Categories: TOP STORIES

అట్ట‌హాసంగా ఆరంభ‌మైన.. న‌రెడ్కో ప్రాప‌ర్టీ షో

  • రెరా త‌ర్వాత బిల్డ‌ర్ల‌కు పెరిగిన గౌర‌వం
  • డెవలపర్లు ఐదు అంశాల‌పై దృష్టి సారించాలి
  • ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల్ని ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించాలి
  • ప్రభుత్వం స్థ‌ల‌మిస్తే 30 ల‌క్ష‌ల్లోపు ఇళ్లు కట్టిస్తాం
  • నాలుగు వైపులా కొత్త లాజిస్టిక్ పార్కులు
  • మేకా విజ‌య్‌సాయి, సాగ‌ర్ ల‌కు ప్ర‌శంస‌లు

(కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌)

నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని ప్ర‌భుత్వ విప్, శేరిలింగంప‌ల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలిపారు. ధ‌ర‌ణి, నాలాలో స‌మ‌స్య‌లున్నాయ‌ని గత వారం బిల్డ‌ర్లు ఒక స‌మావేశంలో చెప్పార‌ని.. వీటిలో కొన్ని స‌మ‌స్య‌ల్ని అర‌వింద్ కుమార్ ప‌రిష్క‌రించార‌ని గుర్తు చేశారు. నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి వ‌ద్ద ప్ర‌స్తావించాన‌ని, వాటిని ప‌రిష్క‌రించాల‌ని ఆయ‌న సీఎస్ సోమేష్ కుమార్‌కి చెప్పార‌ని వివ‌రించారు. వీటికి అతి త్వ‌ర‌లో ప‌రిష్కారం ల‌భిస్తుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్ బిల్డ‌ర్లు అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడుకున్న నిర్మాణాల్ని చేప‌డుతున్నార‌ని అరికెపూడి గాంధీ ప్ర‌శంసించారు.

ఎమ్మెల్సీ భానుప్ర‌సాద్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత రియ‌ల్ రంగం గ‌ణ‌నీయంగా అభివృద్ధి చెందుతుంద‌న్నారు. ఈ రంగం ఎదుర్కొంటున్న చిన్న చిన్న స‌మస్య‌ల్ని ప్ర‌భుత్వం ప‌రిష్క‌రిస్తుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. రూ. 20 నుంచి 30 ల‌క్ష‌ల్లోపు గృహాల్ని కొనుక్కోవాల‌ని భావించేవారికి నిర్మాణాల్ని చేప‌ట్టాల‌ని సూచించారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి సాయం కావాల‌న్నా అందించేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని అన్నారు.

నాలుగు కొత్త లాజిస్టిక్ పార్కులు

న‌గ‌రం నాలుగువైపులా నాలుగు అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కుల‌ను అభివృద్ధి చేసేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నామ‌ని.. ఇవి రుద్రారం, తూప్రాన్‌, శంషాబాద్‌, ఈస్ట్ హైద‌రాబాద్లో ఏర్పాటు అవుతాయ‌ని పుర‌పాల‌క శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ వెల్ల‌డించారు. హైద‌రాబాద్లో ఇళ్ల అమ్మ‌కాలు గ‌త మూడేళ్ల‌లో యాభై శాతం పెరిగాయ‌ని వెల్ల‌డించారు. కీస‌ర‌, ఘ‌ట్‌కేస‌ర్ వంటి ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం జోరుగా జ‌రుగుతుంద‌న్నారు. గ‌త ఎనిమిదేళ్ల‌లో ఒక్క సంవ‌త్స‌రంలోనూ ఇళ్ల ధ‌ర త‌గ్గిన సంద‌ర్భం లేద‌న్నారు. ఎస్సార్డీపీ కింద ఇప్ప‌టివ‌ర‌కూ 19 ఫ్లైఓవ‌ర్ల‌ను నిర్మించామ‌ని.. ఇది రానున్న రోజుల్లోనూ కొన‌సాగుతుంద‌న్నారు.

నాగోలు ఫ్లైఓవ‌ర్ అతిత్వ‌ర‌లో ఆరంభిస్తామ‌ని తెలిపారు. సుమారు రూ.985 కోట్ల వ్య‌యంతో న‌గ‌రంలో నాలాల‌ను అభివృద్ధి చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. నాలాల‌ను వెడ‌ల్పు చేసే కార్య‌క్ర‌మంలో.. స్థ‌ల‌య‌జ‌మానుల‌కు టీడీఆర్‌ను వ‌ర్తింపజేసేలా బిల్డ‌ర్లు విజ‌య్‌సాయి, సాగ‌ర్ లు జీహెచ్ఎంసీతో క‌లిసి ఒప్పంద ప‌త్రాన్ని రూపొందించార‌ని ప్ర‌శంసించారు. ఇదే విధానాన్ని ఇత‌ర బిల్డ‌ర్లు అనుస‌రించాల‌ని తద్వారా అభివృద్ధి ప‌నులు కొన‌సాగుతాయ‌ని తెలిపారు. నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్ని క‌లిసిక‌ట్టుగా ప‌రిష్క‌రించుకుందామ‌ని అన్నారు. హైద‌రాబాద్‌లో బిల్డ‌ర్లు నిర్మిస్తున్న క‌ట్ట‌డాలు ప్ర‌కృతితో మ‌మేకం అయ్యేలా దర్శ‌న‌మిస్తున్నాయ‌ని.. ఈ ఘ‌న‌త ఇతర న‌గ‌రాల్లో క‌నిపించ‌ద‌ని ఓ జాతీయ ఫోటోగ్రాఫ‌ర్ ప్ర‌శంసించిన విష‌యాన్ని గుర్తు చేశారు.

రెరాతో బిల్డ‌ర్ల‌కు గౌర‌వం..

న‌రెడ్కో జాతీయ అధ్య‌క్షుడు రాజ‌న్ బండేల్క‌ర్ మాట్లాడుతూ.. మ‌నిషి జీవితంలో రోటీ, క‌ప‌డా మ‌రియు మ‌కాన్ ముఖ్య‌మ‌న్నారు. ఇల్లు లేక‌పోతే పెళ్లికి పిల్ల‌ను కూడా ఇవ్వ‌ర‌ని తెలిపారు. అంత కీల‌క‌మైన ఇళ్ల నిర్మాణాన్ని చేప‌ట్టేవారికి గ‌తంలో అంత‌పెద్ద మ‌ర్యాద ద‌క్కేద‌ని కాద‌ని గుర్తు చేశారు. రెరా వ‌చ్చిన త‌ర్వాతే స‌మాజంలో బిల్డ‌ర్ల‌కు గౌర‌వ‌మ‌ర్యాద‌లు పెరిగాయ‌ని తెలిపారు. భ‌వ‌న నిర్మాణ కార్మికుల్లో నైపుణ్యాల్ని పెంపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అప్పుడే నిర్మాణ ప‌నుల్లో వృథా అనేది గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంద‌న్నారు.

న‌రెడ్కో నేష‌న‌ల్ అడ్వైజ‌ర్ గౌత‌మ్ ఛ‌ట‌ర్జీ మాట్లాడుతూ.. 2017వ సంవ‌త్స‌రం భార‌త రియ‌ల్ రంగంలో సువ‌ర్ణాక్ష‌రాల‌తో నిండిన సంవ‌త్స‌రం అన్నారు. రెరా ఆరంభ‌మై సుమారు ఐదేళ్ల‌య్యింద‌ని తెలిపారు. రియ‌ల్ రంగంలో ఉన్న ప్ర‌తిఒక్కరూ ఐదు అంశాల్ని త‌ప్ప‌నిస‌రిగా గుర్తుంచుకోవాల‌ని తెలిపారు. పార‌ద‌ర్శ‌క‌త‌, ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌, జ‌వాబుదారీత‌నం, రెరా చ‌ట్టానికి అనుగుణంగా ఉండ‌టంతో పాటు కొనుగోలుదారుల్లో న‌మ్మ‌కాన్ని ఏర్పాటు చేయాల‌న్నారు. గ‌త ఏడు ద‌శాబ్దాలుగా క‌రువైన ఈ న‌మ్మ‌కమే రెరా త‌ర్వాత డెవ‌ల‌ప‌ర్‌కు బ‌య్య‌ర్‌కు మ‌ధ్య ఏర్ప‌డింద‌న్నారు. ఈ రంగంపై ల‌క్ష‌లాది మంది ఉద్యోగులు, అనేక అనుబంధ ప‌రిశ్ర‌మ‌లు ఆధార‌ప‌డ్డాయ‌ని అన్నారు. భార‌తదేశ జీడీపీ నిర్మాణ రంగంపై ఆధార‌ప‌డుతుంద‌న్నారు.

ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి..

తెలంగాణ ప్ర‌భుత్వం ప్రోత్సాహాక‌ర నిర్ణ‌యాల వ‌ల్ల ఐటీ రంగం గ‌ణనీయంగా అభివృద్ధి చెందుతోంద‌ని ట్రెడా అధ్య‌క్షుడు సునీల్ చంద్రారెడ్డి తెలిపారు. గూగుల్‌, అమెజాన్‌, క్వాల్‌కామ్ వంటి బ‌డా సంస్థ‌లు న‌గ‌రంలో కొలువుదీరాయ‌ని అన్నారు. గ‌తేడాది ఐటీ ఎగుమ‌తులు 26.1 శాతం పెరిగాయ‌ని, 1.5 ల‌క్ష‌ల కొత్త ఉద్యోగాలు ఏర్ప‌డ్డాయ‌ని వెల్ల‌డించారు. దేశంలో ముప్ప‌య్ ఆప‌రేషన‌ల్ ఎస్ఈజెడ్‌లు ఉన్న రాష్ట్రంలో తెలంగాణ అని కొనియాడారు. టెక్నాల‌జీ కంపెనీల‌కు హైద‌రాబాద్ స్వ‌ర్గ‌ధామంగా మారింద‌న్నారు. లైఫ్ సైన్సెస్ విభాగంలో 35 శాతం ఉత్ప‌త్తి నగ‌రంలోనే జ‌రుగుతోంద‌ని గుర్తు చేశారు. ధ‌ర‌ణిలో సుమారు ప‌ది ల‌క్ష‌ల ఫిర్యాదులు న‌మోదయ్యాయని.. అస‌లైన కొనుగోలు ప‌త్రాలు ధ‌రణిలో లేవ‌న్నారు. కాబ‌ట్టి ఈ స‌మ‌స్య‌ను త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో క్రెడాయ్ హైద‌రాబాద్ అధ్య‌క్ష కార్య‌ద‌ర్శులు రామ‌కృష్ణారావు, రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, టీబీఎఫ్ అధ్య‌క్షుడు ప్ర‌భాక‌ర్ రావు, ఉపాధ్య‌క్షుడు విద్యాసాగ‌ర్‌, క్రెడాయ్ తెలంగాణ అధ్య‌క్షుడు మురళీకృష్ణారెడ్డి, ఛైర్మ‌న్ రామ‌చంద్రారెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ ఇంధ్ర‌సేనారెడ్డి, ప్రేమ్ కుమార్‌, ముప్పా వెంక‌య్య చౌద‌రి, పి.ద‌శ‌ర‌థ్‌రెడ్డి, పీఎస్ రెడ్డి, శ్రీధ‌ర్ రెడ్డి, చ‌ల‌ప‌తిరావు, వాస‌వి సీఎండీ ఎర్రం విజ‌య్ కుమార్‌, రాజ‌పుష్ప ప్రాప‌ర్టీస్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రెడ్డి, హాల్ మార్క్ గోపాల‌కృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ప్ర‌భుత్వం స్థ‌ల‌మిస్తే.. ఫ్లాట్లు క‌ట్టిస్తాం..

అందుబాటు గృహాల్ని నిర్మించేందుకు బిల్డ‌ర్లు ఎప్పుడు ముందుకొస్తార‌ని కాక‌పోతే స్థ‌లం ధ‌ర‌లు అనూహ్యంగా పెరిగినందు వ‌ల్ల సాధ్యం కావ‌డం లేదని న‌రెడ్కో తెలంగాణ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మేకా విజ‌య్ సాయి తెలిపారు. ప్ర‌భుత్వం వేలం పాట‌ల్ని నిర్వ‌హించ‌డం వ‌ల్ల అక్క‌డి చుట్టుప‌క్కల ప్రాంతాల్లో ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతున్నాయ‌ని.. ఫ‌లితంగా బిల్డ‌ర్లు కూడా నిర్మాణాల్ని చేప‌ట్ట‌డం క‌ష్టం అవుతుంద‌న్నారు. ప్ర‌భుత్వం బిల్డ‌ర్ల‌కు జాయింట్ డెవ‌ల‌ప్‌మెంట్ అగ్రిమెంట్ కింద స్థ‌లాల్ని కేటాయిస్తే.. అందుబాటు ధ‌ర‌లో ఇళ్ల‌ను నిర్మిస్తామన్నారు. గ‌తంలో స‌రూర్‌న‌గ‌ర్‌లో ఇదే విధానంలో అపార్టుమెంట్ల‌ను క‌ట్టిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు.

This website uses cookies.