకు కానుంది.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో బాగా అభివృద్ది చెందిన మోకిలా, మహేశ్వరం లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ భూములు, ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ విలువలు చాలా తక్కువగా ఉన్నాయి. మోకిలలో చదరపు గజం 2300 ఉండగా, మహేశ్వరంలో గజం 2100 మాత్రమే ఉంది. అందుకే ఇలాంటి ప్రాంతాల్లో స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ విలువలను భారీగా పెంచే అవకాశం ఉంది. హైదరాబాద్ లాంటి చోట్ల కొండాపూర్, గచ్చిబౌలిలో రిజిస్ట్రేషన్ శాఖ విలువ ప్రకారం ఇంటి స్థలం ప్రస్తుతం చదరపు గజం ధర 26,700 గా ఉంది. ఇదే వాణిజ్య స్థలమైతే గజం 44,900 ఉంది. నార్సింగ్‌లో గజం 23,800, మణికొండలో 23,900, రాయదుర్గంలో 44,900, బుద్వేల్‌లో 10,200గా ఉంది. ఇటీవల హెచ్ఎండీఏ వేలంలో బుద్వేల్‌లో ఎకరా సుమారు 40 కోట్లు పలికింది. మహేశ్వరంలో గజం 2100, వాణిజ్య స్థలం 10,200 చొప్పున పుస్తక విలువలు ఉన్నాయి. అయితే మహేశ్వరం లాంటి చోట్ల 2100 ఉన్న విలువను 300 నుంచి 400 శాతం పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇలా 3 వేల కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లోని మార్కెట్ విలువలను సవరించనున్నారని అధికారులు చెబుతున్నారు.
This website uses cookies.