REGISTRATIONS DULL
గతనెలలో ముంబై రిజిస్ట్రేషన్ల తీరిది
దేశంలో ఖరీదైన రియల్ ఎస్టేట్ గా పేరు పొందిన ముంబైలో గతనెలలో రిజిస్ట్రేషన్లు పెరిగినా.. స్టాంపు డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయం తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ లో రిజిస్ట్రేషన్లు 4 శాతం మేర పెరిగి 12వేలకు చేరుకోగా.. స్టాంపు డ్యూటీ ఆదాయం 6 శాతం తగ్గి రూ.990 కోట్లకు పరిమితమైంది. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖ గణాంకాల ప్రకారం. ఏప్రిల్లో 12,142 కంటే ఎక్కువ ప్రాపర్టీలు రిజిస్టర్ అయ్యాయి. గతేడాది ఏప్రిల్ లో ఇది 11,648గా ఉంది. లావాదేవీలు పెరిగినా ఆదాయం మాత్రం తగ్గింది. గతేడాది ఏప్రిల్ లో స్టాంపు డ్యూటీ ద్వారా వచ్చిన ఆదాయం రూ. 1,058 కోట్లు ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్ లో అది రూ.990 కోట్లకు తగ్గింది.
రెండేళ్ల విరామం తర్వాత మహారాష్ట్ర సర్కారు రెడీ రికనర్ రేట్లను సగటున 3.89 శాతం పెంచడం రిజిస్ట్రేషన్లపై ప్రభావం చూపి ఉండొచ్చని అంచనా. కాగా, రిజిస్ట్రేషన్లలో రెసిడెన్షియల్ ప్రాపర్టీల హవా కొనసాగింది. ఏప్రిల్ రిజిస్ట్రేషన్లలో 80% రెసిడెన్షియల్ కు సంబంధించినవే. అలాగే రూ.2 కోట్లు, అంతకంటే ఎక్కువ ధర కలిగిన ప్రాపర్టీల రిజిస్ట్రేషన్ల వాటా గతేడాది ఏప్రిల్ లో 22 శాతం ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్ లో 25 శాతానికి పెరిగింది.
రూ.50 లక్షల కంటే తక్కువ ధర కలిగిన ప్రాపర్టీల రిజిస్ట్రేషన్ల వాటా 14% వద్ద స్థిరంగా ఉంది. పరిమాణపరంగా 1,000 చదరపు అడుగుల వరకు ఉన్న అపార్ట్ మెంట్లు రిజిస్ట్రేషన్లలో ముందంజలో ఉన్నాయి. 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల వరకు ఉన్న యూనిట్లు 14% స్థిరమైన వాటాను కొనసాగించగా, 2,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉన్నవి 3% వద్ద స్థిరంగా ఉన్నాయి.
This website uses cookies.