హైదరాబాద్‌లో కొత్త గృహాల ప్రారంభాలలో నూతనోత్తేజం నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ (క్యూ2)లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో కొత్తగా 36,260 గృహాలు ప్రారంభం కాగా.. ఇందులో హైదరాబాద్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. నగరంలో 8,850 యూనిట్లు లాంచింగ్ కాగా.. ఆ తర్వాతి స్థానాలలో 6,880 యూనిట్లతో ముంబై, 6,690 గృహాలతో బెంగళూరు నగరాలు నిలిచాయి. సెకండ్ వేవ్‌లోను లాక్‌డౌన్, పరిమిత స్థాయిలో ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో చాలా వరకు ప్రాజెక్ట్‌లు డిజిటల్‌లోనే లాంచింగ్ అయ్యాయి.
హైదరాబాద్‌లో ఈ ఏడాది క్యూ2లో ప్రారంభమైన కొత్త గృహాలలో 75 శాతం యూనిట్లు రూ.80 లక్షల నుంచి రూ.2.5 కోట్ల మధ్య ధర ఉన్న ప్రీమియం విభాగానివే. గత త్రైమాసికంతో పోలిస్తే లాంచింగ్స్‌లో 30 శాతం క్షీణత ఉందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ తెలిపింది. ఇక, విక్రయాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో 2021 క్యూ2లో 3,240 గృహాలు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే సమయంలో కేవలం 660 యూనిట్లు సేల్ అయ్యాయి. ఈ ఏడాది జనవరి–మార్చి (క్యూ1)లో విక్రయాలు 4,400 యూనిట్లుగా ఉన్నాయి. అంటే ఏడాదితో పోలిస్తే 385 శాతం వృద్ధి కాగా.. గత త్రైమాసికంతో పోలిస్తే 26 శాతం క్షీణత.
2021 క్యూ2లో మొత్తం 36,260 గృహాలు ప్రారంభమయ్యాయి. గతేడాది క్యూ2లో ఇవి 1,400 గృహాలుగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరి–మార్చి (క్యూ1)తో పోలిస్తే 42 శాతం క్షీణత నమోదయింది. 2021 క్యూ1లో 62,130 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. 2021 క్యూ2లోని మొత్తం లాంచింగ్స్‌లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి దక్షిణాది నగరాల వాటా 51 శాతంగా ఉంది. కొత్త గృహాల ప్రారంభాలలో అత్యధికం వాటా ప్రీమియం ఇళ్లదే. రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధర ఉన్న గృహాల వాటా 36 శాతంగా ఉంది. రూ.40–80 లక్షల ధర ఉన్న మిడ్‌సైజ్ విభాగం వాటా 32 శాతం కాగా.. రూ.40 లక్షల లోపు ధర ఉన్న అఫర్డబుల్ హౌసింగ్ విభాగం వాటా 20 శాతంగా ఉన్నాయి.
ఈ ఏడాది క్యూ2లో ఏడు ప్రధాన నగరాల్లో 24,570 గృహాలు విక్రయమయ్యాయి. గతేడాది క్యూ2లో ఇవి 12,740 యూనిట్లుగా ఉన్నాయి. ఏడాది కాలంతో పోలిస్తే 93 శాతం వృద్ధి నమోదయింది. అదే ఈ ఏడాది క్యూ1లో 58,920 యూనిట్లు అమ్ముడుపోయాయి. అంటే క్రితం త్రైమాసికంతో పోలిస్తే 58 శాతం క్షీణత. 2021 క్యూ2లోని మొత్తం గృహాల విక్రయాలలో ముంబై, పుణే నగరాల వాటా 46 శాతంగా ఉంది. 2021 క్యూ1లో ఏడు నగరాలలో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) 6,41,860 కాగా.. క్యూ2 నాటికి 6,53,540కి పెరిగాయి. వార్షిక ప్రాతిపదికన బెంగళూరు, ఎన్‌సీఆర్ నగరాలలో గృహాల ధరలు 3 శాతం వృద్ధి చెందగా.. హైదరాబాద్, పుణే, చెన్నై, ఎంఎంఆర్‌లలో 1 శాతం మేర పెరిగాయి.
గతేడాది దేశవ్యాప్తంగా పూర్తి స్థాయి లాక్‌డౌన్ కారణంగా గృహాల విక్రయాలు, ప్రారంభాలు తక్కువగా ఉన్నాయి. అదే సెకండ్ వేవ్‌లో రాష్ట్రాలు కేసుల స్థాయి, తీవ్రతను బట్టి స్థానికంగా లాక్‌డౌన్‌ను విధించాయి. దీంతో గతేడాదితో పోలిస్తే గృహాల విక్రయాలు, లాంచింగ్స్‌లో మెరుగుదల కనిపించిందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనుజ్ పూరీ తెలిపారు. సెకండ్‌వేవ్ ప్రభావం చిన్న, అసంఘటిత రంగ డెవలపర్ల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. విక్రయాలలో చిన్న డెవలపర్లతో పోలిస్తే లిస్టెడ్/ ప్రముఖ డెవలపర్లు ఆధిపత్యాన్ని చెలాయించారు. గతంలో లిస్టెడ్, చిన్న డెవలపర్ల మధ్య విక్రయాల నిష్పత్తి 40:60గా ఉండగా.. ప్రస్తుతమిది 43:57కు చేరింది. 2017లో ఈ నిష్పత్తి 17:83గా ఉండేది. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ఆంక్షల సడలింపు, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావటం వల్ల రాబోయే త్రైమాసికంలో గృహ విక్రయాలలో స్థిరమైన వృద్ధి నమోదవుతుందని తెలిపారు. చాలా మంది గృహ కొనుగోలుదారులు పెద్ద సైజు గృహాల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు.
నగరం క్యూ2–2021 క్యూ1–2021 క్యూ2–2020
ఎన్‌సీఆర్ 3,820 6,750 0
ఎంఎంఆర్ 6,880 14,820 0
బెంగళూరు 6,690 7,690 590
పుణే 4,920 13,820 750
హైదరాబాద్ 8,850 12,620 0
చెన్నై 3,110 4,620 0
కోల్‌కతా 1,990 1,810 50
మొత్తం 36,260 62,130 1,390
నగరం క్యూ2–2021 క్యూ1–2021 క్యూ2–2020
ఎన్‌సీఆర్ 3,470 8,790 2,100
ఎంఎంఆర్ 7,400 20,350 3,620
బెంగళూరు 3,560 8,670 2,990
పుణే 3,790 10,550 2,160
హైదరాబాద్ 3,240 4,400 660
చెన్నై 1,590 2,850 480
కోల్‌కతా 1,520 2,680 730
This website uses cookies.